Homeజయహో భారత్

జయహో భారత్

- Advertisement -

అండర్-19 ప్రపంచకప్ మనదే

. ఫైనల్ పోరులో ఇంగ్లాండ్‌పై ఘన విజయం
. ఆరోసారి జగజ్జేతగా యువభారత్
. వైభవ్ విధ్వంసక శతకం…80 బంతుల్లో 175

హరారే: ఐసీసీ అండర్-19 ప్రపంచకప్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్ పోరులో కెప్టెన్ ఆయుష్‌మాత్రే నేతత్వంలోని యవభారతజట్టు 100 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ అండర్-19 ప్రపంచకప్‌ను ఆరోసారి గెలుచుకుని తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించింది. జింబాబ్వే రాజధాని హరారేలో శుక్రవారం భారత్`ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 411 పరుగులు చేసి భారీ స్కోర్ నమోదు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అద్భుత సెంచరీతో మ్యాచ్‌ను ఏకపక్షం చేసేశాడు. ఈ క్రమంలో వైభవ్ ఎన్నో రికార్డులు తిరగరాశాడు. కేవలం 80 బంతుల్లో 175 పరుగులు చేసి ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 15 ఫోర్లు, 15 సిక్సర్లతో ఇంగ్లీష్ బౌలర్లకు దడ పుట్టించాడు. తొలుత ఓపెనర్ ఆరోన్ జార్జ్(9) స్వల్ప స్కోరుకే వెనుదిరగ్గా.. మరో ఎండ్‌లో ఓపెనర్ సూర్యవంశీ చెలరేగాడు. కెప్టెన్ ఆయుష్ మాత్రే 53 పరుగులు, అభిగ్యాన్ కుందు 40 పరుగులతో వైభవ్‌కు మంచి సహకారం అందించారు. చివరిలో ఆలౌండర్ కనిష్క్ చౌహాన్ వేగంగా 37 పరుగులు చేసి స్కోర్‌ను 400 దాటించాడు. 412 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ జట్టు ప్రారంభంలో పోరాడినా… భారత బౌలర్ల ముందు నిలవలేకపోయింది. కేలబ్ ఫాల్కనర్ 67 బంతుల్లో 115 పరుగులు (తొమ్మిది ఫోర్లు, ఏడు సిక్సర్లు) చేసి మెరుపులు మెరిపించినా ఫలితం లేకపోయింది. జేమ్స్ మింటో (28) ఒక్కడి నుంచే అతడికి సహకారం అందింది. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. ఇంగ్లాండ్ టాపఆర్డర్ బ్యాటర్లలో బెన్ డాకిన్స్ 66, బెన్ మేయెస్ 45, థామస్ రేవ్ 31 పరుగులు చేశారు. చివరకు ఇంగ్లాండ్ 40.2 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ బౌలింగ్‌లో ఆర్.ఎస్.అంబ్రిష్ 3 వికెట్లు, దీపేష్ దేవేంద్రన్ 2 వికెట్లు, కనిష్క్ చౌహాన్ 2 వికెట్లు తీసి జట్టుకు విజయాన్ని అందించారు. బ్యాటు విధ్వంసం సష్టించిన వైభవ్ సూర్యవంశీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. భారత్ గతంలో 2000, 2008, 2012, 2018, 2022లో అండర్-19 కప్ ను గెలిచింది. ఇప్పుడు రికార్డు స్థాయిలో ఆరోసారి కప్ సాధించి, అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో తన తిరుగులేని ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది. మ్యాచ్ అనంతరం భారత ఆటగాళ్లు త్రివర్ణ పతాకాలను చేతబూని మైదానంలో సంబరాలు జరుపుకున్నారు.
వైభవ్ వీరవిహారం..
ఫైనల్‌లో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సిక్సర్లు, ఫోర్లతో వీరవిహారం చేశాడు. 55 బంతుల్లో 8 ఫోర్లు, ఆరు సిక్సర్లతో శతకం పూర్తి చేసుకున్న అతడు… ఆ తర్వాత మరింత చెలరేగి ఆడాడు. మరో 75 పరుగులను కేవలం 25 బంతుల్లోనే సాధించాడు. ఆ తర్వాత మానీ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. 218 స్ట్రైక్ రేట్‌తో 15 సిక్స్‌లు, 15 ఫోర్లను బాదాడంటే… బౌలర్లను ఏ విధంగా ఊచకోత కోశాడో అర్థం చేసుకోవచ్చు.
వైభవ్ ఇన్నింగ్స్‌పై ప్రశంసల వర్షం
అండర్-19 ప్రపంచకప్ 2026 ఫైనల్లో 14 ఏళ్ల భారత యువ కెరటం వైభవ్ సూర్యవంశీ సృష్టించిన ప్రభంజనంపై క్రికెట్ ప్రపంచం ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఈ అద్భుత ప్రదర్శనపై మాజీ, ప్రస్తుత క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, వైభవ్‌ను భారత క్రికెట్ భవిష్యత్ ఆశాకిరణంగా అభివర్ణిస్తున్నారు.
ఐస్‌లాండ్ క్రికెట్ బోర్డు సరదాగా స్పందిస్తూ, “ఇంగ్లండ్ బౌలర్లపై ఈ హింస దారుణం. వైభవ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి!” అని ట్వీట్ చేసింది. భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో వైభవ్‌ను ఆకాశానికెత్తాడు. “సూర్యవంశీ అంటే సూర్య వంశం నుంచి పుట్టినవాడు. ఈరోజు అతను అలాగే ఆడాడు. ప్రజ్వలించాడు. ప్రత్యర్థులను అంధులను చేశాడు. ఆపలేని శక్తిగా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లు అన్నీ ప్రయత్నించారు. కానీ సూర్యుడిని ఎవరూ ఆపలేరు. భారత క్రికెట్‌లో సూర్యుడు ఉదయించాడు! ఇది భవిష్యత్తుకు ఒక సంకేతం” అని సెహ్వాగ్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. 15 ఫోర్లు, 15 సిక్సర్లతో సమాన విధ్వంసం సృష్టించాడని కొనియాడాడు. పఠాన్ సోదరులు యూసుఫ్, ఇర్ఫాన్ కూడా వైభవ్ ధైర్యాన్ని మెచ్చుకున్నారు. “అతడి వయసు 14 ఏళ్లు. భయం లేదు… ఒత్తిడి లేదు… కేవలం స్వచ్ఛమైన ప్రతిభ! వైభవ్ సూర్యవంశీ కేవలం ఒక ఇన్నింగ్స్ ఆడలేదు, భారత క్రికెట్ భవిష్యత్తును ప్రకటించాడు” అని యూసుఫ్ పఠాన్ పేర్కొన్నాడు. ప్రపంచకప్ ఫైనల్లో ఇలాంటి భారీ ఇన్నింగ్స్ ఆడటం అతని నిలకడకు, ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యానికి నిదర్శనమని, అతను ఒక బిగ్ మ్యాచ్ ప్లేయర్ అని ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసించాడు. ఈ ఇన్నింగ్స్‌తో వైభవ్, 2012 ఫైనల్లో ఉన్ముక్త్ చంద్ (111) నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాడు. దీనిపై స్పందించిన ఉన్ముక్త్ చంద్, వైభవ్ ఫోటోను షేర్ చేస్తూ ‘డిఫరెంట్ బ్రీడ’ (ఇతడు ఓ ప్రత్యేకమైన ఆటగాడు) అని కొనియాడాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ “వైభవ్ సూర్యవంశీ.. ఇది చాలా చాలా ప్రత్యేకం” అని వ్యాఖ్యానించాడు.
“ఏక్ బిహారీ సబ్ పే భారీ!” అంటూ భారత వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ తన రాష్ట్రానికి చెందిన వైభవ్‌ను అభినందించాడు. శిఖర్ ధావన్, సంజీవ్ గోయెంకా వంటి ప్రముఖులు కూడా వైభవ్ ఆటకు ఫిదా అయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు