Wednesday, February 18, 2026
Homeసంపాదకీయంపదండి ముందుకు

పదండి ముందుకు

- Advertisement -

వందేళ్ల ప్రస్థానం సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ (సి.పి.ఐ.) 101వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. దేశంలో కాంగ్రెస్‌ తరవాత అతి ప్రాచీనమైన పార్టీ సీ.పీ.ఐ.నే. ఈ వందేళ్ల కాలంలో సి.పి.ఐ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది. కొన్ని పొరపాట్లూ చేసి ఉండొచ్చు. ఏ పార్టీ రాజకీయ విధానాలైనా వర్తమాన రాజకీయ పరిణామాలకు అనుగుణంగానే ఉంటాయి. ఆ క్రమంలో కొన్ని తప్పటడుగులు తప్పకపోవచ్చు. కానీ చేసిన తప్పుల్ని ఒప్పుకునే ధైర్యం కమ్యూనిస్టు పార్టీలకు ఉన్నట్టుగా మరే పార్టీలకూ లేదు. ఏ ప్రభుత్వమైనా తాను సాధించాననుకుంటున్న విజయాల గురించే గొప్పలు చెప్పుకుంటుంది తప్ప జనం బాధలను అంతగా పట్టించుకోదు. పట్టించుకున్న సందర్భాలలోనూ ఆ ప్రభుత్వాలు అమలుచేసే విధానాలు జనాకర్షణ కోసమే రూపొందించినవై ఉంటాయి. ఈ విషయంలో కమ్యూనిస్టులు భిన్నమైన వారు. ఈ దేశంలో ఇప్పటికీ లక్షలాది మంది అర్ధాకలితోనే నిద్రపోతారు. దేశాభివృద్ధి ఎంత జరిగిందో చెప్పడానికి ప్రభుత్వాలు స్థూల జాతీయోత్పత్తి (జి.డి.పి.) లెక్కలు వల్లిస్తుంటాయి. స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్లయినా ఆకలిని రూపుమాపలేకపోయాం. జీవనానికి వినియోగించే విద్యావిధానం జాడే కనిపించదు. బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడిన తరవాత-అది అతల్‌ బిహారీ వాజపేయి ఆరేళ్ల పాలనలో కావొచ్చు లేదా దాదాపు పన్నెండేళ్ల మోదీ పాలనలోనూ కావొచ్చు చరిత్రను వక్రీకరించడంతోనే సరిపోయింది. అశాస్త్రీయమైన అంశాలను పాఠ్యపుస్తకాల్లో పనిగట్టుకుని చేర్చడానికే పరిమితం అయింది. మనది ప్రపంచంలోకెల్లా నాల్గవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అన్న ప్రచారంలోని బూటకాన్ని ఆర్థికవేత్తలు ప్రమాణాలతో సహా నిరూపిస్తున్నారు. అంతర్జాతీయ సంస్థలూ ఆర్థిక వ్యవస్థలోని డొల్లతనాన్ని బయటపెడ్తూనే ఉన్నాయి. తనకు అరవై నెలలు అవకాశం ఇస్తే దేశ స్వరూపాన్నే మార్చేస్తానని అధికారంలోకి వచ్చిన మోదీ… 2047 దాకా వేచి ఉండాలని చెబుతున్నారు. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐ.ఎం.ఎఫ్‌.) కూడా మోదీ ప్రచారంలోని అసత్యాలను ఎండగడ్తూనే ఉన్నాయి. దాదాపు పాతిక కోట్ల మందిని పేదరికం నుంచి బయట పడేశామని మోదీ ప్రభుత్వం టముకు వేస్తూ ఉంటుంది. కానీ అన్నార్తుల ఆకలికి సెలవు రోజే లేదు. పైగా మోదీకి ఆప్తులైన బడా వ్యాపార సంస్థల వారు పని గంటలు పెంచి మరిన్ని లాభాలు మూటగట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. దీర్ఘకాలం పోరాడి వ్యక్తిగత జీవనానికి, విశ్రాంతికి ఎన్నేసి గంటలు అవసరమో, అది ఎందుకు హక్కయిందో నిర్ణయించుకున్నాం. దాన్ని పెడదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కరోనా సమయంలో ప్రారంభించిన 80 శాతం ప్రజలకు నెలకు అయిదేసి కిలోల బియ్యం అందించడాన్ని మోదీ తన ఘనతగా చెప్పుకుంటారు. ఉచిత ఆహార ధాన్యాల మీద ఆధారపడడం కన్నా దైన్యం ఏమీ ఉండదు. ఇప్పటికీ ఆ రోజుకు గ్రాసం సంపాదించడానికి తెల్లవారు రaామునే లేచి… లేని ఉపాధి కోసం అన్వేషించే వారు కోట్లలోనే ఉన్నారు. అన్నార్తుల ఆర్తనాదాలు ఇప్పటికీ శుష్క వాగ్దానాల కన్నా, నినాదాల కన్నా గట్టిగానే వినిపిస్తాయి. పేదలు పుట్టుకతోనే తిరుగుబాటుదార్లూ కారు, విప్లవకారులూ కాదు. వారి నిత్య జీవితానుభవం, లేమి, అవమానం వారిని తిరగబడేట్టు చేస్తోంది. విప్లవం బాటో, తీవ్రవాదం బాటో పట్టిస్తోంది. ఆకలి, అవమానం, చైతన్యం తిరుగుబాటుకు నాందీ పలుకుతుంది. ఈ క్రమంలో మనకు తెలియకుండానే మనలో చైతన్య జ్వాల రగులుతుంది. అది తత్వవేత్తలు రగిలించే నైరూప్య సిద్ధాంతం వల్లే కాకపోవచ్చు. అంతిమంగా ఆకలితో అలమటించే వారు, చేద్దామన్నా పని దొరకని వారు తమ దుస్థితికి కారణం గుప్పెడు మంది ఇతరుల అపరిమితమైన లాభాపేక్షే కారణం అని గ్రహిస్తారు. దోపిడీకి గురవుతున్న వారు నెమ్మదిగా చైతన్యవంతులవుతారు. గత శతాబ్ద కాలంగా కమ్యూనిస్టు పార్టీలు ఈ చైతన్యాన్ని రగిలించడానికే పాటుపడుతున్నాయి. ఈ లక్ష్యంతోనే సి.పి.ఐ సహా వామపక్ష పార్టీల వారు ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. ప్రజలను చైతన్యపరుస్తున్నారు.స్వాతంత్య్రోద్యమ కాలం నుంచి సి.పి.ఐ చేస్తున్న పని ఇదే. సి.పి.ఐ. మాత్రమే కాదు… ఇతర వామపక్ష పార్టీల లక్ష్యమూ ఇదే. అందుకే కమ్యూనిస్టు ప్రభుత్వాలు కొనసాగిన పశ్చిమ బెంగాల్‌, కేరళ, త్రిపురలో ఇప్పటికీ భూపోరాటాల ఊసే లేదు. భూ సంస్కరణలు అమలు చేయడంలో కమ్యూనిస్టు ప్రభుత్వాలు నికార్సైన చిత్తశుద్ధి ప్రదర్శించాయి. కమ్యూనిస్టుల పోరాటం వల్లే భూసంస్కరణలు అమలులోకి వచ్చాయి. అందులో ఇప్పటికీ లోపాలు ఉండొచ్చు. కమ్యూనిస్టుల కారణంగానే ఫ్యూడల్‌, భూస్వామ్య సంకెళ్లు తెగడం మొదలైంది. ప్రభుత్వ రంగ సంస్థలు అవతరించడానికి నెహ్రూ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ పాత్ర ఎంతో కమ్యూనిస్టు పార్టీ పాత్ర అంతకన్నా ఏ మాత్రం తక్కువ కాదు. కమ్యూనిస్టుల ఒత్తిడి వల్లే బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు లాంటివి సాధ్యమయ్యాయి. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అన్న ప్రతిపాదన పార్వతీకృష్ణన్‌ లాంటి సీపీఐ నాయకుల నుంచే వచ్చింది. ఆ తరవాత ఏడుసార్లు లోక్‌సభకు ఎన్నికైన గీతా ముఖర్జీ… మహిళల రిజర్వేషన్ల అంశాన్ని అమిత ప్రచారంలోకి తీసుకొచ్చారు. కమ్యూనిస్టు పార్టీ ప్రభావం కేవలం రాజకీయ రంగానికే పరిమితమైంది కాదు. వివిధ రంగాల్లోని ప్రజలను సంఘటితం చేయడానికి అనేక ప్రజాసంఘాలు ఏర్పాటు చేసింది. సర్వ కళారంగాలను సి.పి.ఐ. ప్రభావితం చేసింది. కళలు ఆనందం కోసం కాదు… సమాజాభ్యుదయానికే అన్న తెలివిడి కమ్యూనిస్టు పార్టీ వల్లే కలిగింది. అఖిల భారత స్థాయిలో అభ్యుదయ రచయితల సంఘం, ప్రజానాట్య మండలి (ఇప్టా) కమ్యూనిస్టు పార్టీ ప్రభావం వల్ల ఏర్పడినవే. అందుకే ఇప్పటికీ కవులు, రచయితల్లో పురోగామి భావాలున్న వారే ఎక్కువ. బోనస్‌, ప్రావిడెంట్‌ ఫండ్‌ లాంటి కార్మిక సంక్షేమ కార్యక్రమాలు వ్యవస్థీకృతం కావడానికి కమ్యూనిస్టుల కృషే ప్రధానం. మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉన్నప్పుడు సమాచార హక్కు చట్టం, విద్యా హక్కు, ఆహార హక్కు చట్టాలు రావడం వెనక కమ్యూనిస్టుల కృషి నిరాకరించడానికి వీలు లేదు. సి.పి.ఐ సహా వామపక్ష పార్టీలు ప్రజల పక్షాన ఎంతగా నిలబడినా కమ్యూనిజమే దోపిడీ సమాజం నుంచి బయటపడడానికి మార్గం అని చెప్పలేకపోయాయి. ప్రజలెప్పుడూ ప్రత్యామ్నాయం కోసం చూస్తుంటారు. కమ్యూనిస్టులే అసలు ప్రత్యామ్నాయం అన్న భరోసా కల్పించకుండా అస్తిత్వ పోరాటానికే పరిమితం కావడం సి.పి.ఐ సహా కమ్యూనిస్టుల ప్రధాన లోపం. ఇక మిగిలిన ఏకైక మార్గం వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐక్యతే. దీనికోసం సి.పి.ఐ. నిరంతరం కృషి చేస్తూనే ఉంది. అదే అంతిమ లక్ష్యం కావాలి. ఆదివారం సి.పి.ఐ. శత వసంతాల సంరంభాల ముగింపు సభ ఈ దిశగా ముందడుగు వేస్తుందని ఆశిద్దాం.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు