Friday, March 6, 2026
Homeవిశ్లేషణనడి వేసవి రాత్రులు

నడి వేసవి రాత్రులు

- Advertisement -

చింతపట్ల సుదర్శన్

దారికి అడ్డంగా మనుషుల గుంపు కనిపించింది. అది పెళ్లి ఊరేగింపో, చావు సాగనంపో, రోడ్డు షోనో, రాస్తారోకోనో అర్థం కాలేదు. ఏదో ఓ కారణంగా రోడ్లకి జనం అడ్డం పడటం మామూలే కదా! అంటూ మెయిన్ రోడ్డు వదిలి పక్కదారి పట్టింది డాంకీ. అలా ఓ సందులో నుంచి మరో దాన్లోకి, ఓ వీధిలోంచి మరో వీధిలోకి మర్లుతూ, తిర్గుతూ దారి తప్పింది. తను ఎన్నడూ చూడని చోట్లని వింతగా చూస్తూ నడుస్తున్న డాంకీ మెడలో ఓ దండ, ఎక్కడ్నించి ఎగిరొచ్చిందో కానీ వచ్చిపడింది. ఇదేంట్రా చోద్యం. ఏ వీరాభిమానో తన హీరో మెళ్లో విసిరేస్తేనో, ఏ కార్యకర్తో, తమ పార్టీ నాయకుడి పీక మీదకి ‘త్రో’ చేస్తేనో దారితప్పి తన మెళ్లో పడలేదు కదా! అలా గనక అయితే అటు అభిమానులు, ఇటు కార్యకర్తలు దున్నపోతుల్లా మీద పడతారేమోనని భయపడ్డది. బతుకు మీద ఆశ పూర్తిగా వదిలేసుకుంది. అప్ప్పుడు వినపడ్డయి మంగళవాయిద్యాల ధ్వని, జయ జయహో అనే కేకల హోరు. ఈ వాయిద్య ఘోష ఈ జయజయకారాల హేల ఎందుకో పూర్ డాంకీకి అర్థం అవలేదు. అప్ప్పుడొచ్చాడొకడు తలపాగా సవరించుకుంటూ. ‘మహారాజావారికి స్వాగతం/ గందరగోళ రాజ్యాధిపతీ సుస్వాగతం! అన్నాడు. రాజా వారెవరు? ఈ గందరగోళమేమిటని అర్థంకాక తోకెత్తి నిలబడింది డాంకీ. ‘ఆశ్చర్యపడనే వద్దు రాజావారూ! ఇది మా రాజ్యపు ఆనవాయితీ. మా రాజావారు సంతానం లేకుండానే ప్లాస్టిక్ ‘చేతన’ బకెట్టు తన్నేశారు. మా ఈ గందరగోళ రాజ్యానికి రాజును ఎన్నుకోడానికి మా పద్ధతి ప్రకారం ఏనుగు తొండానికి దండ వేలాడదీశాం. అది అలా తొండం ఎత్తి ఇలా గిరాటేసిన కర్పూర పూలదండ తమరి మెడను అలంకరించింది. అందువల్ల ఇకనించి మీరే మా చక్రవర్తి మా మహారాజు. ఈ రాజ్యం మీదేనండి, ఈ రాజ్యం మీరేలండి నేనే మీ మంత్రినండి” అని తలపాగావాడు అంటే సేనాధిపతినంటూ ఒకడు, కోశాధిపతినంటూ మరొకడు, ఇంకొకడు, ఇంకొకడెవడో ఒకడు వరుసగా వచ్చి వంగి దండాలు పెట్టారు. నమ్మాలో వద్దో, అర్థం కాలేదు. తను ఈ గందరగోళ రాజ్యానికి రాజునేమిటన్న గందరగోళంలో నోరు తెర్చుకు నిలబడిపోయింది డాంకీ. రాజావారిని ఊరేగిస్తూ దర్బార్‌కు తీసుకుపోదాం అని అరిచారెవరో. మన ఈ కొత్త రాజావారు ఏనుగు అంబారీ ఎక్కగలరా అని సందేహపడ్డాడొకడు.
‘కొత్త రాజావారిని గందరగోళ పెట్టద్దు. నలుగురు ఆస్తాన వస్తాదులను పిలవండి మోసుకు తెచ్చి మర్యాదగా సింహాసనంలో కూర్చోబెడతారు’ అన్నాడు మంత్రి. కన్నుమూసి తెరిచేటప్పటికి డాంకీ సింహాసనం మీద ఉంది. తలకి కిరీటం అలంకరించారు. ప్రజలు జయహో! గందరగోళ రాజ్య ప్రభూ! జయజయ అని అరుస్తూ ఉంటే దైర్యం చేసి డాంకీ, తలపాగావాణ్ణి అడిగింది. మీరంతా మనుషులు కదా విమ్మల్ని ఓ గాడిదను నేను ఎలా ఏలుకోగలను? అని. ‘మీరేం వరీ అవద్దు మా రాజా! ఏనుగు దండ వేసింది ఊరపందికా? అచ్చోసిన ఆంబోతుకా? నెత్తురు రుచిమరిగిన హైనాకా లేక గాడిద అయిన తమరికా అన్నది మాకనవసరం. పద్ధతి పద్ధతే. ఇక ఈ రాజ్యానికే కాదు చుట్టపక్కల ఉన్న రాజ్యాలన్నింటికీ మీరే ప్రభువు. మీ మాటే శాసనం. లేపేయమన్న వాడ్ని లేపేస్తాం, కోసేయమన్న వాడ్ని కోసేస్తాం. ధ్వంసమైనా సరే విధ్వంసమైనా సరే!’ అన్నాడు సేనాధిపతి. అప్ప్పుడు నమ్మకం కుదిరింది డాంకీకి. తను రాజునయ్యానన్న ఆలోచన ఉక్కిరిబిక్కిరి చేసి, తిక్కతిక్కగా, తిమ్మిరి తిమ్మిరిగా అనిపించింది. అప్పటి నుంచి భయంతో బిక్కచచ్చిపోయి ఉన్న డాంకీకి ఒక్కసారి నోరుతెరిచి ‘ఫ్రీగా’ ‘రిలాక్స్‌గా’ ఓండ్ర పెట్టాలనిపించింది. ఆ మాటే చెప్పింది మంత్రికి. “అదెంత మాట రాజావారూ! ఇది మీ రాజ్యం కాదుకాదు, మీ ప్రపంచం. మీదే ఈ ప్రపంచం! అడగాల్సిన పనిలేదు. అడిగే దిక్కే లేదు. మీ ఇష్టం. మీరాడింది ఆట, పాడింది పాట!’ అన్నాడు మంత్రి. అప్ప్పుడు డాంకీకి చెప్పలేని హుశారు వచ్చింది. దిక్కులు పిక్కటిల్లేట్లు, దిక్కులు బిక్కుబిక్కున దిక్కులు చూసేట్టు, మనసారా తనివి తీరా ఓండ్ర పెట్టింది. జనం జడుసుకున్నారు కానీ, రాజావారి కోపానికి గురవ్వాల్సి వస్తుందేమోనని చప్పట్లు చరిచారు. డాంకీ రాజావారు తెగ సంతోషించి ఆ సంతోషాన్ని వ్యక్తం చేయడానికి, సింహాసనం మీది నుంచి లేచి వెనుతిరిగి వెనక కాళ్లతో తలపాగా మంత్రి మూతిపళ్లు రాలేట్టు ఫెడీఫెడీమని తన్నారు. రాలిన పళ్లని గుప్పిట్లో పట్టుకుని రాజావారి అనుగ్రహం అందరికీ దక్కాలి కదా అంటూ సేనాపతిని, కోశాధికారినీ, ఇతర అధికారులనీ రాజావారి వెనక కాళ్ల తన్నుల కోసం ‘క్యూ’ కట్టించాడు. రాజ్యంలో జనాన్ని ఇలా ఫెడీఫెడీ తన్నడంతో తప్తిలేని డాంకీ రాజు తమ రాజ్యపు చుట్టుపక్కల ఉన్న దేశాధినేతలను తన్నడం ఆరంభించాడు. ఎవరి చేతిలో ఏది ఉంటే అది లాక్కుని నమలడం ప్రారంభించాడు. విచ్చుకున్న పల్లేరుగాయల్లాంటి కళ్లు ఎటు వైపు తిరిగితే అటువైపు సకలం దగ్ధమయ్యేటట్టు, సర్వ నాశనమయ్యేటట్టు ఆర్డర్లు జారీ చేశాడు.‘తన్ను తన్ను బాగా తన్ను ఇంకా తన్ను’ అని పాడుతూ, వీరావేశంగా కాలు జాడించింది డాంకీ. అది బలంగా తాకి కుయ్యో మొర్రోమంటూ లేచిన డాగీ ‘భవ్వు’ మంది. చటుక్కున మెలకువ వచ్చింది డాంకీకి. అరెరే! నేను రాజునవడం, అందర్నీ తన్నడం సర్వనాశనం చెయ్యడం ఇదంతా కలే! అబ్భా ఎంత మంచి కల కరిగిపోయిందే అనుకుని నిట్టూర్చింది డాంకీ. ఎంత మంచి కలో! సారీ నిన్నూ తన్నానా! అంది డాగీతో. మనుషులకు కలలు వస్తయని విన్నా! గాడిదలకూ కలలు వస్తాయన్న మాట అంది డాగీ! ‘అవును గాడిదలూ రాజులవవచ్చు, రాజ్యాలేలవచ్చు, ఎవడ్ని పడితే వాడ్ని తన్నవచ్చు’ అన్నది డాంకీ!

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు