Thursday, December 5, 2024
Homeఆంధ్రప్రదేశ్ప్రచారానికి తెర

ప్రచారానికి తెర

మహారాష్ట్ర, జార్ఖండ్‌లో ఎన్నికలకు అంతా సిద్ధం

ముంబై/రాంచీ: మహారాష్ట్ర, జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం ముగిసింది. నవంబరు 20న మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు జార్ఖండ్‌లో రెండో విడతలో 38 స్థానాలకు పోలింగ్‌ నిర్వహణకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. మహారాష్ట్రలో నవంబరు 20న ఒకే విడతలో పోలింగ్‌ జరగనుంది. 288 స్థానాలకుగాను మొత్తం 4,136 మంది పోటీ చేస్తున్నారు. వీరిలో 2,086 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. మహారాష్ట్రలో 9,63,69,410 మంది నమోదిత ఓటర్లు ఉన్నారు. అందుకే 1,00,186 పోలింగ్‌ బూత్‌లను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. దాదాపు 6 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నట్లు ఈసీ తెలిపింది. లోక్‌సభ ఎన్నికల్లో మహాయుతి కూటమికి ఎదురు దెబ్బ తగలడం… ఎంవీఏ కూటమి పుంజుకున్న నేపథ్యంలో మహారాష్ట్రలో అధికార, విపక్ష కూటములు ఈసారి హోరాహోరీగా తలపడుతున్నాయి. అధికార కూటమి మహాయుతిలో భాగమైన బీజేపీ 149 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేన 81 మందిని బరిలోకి దింపింది. ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ ఆధ్వర్యంలోని ఎన్సీపీ 59 మంది అభ్యర్థులను పోటీకి నెలబెట్టింది. విపక్ష కూటమి మహావికాస్‌ అఘాడీ (ఎంవీఏ) లో కాంగ్రెస్‌, ఉద్ధవ్‌ ఠాక్రే శివసేన (యూబీటీ) శరద్‌ పవార్‌కు చెందిన ఎన్సీపీ (ఎస్పీ) ఉన్నాయి. కాంగ్రెస్‌ 101 మంది అభ్యర్థులను బరిలో నిలపగా… శివసేన (యూబీటీ)95 మందిని, ఎన్సీపీ (ఎస్పీ) 86 మందిని పోటీకి దించింది. సీట్ల సర్దుబాటు కుదరని కొన్ని స్థానాల్లో కూటమి పక్షాలు స్నేహపూర్వక పోటీ చేస్తున్నాయి. బీఎస్పీ 237 మంది అభ్యర్థులను నిలపగా, ఎంఐఎం కూడా తమకు పట్టుందని భావిస్తున్న 17 చోట్ల అభ్యర్థులను పోటీకి దింపింది.
జార్ఖండ్‌లో…
జార్ఖండ్‌లోని 38 నియోజకవర్గాల్లో వవంబరు 20న పోలింగ్‌ జరగనుంది. 38 నియోజకవర్గాల్లో 522 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పోలింగ్‌కు ఈసీ చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎన్ని కలు జరగనున్న దృష్ట్యా భారీగా బలగా లను మోహరిస్తోంది. జార్ఖండ్‌లో మొత్తం 81 శాసనసభ స్థానాలు ఉండగా… వాటిలో తొలి విడతలో ఈనెల 13న 43 స్థానాలకు పోలింగ్‌ జరిగింది. 43 స్థానాలకు 683 మంది అభ్యర్థులు పోటీపడగా… 66.18 శాతం పోలింగ్‌ నమోదైంది. జార్ఖండ్‌లో జేఎంఎం, కాంగ్రెస్‌, ఆర్జేడీ, సీపీఐ కలిసి మహాఘట్‌ బంధన్‌గా పోటీ చేస్తుండగా, బీజేపీ, ఆల్‌ జార్ఖండ్‌ స్టూడెంట్‌ యూనియన్‌, జేడీయూ, లోక్‌జన్‌ శక్తి రామ్‌ విలాస్‌ పార్టీ కలిసి ఎన్డీఏ కూటమిగా పోటీ చేస్తున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు