- అధిక ఉష్ణోగ్రతలతో ఆవిరైన 646 టీఎంసీల జలాలు
- కడలిపాలైన మరో 986 టీఎంసీలు
- పడిపోతున్న భూగర్భ జలమట్టాలు
- వరద వచ్చినప్పుడు నిల్వచేసుకోలేని దుస్థితి
విశాలాంధ్ర-సచివాలయం: ఆకాశం నుండి చుక్క నీరు రాలడం లేదు… నేల వైపు చూస్తే ఉన్న కొద్దిపాటి జలాలూ నిలవడం లేదు. ఎల్‌నినో ప్రభావంతో రుతుపవనాలు ముఖం చాటేయడం, వర్షాకాలంలోనూ తీవ్రమైన వేసవిని తలపించేలా నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో రాష్ట్రంలో తాగునీటి కొరత తప్పేలా లేదు. భానుడి అసాధారణ ప్రతాపం కారణంగా నదులు, ప్రాజెక్టులు, చెరువుల్లోని ఉపరితల నీరే కాకుండా, భూమి పొరల్లో దాగి ఉండి పైరుకు జీవం పోసే ప్రతి తేమ చుక్క కూడా వేగంగా ఆవిరైపోతుండటం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. గత మూడు నెలల్లోనే ఏకంగా 646.13 టీఎంసీల నీరు గాల్లో కలిసిపోగా, మరోవైపు సరైన నిల్వ, మళ్లింపు వసతులు లేకపోవడం వల్ల 986.04 టీఎంసీల విలువైన నీరు సముద్రంలోకి కొట్టుకుపోయింది. మనం మూడు నెలల్లో వినియోగించుకున్న నీటి కంటే ఆవిరైన, కడలిపాలైన నీటి శాతమే ఐదు రెట్లు ఎక్కువగా ఉండటం రాబోయే తీవ్ర నీటి కొరత, కరవు ఛాయలకు స్పష్టమైన సంకేతంగా నిలుస్తోంది. సాధారణంగా మండు వేసవిలో రిజర్వాయర్లు, జలాశయాల నుంచి ఉపరితల నీరు ఆవిరికావడం సహజమే కానీ, వర్షాకాలంలో కూడా వాతావరణం చల్లబడకపోవడం, భానుడి తాపానికి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవడంతో తీవ్రమైన వేడికి భూమి పొరల్లో ఉన్న నీరు, నేలలోని జీవ తేమ కూడా ఆవిరి అవుతోంది. మారుతున్న అసాధారణ వాతావరణ పరిస్థితులపై జలవనరుల శాఖ నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మే నుంచి ఆగస్టు 28వ తేదీ మధ్య నమోదైన డేటా ప్రకారం ఇలా ఆవిరైన నీటి పరిమాణమే 646.13 టీఎంసీలుగా తేలింది. భూగర్భ జలమట్టాలు ఉన్నపళంగా పడిపోవడానికి కూడా ఇదే ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. వర్షాలు పడకపోవడమే కాకుండా, పెరిగిన వేడి వల్ల నేలలో ఉన్న తేమ ఇంకిపోతుండటంతో పంటల పెంపకానికి అవసరమైన తడి అందక రైతాంగం తల్లడిల్లుతోంది. భూమిలోని తేమ ఆవిరైపోవడం వల్ల నేల సారవంతత దెబ్బతినడమే కాకుండా పంటల వేర్లు త్వరగా ఎండిపోయే పరిస్థితులు దాపురిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఖరీఫ్ పంటలను కాపాడుకోవడమే కాక రాబోయే రబీ సీజన్ నాటికి నీటి కొరత తీవ్ర స్థాయిలో ముంచుకొచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సముద్రంపాలైన 986 టీఎంసీలు
రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ, కొన్ని బేసిన్‌లలో అక్కడక్కడా కురిసిన వర్షాల వల్ల నదుల్లోకి భారీగానే వరద నీరు వచ్చి చేరింది. అయితే ఆ నీటిని సకాలంలో అందిపుచ్చుకుని నిల్వ చేసుకునేలా తగిన నిర్మాణాలు, రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యం లేకపోవడంతో ఆ జలాలు సముద్రం పాలు కాక తప్పలేదు. నదుల ద్వారా 984.87 టీఎంసీలు, మైక్రో బేసిన్‌ల ద్వారా మరో 1.17 టీఎంసీలు చొప్పున మొత్తం 986.04 టీఎంసీలు సముద్రంలో కలిసిపోయాయి. పంటలకు, చెరువులకు వాడుకునే వీలున్న నీటిని కూడా సక్రమ నీటి యాజమాన్య లోపం వల్ల కోల్పోవడం వల్ల భవిష్యత్తులో తాగు, సాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందనే హెచ్చరికలు వ్యక్తమవుతున్నాయి. నదులపై చెక్డ్యామ్ల నిర్మాణాలు వేగవంతం చేయడం, నదుల అనుసంధానం, ప్రధాన రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యం పెంపుపై ప్రభుత్వం వెంటనే తగిన దృష్టి సారించకపోతే ఈ రకమైన జల నష్టం ఏటా పునరావృతమవుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా సముద్రంలో కలిసే నీటిని ఎత్తైన ప్రాంతాల్లోకి ఎత్తిపోతల ద్వారా తరలించే శాశ్వత నిల్వ జలాశయాల నిర్మాణం తక్షణ అవసరమని సూచిస్తున్నారు.
మొత్తం వినియోగం 331 టీఎంసీలే
మే నుంచి ఆగస్టు 28 మధ్య కాలంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ రంగాల అవసరాల కోసం వినియోగించిన మొత్తం నీటి పరిమాణం కేవలం 331.12 టీఎంసీలు మాత్రమే. అంటే భానుడి వేడికి ఆవిరైపోయిన 646 టీఎంసీలలో ఇది సగం మాత్రమే ఉండటం గమనార్హం. ప్రతికూల వాతావరణం, వర్షాభావం కారణంగా ఎండిపోతున్న పంటలను కాపాడుకోవడానికి రైతులు తీవ్రంగా శ్రమించాల్సి రావడం వల్ల, మొత్తం వినియోగంలో 291.87 టీఎంసీలను వ్యవసాయ రంగానికే కేటాయించాల్సి వచ్చింది. ఇక తాగునీటి ఎద్దడి తలెత్తకుండా గృహావసరాలకు 24.47 టీఎంసీలు, వివిధ పారిశ్రామిక ఉత్పత్తుల నిర్వహణకు పారిశ్రామిక రంగానికి 14.78 టీఎంసీల నీటిని మాత్రమే వాడినట్లు అధికారులు వెల్లడించారు. అందుబాటులో ఉన్న నీటిలో అత్యధిక భాగం పంటలను రక్షించుకోవడానికే సరిపోతుండటంతో, వేసవికి ముందే రాష్ట్రంలో తాగునీటి అవసరాలకు కూడా తీవ్రమైన కష్టాలు తప్పవనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.


