Homeపాత పద్ధతుల్లో రాజకీయం సాగదు

పాత పద్ధతుల్లో రాజకీయం సాగదు

- Advertisement -

సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకోవాలి

  • అభివృద్ధితో ఓటు బ్యాంకు సుస్థిరం – మూడేళ్లలో 36 సాగునీటి ప్రాజెక్టులు పూర్తి
  • స్థానిక ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలి
  • టీడీపీ సదస్సులో సీఎం చంద్రబాబు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: అభివృద్ధితో మాత్రమే ఓటు బ్యాంకు సుస్థిరమవుతుందని, అందుకోసం నాయకత్వం నిరంతరం కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న లీడర్‌షిప్ కాంక్లేవ్లో 2వ రోజు సుస్థిర అభివృద్ధిపై జరిగిన చర్చలో సీఎం ప్రసంగించారు. రాష్ట్ర స్థూల అభివృద్ధితో నియోజకవర్గాల అభివృద్ధిని అనుసంధానం చేసి ప్రజల్లో సానుకూల అభిప్రాయం పెంచాలని సూచించారు. 2026-27లో రాష్ట్ర జీఎస్‌డీపీ రూ.20.35 లక్షల కోట్లుగా ఉందని, 15-20 రంగాల్లో అభివృద్ధి ద్వారా జీఎస్‌డీపీని మరింత పెంచాలన్నారు. మూడేళ్లలో రూ.35 వేల కోట్లతో 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని, అన్ని ప్రాజెక్టులు పూర్తయితే 1,250 నుంచి 1,400 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. గూగుల్ వంటి డేటా సెంటర్లతో భారీగా ఉద్యోగాలు, లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని, నీటి లభ్యత సమస్య కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సక్సెస్ స్టోరీలు సృష్టించి ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. చేసిన అభివృద్ధి-సంక్షేమం గురించి చెప్పుకోవాలి. గొడ్డలి పార్టీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి-సంక్షేమంలో సోషల్ మీడియా సహా వివిధ మార్గాల్లో అందర్నీ భాగస్వామ్యం చేయాలని, వివిధ వర్గాలకు మేలు చేసేలా అమలు చేస్తున్న ప్రభుత్వ కార్యక్రమాలను ప్రమోట్ చేయాలన్నారు. పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలకు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కల్పించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. సీఎం రిలీఫ్ ఫండ్ సహా పెద్ద ఎత్తున సంక్షేమం అమలు చేస్తున్నాం, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పార్టీకి, కూటమికి చెందిన వారిని ప్రత్యర్థులు విమర్శిస్తే.. వాటికి టీమ్ స్పిరిట్‌తో కౌంటర్లు ఇవ్వాలి. నియోజకవర్గ స్థాయిలో గొడ్డలి పార్టీ నేతలు విమర్శలు చేస్తే వాటిని వెంటనే తిప్పికొట్టాలని సీఎం మార్గనిర్దేశనం చేశారు. మై టీడీపీ యాప్‌ను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. రాబోయే కాలంలో సోషల్ మీడియా చాలా కీలక పాత్ర పోషించబోతోంది. పాత పద్ధతుల్లోనే రాజకీయం చేస్తామంటే వేగం అందుకోలేరు.త్వరలో జరుగన్ను స్థానిక ఎన్నికల్లో గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
‘నిజం గెలిచింది’ పేరుతో నేడు రాష్ట్రవ్యాప్త కార్యక్రమానికి లోకేశ్ పిలుపు
కార్యకర్తల పోరాటం, త్యాగాల వల్లే అధికారంలోకి వచ్చామని… ఎన్నికల్లో గెలవాలంటే బలహీనతల్ని గుర్తించి అధిగమించాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ పిలుపునిచ్చారు. ఇందుకు మూడు ‘పీ’ (పార్టీ, పర్సనల్, ప్రభుత్వం) లను ప్రతిపాదించారు. వీటిని అందరూ పాటించాలన్నారు. ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి. బాధ్యతగా ఉండాలి. నాయకులుగా మనం ముందు వినగలగాలి. గ్రామాలకు వెళ్లినప్పుడు అందరినీ కలవాలి. మనమే వంద మందిని వెంటేసుకుని వెళ్లకూడదు. వ్యక్తిగత క్రమశిక్షణ చాలా అవసరం. నీతులు మనం చెప్పడమే కాదు.. పాటించాలి. అలాగే పార్టీలో కష్టపడి పనిచేసే కార్యకర్తలను గుర్తించాలి. నియోజకవర్గంలో ఏ చిన్న సమస్య అయినా సీరియస్ గా తీసుకోవాలి. నేతలు పోస్ట్ ఆఫీస్ లా మారకూడదు. లీడర్ లా వ్యవహరించాలి.
నేతలు తమ నియోజకవర్గాల్లోని పాఠశాలలు, ఆసుపత్రులు, వసతిగృహాలకు వెళ్లి తనిఖీ చేయాలి. చేసిన పనులు చెప్పుకోవాలి. డీఆర్‌సీ సమావేశాన్ని ప్రజా సమస్యల పరిష్కారం కోసం వినియోగించుకోవాలి. ఈ మూడు ‘పీ’లను అందరూ పాటించాలని కోరారు. ముఖ్యంగా పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబుని అరెస్ట్ చేసి రేపటితో మూడేళ్లు. 53 రోజుల పాటు అక్రమంగా జైల్లో బంధించారు. రేపు ‘నిజం గెలిచింది’ పేరుతో పార్టీ కార్యాలయాలు, ఇళ్లు, బూత్ లెవల్ లో 53 దీపాలు వెలిగిద్దాం. చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను బ్లాక్ డే గా పాటిద్దామని నేతలకు లోకేశ్ పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు