పాక్ కెప్టెన్‌పై రషీద్ లతీఫ్ ఆగ్రహం
ఇస్లామాబాద్: టీ20 ప్రపంచకప్ 2026 నుంచి పాకిస్థాన్ ఘోరంగా నిష్క్రమించడం ఆ దేశంలో మాజీల ఆగ్రహానికి కారణమైంది. పాక్ క్రికెట్ అభిమానులు కూడా పాకిస్థాన్ ఆటతీరుపై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘాపై విమర్శలు దాడి ఎక్కువైంది. తాజాగా ఆ దేశ మాజీ వికెట్ కీపర్ రషీద్ లతీఫ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో గెలిచినప్పటికీ, నెట్ రన్ రేట్ కారణంగా పాకిస్థాన్ సెమీఫైనల్స్ కు వెళ్లకుండా టోర్నీ నుంచి అవుట్ అయింది. ఈ ఓటమి తీరుపై రషీద్ లతీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘాకు వసీం అక్రమ్, వకార్ యూనస్, షోయబ్ అక్తర్, షేన్ వార్న్ వంటి దిగ్గజ బౌలర్లను ఇచ్చినా వేస్ట్ అని, అయినా కూడా మ్యాచ్‌ను ఓడించగలడు” అని ఎద్దేవా చేశారు. బౌలర్లను ఉపయోగించడంలో కెప్టెన్ దారుణంగా విఫలమయ్యాడని, వ్యూహాత్మక లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు. సెమీ ఫైనల్స్‌కు వెళ్లాంటే శ్రీలంకను 147 పరుగుల్లోపు కట్టడి చేయాలి. కానీ ఒకానొక దశలో శ్రీలంక విజయం సాధిస్తుందా? అనేలా ఆడింది. పాక్ బౌలర్లు ఏకంగా 207 పరుగులు సమర్పించుకున్నారు. శ్రీలంక కెప్టెన్ శనక 31 బంతుల్లో ఏకంగా 76 పరుగులు చేసి పాక్ ఆశలపై నీళ్లు చల్లాడు. నసీమ్ షా వంటి ప్రధాన బౌలర్‌ను డెత్ ఓవర్ల కోసం అట్టిపెట్టకపోవడం, స్పిన్నర్లను సరైన సమయంలో బౌలింగ్‌కు దించకపో వడం వంటి తప్పులను లతీఫ్ ఎత్తిచూపాడు. హెడ్ కోచ్ మైక్ హెసన్, ఇతర సహాయక సిబ్బందిపై కూడా లతీఫ్ విమర్శలు గుప్పించాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో పదేపదే ప్రయోగాలు చేయడం వల్ల జట్టు నష్టపోయిందని అన్నాడు. కోచ్‌లు కూడా పాక్ ఆటతీరు దారుణంగా ఉండటానికి ఒక కారణమని మండిపడ్డాడు.


