న్యూదిల్లీ: ప్రధాని మోదీ దురుసుతనం తగ్గిందని, ఆయన నైతికత దెబ్బతిన్నదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే శుక్రవారం వ్యాఖ్యానించారు. రాజ్యసభలో ప్రధాని ప్రసంగాన్ని విమర్శించారు. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సంధించిన ప్రశ్నల కు సమాధానం ఇవ్వడానికి మోదీ భయపడిపోయారని, అందుకోసమే దిగువ సభలో ప్రసంగించకుండా తప్పించుకున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నాయకుల మాటలు, ప్రకటనలను మోదీ వక్రీకరిస్తున్నా రని ఆయనకు సమాధి తవ్వుతామన్న వ్యాఖ్యలనుద్దేశించి ఖడ్గే అన్నారు. వారి సిద్ధాంతానికి పాతేస్తామని చెబుతున్నామేగానీ వ్యక్తిని కాదని స్పష్టత ఇచ్చారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో ప్రధాని దాదాపు 97 నిమిషాలు మాట్లాడారు కానీ ప్రతిపక్షాలు లేవనెత్తే ఒక్క అంశాన్ని ప్రస్తావించలేదని ఖడ్గే విమర్శించారు. లోక్సభకు రావద్దని ప్రధానికి సూచించినట్లు స్పీకర్ ఓం బిర్లా చెప్పడాన్ని ఆక్షేపించారు. మోదీని లక్ష్యంగా చేసుకుంటారని పక్కా సమాచారం ఉన్నట్లు చెప్పడాన్ని ఖడ్గే తీవ్రంగా ఖండించారు. ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక, నిజాలను ఎదుర్కొనే ధైర్యం లేకనే ఇంటెలిజెన్స్ నివేదికల పేరు చెప్పి మోదీ తప్పించుకున్నారని, ఇది ఆయన అస్థిర మనస్తత్వాన్ని బయటపెట్టందని వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురించి చేసిన వ్యాఖ్యలు మోదీ వాస్తవ ఆలోచనా ధోరణికి అద్దం పట్టిందన్నారు. ఇలాంటి ప్రవర్తనతో ఆయన నైతికత దెబ్బతిన్నదని, దురుసుతనం తగ్గిందని, 56 అంగుళాల ఛాతి కుదించుకుపోయిందని ప్రజలకు అర్థమైందని ఖడ్గే అన్నారు. ప్రధాని స్థానంలో ఉన్న వ్యక్తి తన స్థాయిని మరిచి వ్యాఖ్యలు`విమర్శలు చేయడం దేశానికి మంచిది కాదని హితవు పలికారు.ప్రజాస్వామ్యబద్ధంగా చట్టసభలు సాగడం ఇష్టంలేకనే ప్రతిష్ఠంభన పరిస్థితిని మోదీ ప్రభుత్వం కల్పిస్తుందని, ఇది ప్రజాస్వామ్య వైఫలమేనని ఖడ్గే వ్యాఖ్యానించారు.


