మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసు కథ గురువారం ముగిసింది. ఈ పేలుళ్లలో ఆరుగురు మరణించారన్నది నిజమేనట. కానీ గాయపడిన వారి సంఖ్య మీద పోలీసుల వాదనకు, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రత్యేక న్యాయస్థానానికి మధ్య పొంతన కుదరలేదు. గాయపడిన వారు 106 మంది అన్నది ఎన్‌ఐఏ లెక్క. కాదు 95 మందేనని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఏకే లాహోటి తేల్చారు. ఈ కేసులో బీజేపీ మాజీ ఎంపి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ కూడా ఏడుగురు నిందితుల్లో ఉన్నారు కనక ఈ కేసు మీద అందరి దృష్ట్టి పడిరది. దోషులు ఎవరో మాత్రం ప్రత్యేక న్యాయస్థానం తేల్చలేక పోయింది. పేలుళ్లకు పాల్పడిరది ఈ కేసులో నిందితులుగా ఉన్న ఏడుగురు కారణం అని ప్రాసిక్యూషన్ అనుమానాలకు తావు లేకుండా నిరూపించలేకపోయిందట. అందరూ 17 ఏళ్ల తరవాత నిర్దోషులుగా బయట పడ్డారు. మృతుల ఆత్మలకు శాంతి కలగాలని కోరుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. 2008 సెప్టెంబర్ 29 రాత్రి మాలేగావ్ లోని భిక్కు చౌక్‌లో బాంబు పేలుడు జరిగింది. ఒక మోటారు సైకిల్‌లో పెట్టిన బాంబు పేలిందంటున్నారు. ఈ పేలుడు జరిగిన చోట ముస్లింలు అధిక సంఖ్యలో ఉంటారు. పైగా అది రంజాన్ నెల. దసరా నవరాత్రులు జరగడానికి కొద్ది రోజుల ముందే ఈ పేలుడు జరిగింది. ఈ ఉదంతంలో ఏ అంశాన్ని పరిశీలించినా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మహారాష్ట్ర తీవ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) మొదట ఈ కేసును దర్యాప్తు మొదలు పెట్టింది. అప్పటికి ఏటీఎస్ అధిపతి హేమంత్ కర్కరే. ఆయన ఆ తరవాత అదే సంవత్సరం నవంబర్ 26న జరిగిన మరో తీవ్రవాద సంఘటనలో మరణించారు. ప్రత్యేక కోర్టు 1,087 వాయిదాలలో ఈ కేసు విచారణ పూర్తయింది. 2011లో మాలేగావ్ కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కు బదిలీ చేశారు. ఆ సంస్థ ఈ కేసును మళ్లీ నమోదు చేసి దర్యాప్తు కొనసాగించింది. విచిత్రం ఏమిటంటే ఈ కేసులో ఎన్‌ఐఏ అనేక చార్జి షీట్లు దాఖలు చేసింది. ఆఖరి చార్జ్‌షీట్ దాఖలు చేయడానికి ఆరేళ్లు పట్టింది. మొత్తం 323 మంది సాక్షులను విచారించారు. అందులో 39 మంది సాక్షులు ఎదురు తిరిగారు. మరో 30 మంది సాక్ష్యం ఇవ్వకుండానే మరణించారు. మొత్తం మీద వాదోపవాదాలు 2024 ఏప్రిల్‌లో అంటే బాంబు పేలుళ్లు జరిగిన దాదాపు పదహారేళ్లకు ముగిశాయి. 2024 ఏప్రిల్ 19న న్యాయమూర్తి లాహోటీ తీర్పు వెలువరించడాన్ని వాయిదా వేశారు. చివరకు గురువారం తీర్పు వెలువరించి వడ్ల గింజలోదే బియ్యపు గింజ అని తేల్చారు. ఏడుగురు నిందితులు ఉన్నా అందులో ఒక్కరు కూడా దోషి అని రుజువు కాలేదు. మాలేగావ్ పేలుళ్ల తరవాతే ‘‘కాషాయ తీవ్రవాదం’’ అన్న మాట ప్రచారంలోకి వచ్చింది. కానీ గురువారం తీర్పు చెప్పిన న్యాయమూర్తి లాహోటి ‘‘తీవ్రవాదానికి మతం ఉండదు’’ అని తేల్చేశారు. తార్కికంగా చూస్తే ఈ మాట అక్షర సత్యంలాగే కనిపిస్తుంది. ఏ మతమూ హింసను ప్రేరేపించకపోవచ్చు. కానీ మతం పేర హింసను ప్రేరేపించడం నిత్యానుభవమే. మతం పేర హింస జరగొచ్చు. మతం కోసం హింస జరగొచ్చు. ఇతర మతాల మీద ఉన్న విద్వేషం వల్లా హింస జరగొచ్చు. ఈ ఆలోచన న్యాయమూర్తికి వచ్చినట్టు లేదు.
ఈ పేలుళ్ల కోసం ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌కు చెందిన మోటారు సైకిల్‌ను ఉపయోగించారంటున్నారు. ఆ మోటారు సైకిలులోనే పేలుడు పదార్థాలు ఉంచారట. కానీ ఈ సంఘటన జరగడానికి ముందే ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ సన్యసించారు కనక, ఆ మోటారు సైకిల్ ఆమెదేనని ప్రాసిక్యూషన్ వారు నిరూపించలేక పోయారు కనక కోర్టు ఆమెను నిర్దోషిగా ప్రకటించింది. న్యాయస్థానాలు తమకు ఇతరత్రా అందుబాటులో ఉండే, లేదా వినిపించే సంఘటనలకు ప్రాధాన్యం ఇవ్వరు. తమ ముందున్న సాక్ష్యాధారాలకే ప్రాధాన్యం ఇస్తారు. కానీ మహాత్మా గాంధీని హతమార్చిన నాథూరాం గాడ్సేను ప్రజ్ఞాసింగ్ ఠాకుర్ కీర్తించడం సదరు న్యాయమూర్తి చెవిన పడకుండా ఉంటుందా! పేలుడువల్లా ఆ మోటార్ సైకిల్ కూడా దగ్ధమైంది కనక దానికి చాసిస్ నంబర్ లాంటివి సేకరించలేక పోయారని, న్యాయసంబంధ (ఫోరెన్సిక్) ఆధారాల్లోనూ కాలుష్యం ఉండొచ్చు కనక ఆ మోటార్ సైకిల్ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌దే నని చెప్పలేమని న్యాయమూర్తి అన్నారు. మరో వంక ఆమె తన మోటార్ సైకిల్‌ను అంతకు ముందెప్పుడో అమ్మేశానంటున్నారు. విచ్ఛిన్నకర కార్యకలాపాలకు అందరికీ మోటార్ సైకిళ్ల లాంటి వాహనాలు ఉంటాయని సదరు న్యాయమూర్తి భావించినట్టున్నారు. దర్యాప్తు సంస్థలు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడి తన జీవితాన్ని నాశనం చేశారని ప్రజ్ఞా ఆరోపించారు. ఇంకో వేపు ఆమెతో పాటు అరెస్టయిన కల్నల్ పురోహిత్ దర్యాప్తు సంస్థల తప్పేమీ లేదంటున్నారు. అసలు ఈ కేసే మౌలికంగా తప్పు అన్నది ఆయన వాదన. ఈ రెండు వాదనల్లోని వైరుధ్యం న్యాయమూర్తి దృష్టికి వచ్చినట్టు లేదు. అసలు ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మీద చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద కేసు మోపనవసరం లేదని కూడా న్యాయమూర్తి భావించారు. నిందితుల మీద గట్టి అనుమానం ఉన్నా కేవలం అనుమానంతో ఎవరినీ శిక్షించలేం అని న్యాయమూర్తి అన్నారు. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరించిన రోహిని సలియాన్ అకస్మాత్తుగా రాజీనామా చేశారు. ఈ కేసును నీరుగార్చాలని ఎన్‌ఐఏ కోరిందట. హిందూ తీవ్రవాదం గురించి పెద్దగా పట్టించుకోనవసరం లేదని ఎన్‌ఐఏ ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు చెప్పిందట. ఈ కేసులో తాను నిర్దోషిగా తేలినందుకు ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ సంతృప్తి చెందడంలో ఆశ్చర్యం లేదు. కానీ ఆమె ‘‘ఇది హిందుత్వ విజయం’’ అన్నారు. హిందూమత విజయం అనలేదన్న మాటను ప్రత్యేకంగా గమనించవలసిన అవసరం ఉంది. ప్రాసిక్యూషన్ (దోష విచారణ చేసే వారు) తగిన సాక్ష్యాధారాలు చూపించలేదు కనక నిందితులు తప్పుచేసి ఉండకపోవచ్చు అని భావించి వారికి శిక్ష విధించలేదు. మాలేగావ్ పేలుళ్లు అసత్యం కాదు. ఆరుగురి మృతి అబద్ధం కాదు. నిందితులను అరెస్టు చేసి సంవత్సరాల తరబడి జైలులో ఉంచడమూ అబద్ధం కాదు. దోష విచారణ జరిపిన వారు నిందితులకు శిక్ష పడేట్టుగా చేయడంలో విఫలమైతే వారి మీద చర్య తీసుకోవాలని న్యాయస్థానాలు ఎప్పుడూ చెప్పవు. విధి నిర్వహణా లోపం శిక్షార్హం కాదనుకుంటారేమో. కనీసం వారు పని చేసే విభాగాన్ని అయినా కేసును నడపడంలో సరిగ్గా విధి నిర్వహించని వారి మీద దర్యాప్తు జరిపించాలని కూడా కోర్ట్లులు ఆదేశించవు. అందుకే పేలుళ్లు సత్యం. శిక్ష మృగ్యం.
పేలుళ్లు సత్యం-శిక్ష మృగ్యం
- Advertisement -


