. జనవరి కల్లా ఎడమ కాలువ పనులు పూర్తి
. వచ్చే నెల నుంచే ప్రధాన డ్యామ్ పనులు
. జలవనరుల శాఖ సమీక్షలో చంద్రబాబు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలనే లక్ష్యంతో పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను, కాంట్రాక్టు సంస్థలను ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా లక్ష్యానికి అనుగుణంగా శరవేగంగా పనులు జరగాలని సీఎం సూచించారు. సచివాలయంలో పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ముఖ్యమంత్రి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. కేంద్ర జలసంఘం, నిపుణుల కమిటీ నుంచి ఎప్పటికప్పుడు ప్రాజెక్టు పనులపై అనుమ తులు తీసుకుని పనులు పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు. పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ వద్దని స్పష్టం చేశారు. డయాఫ్రం వాల్ మొత్తం 63,656 క్యూబిక్ మీటర్లకుగాను 37,302 క్యూబిక్ మీటర్ల మేర పనులు పూర్తయ్యాయని, బట్రస్ డ్యామ్ పనులు వంద శాతం, వైబ్రో కాంపాక్షన్ పనులు 74 శాతం మేర పూర్తయినట్లు సీఎంకు అధికారులు వివరిం చారు. ఈ ఏడాది డిసెంబరు నాటికి డయాఫ్రం వాల్ పనులు పూర్తి కావాలని సీఎం నిర్దేశించారు. ప్రాజెక్టులో ప్రధాన డ్యామ్ ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులను నవంబరు 1 నుంచే ప్రారంభించాలని, 2027 డిసెంబరుకు ఎట్టిపరిస్థితుల్లో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పోలవరం కుడి కాలువను అనుసంధానించే సొరంగాల నిర్మాణం, ఎడమ కాలువకు అనుసంధానం చేసేలా అప్రోచ్ ఛానల్, హెడ్ రెగ్యులేటర్, ఇరిగేషన్ టన్నెల్, కేఎల్ బండ్‌లను, ప్రధాన ఎడమ కాలువను 2026 జనవరి నాటికల్లా అనకాపల్లి వరకూ పూర్తి చేయాలని సీఎం గడువు విధించారు. ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ, నిర్వాసితులకు పరిహార, పునరావాసాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
పోలవరం వద్ద పర్యాటక ఆకర్షణలు
దేశంలోనే అత్యుత్తమ ప్రాజెక్టుగా నిర్మిస్తున్న పోలవరం వద్ద పర్యాటకులను ఆకర్షించేలా నిర్మాణాలు ఉండాలని చంద్రబాబు సూచించారు. ప్రాజెక్టు నుంచి భద్రాచలం, పాపికొండలు, దిగువన ధవళేశ్వరం వరకూ వివిధ ప్రాంతాలను అద్భుతంగా తీర్చిదిద్దాలన్నారు. పోలవరం ప్రాజెక్టు కనెక్టివిటీ కింద ఐకానిక్ రోడ్డు నిర్మించి… దీనిని జాతీయ రహదారికి అనుసంధానించేలా చూడాలన్నారు. రాజమహేంద్రవరం కేంద్రంగా పర్యాటకాన్ని అభివృద్ధి చేసేలా అఖండ గోదావరి ప్రాజెక్టు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు మార్గనిర్దేశనం చేశారు. పోలవరం ప్రాజెక్టులో పనుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి… ఆర్టీజీఎస్‌కు అనుసంధానించాలని సూచించారు. వచ్చే వర్షాకాల సీజన్‌లోగా వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలన్నారు. సమీక్షకు జలవనరుల శాఖమంత్రి నిమ్మల రామానాయుడు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కె.విజయానంద్, ఉన్నతాధికారులు హాజరయ్యారు.


