Wednesday, February 18, 2026
Homeతెలంగాణతెలుగు సినీ పరిశ్రమకు అత్యంత ప్రాధాన్యం

తెలుగు సినీ పరిశ్రమకు అత్యంత ప్రాధాన్యం

- Advertisement -

. సమాజం కోసం జీవితాన్ని త్యాగం చేసిన గద్దర్
. ప్రతిభ, పారదర్శకతే ప్రమాణంగా అవార్డుల ఎంపిక
. ఫిలిం అవార్డుల జ్యూరీ సభ్యుల సమావేశంలో భట్టి

విశాలాంధ్ర – హైదరాబాద్ : తెలుగు సినీ పరిశ్రమకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని, దేశవ్యాప్తంగా ఫిలిం ఇండస్ట్రీకి హైదరాబాద్‌ను కేంద్రంగా చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అంబేద్కర్ సచివాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన గద్దర్ సినిమా అవార్డుల జ్యూరీ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… బాంబే, కోల్‌కతా, చెన్నై వంటి నగరాల్లో సినీ పరిశ్రమ పెరగడానికి అంతగా అవకాశాలు లేవు కానీ… దేశంలో అన్ని భాషల ఇండస్ట్రీ హైదరాబాద్‌లో విస్తరించడానికి సానుకూల అంశాలు అనేకంగా ఉన్నాయని వివరించారు. సకల భాషల సినీ పరిశ్రమ హైదరాబాద్‌కు తరలి వస్తే యువతకు, టెక్నీషియన్లు, రైటర్లు, డైరెక్టర్లకు ఉపాధి లభిస్తుందన్నారు. సినీ ప్రపంచ మార్కెట్‌కు హైదరాబాద్ కేంద్రంగా మారుతుందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన బ్లూ ప్రింట్ ప్రభుత్వం తయారు చేస్తుందని అన్నారు. గత ప్రభుత్వం సినిమా అవార్డులపై నిర్లక్ష్యం వహిస్తే… సమాజంలో అత్యంత ప్రభావం చూపే సామాజిక పరివర్తన తీసుకొచ్చే సినీ రంగాన్ని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అవార్డులు ఇచ్చి తిరిగి ప్రోత్సహించడం ప్రారంభించింది అని వివరించారు. సమాజం కోసం కళల ద్వారా తన జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు గద్దర్ అని డిప్యూటీ సీఎం తెలిపారు. తెలంగాణ అంటే కళలు, విప్లవం, ప్రశ్నించడం, సున్నిత మనసుతో, ప్రేమానురాగాలతో కూడినదని, తెలంగాణ కళలు, సంస్కృతిని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి గద్దర్ అని పేర్కొన్నారు. అందుకే ఆయన పేరు మీద గత సంవత్సరం నుంచి సినిమా అవార్డులు ఇవ్వడం ప్రారంభించి సినీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ప్రతిభ, పారదర్శకతే ప్రమాణంగా సినిమా అవార్డుల ఎంపిక ఉంటుందని అన్నారు. సినీ రంగ ప్రముఖులు తమ అనుభవాన్ని, నిబద్ధతను, సినిమా రంగంపై వారికున్న అభిమానాన్ని దృష్టిలో పెట్టుకొని ఎఫ్‌డీసీ ద్వారా అందరితో సంప్రదింపులు జరిపి జ్యూరీ సభ్యులుగా ఎంపిక చేశారని తెలిపారు. గద్దర్ అవార్డుకు ఎంపిక చేసే సినిమాలో కమర్షియల్ అంశంతో పాటు సామాజిక సందేశం తప్పనిసరిగా ఉండేలా జాగ్రత్త తీసుకుంటే రాబోయే రోజుల్లో సమాజంలో మంచి సినిమాలను ప్రోత్సహించేందుకు అవకాశం ఉంటుందని డిప్యూటీ సీఎం అభిప్రాయపడ్డారు. ఈనెల ఆరో తేదీ నుంచి గద్దర్ సినిమా అవార్డుల పరిశీలన కార్యక్రమం ప్రారంభమవుతుందని, 19న ఉగాది పండుగ రోజు గద్దర్ అవార్డుల కార్యక్రమాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని తెలిపారు. సమావేశంలో ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, ఐ అండ్ పీఆర్ కమిషనర్ ప్రియాంక, ఎఫ్‌డీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిషోర్ బాబు, సినీ ప్రముఖులు తనికెళ్ల భరణి, కేఎస్ రామారావు, రోజా రమణి, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు