పెట్టుబడిదారీ వ్యవస్థ పేదలను, ధనికులను సృష్టిస్తుందని విమర్శకులు పేర్కొంటున్నారు. కష్టజీవులు, కార్మికులు ఉత్పత్తుల ద్వారా సంపదను సృష్టించినప్పటికీ, దానిపై హక్కు లేక పేదరికంలో మగ్గుతున్నారని వాదిస్తున్నారు. మరోవైపు పెట్టుబడిదారులు అనేక దేశాల్లో పారిశ్రామిక రంగాన్ని తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. వెనుకబడిన దేశాల్లో సాగు చేయని భూస్వాముల వద్ద భూమి పోగుపడగా, సాగు చేసే గ్రామీణ పేదలు భూమికి దూరమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రజల మధ్య ఆర్థిక వ్యత్యాసాలు తీవ్రంగా పెరిగాయి. పెట్టుబడిదారీ వ్యవస్థ సృష్టించిన ఆర్థిక అసమానతల వల్ల మొత్తం ప్రపంచ సంపదలో 10 శాతంగా ఉన్న ధనవంతుల వద్ద 75 శాతం సంపద ఉండగా, 90 శాతం ప్రజల వద్ద 25 శాతం సంపద మాత్రమే ఉంది. అత్యంత ధనవంతులైన ఒక్క శాతం కుబేరుల వద్ద 37 శాతం పైగా సంపద పోగుబడి ఉంది. ప్రపంచంలో 100 బిలియన్ల అమెరికా డాలర్ల కంటే ఎక్కువ సంపద ఉన్న వారి సంఖ్య 15కు చేరింది. ఎలాన్ మస్క్క 936 బిలియన్ డాలర్లు, లారీ ఫేజ్ 299, సెర్గీబ్రిన్ 275, మైఖేల్ డెల్ 229, జెఫ్ బెజోస్ 225 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే అగ్రశ్రేణి కుబేరులుగా ఉన్నారు. సంపద కొంతమంది దగ్గరే పోగుబడి ఉండేసరికి భారతదేశంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి. ముఖేష్ అంబానీ 9.8 లక్షల కోట్లు, గౌతమ్ అదానీ 7.5 లక్షల కోట్లు, రోష్ని నాడార్ 3.2 లక్షల కోట్లు, సైరస్ పూనావాలా 3 లక్షల కోట్లు, 2.5 లక్షల కోట్లు, దిలీప్ షాంఘ్వీ 2.3 లక్షల కోట్లు, అజీమ్ ప్రేమ్జీ 2.3 లక్షల కోట్లు, నీరజ్ బజాజ్ 2.2 లక్షల కోట్లు, అశోక్ హిందూజా 2.2 లక్షల కోట్లు, రాధాకృష్ణ దమానీ1.5లక్షల కోట్లతో భారత అగ్రశ్రేణి సంపన్నులుగా ఉన్నారు. పెట్టుబడిదారీ విధానాల ఫలితంగా ప్రపంచంలో ఆర్థిక అసమానతలతో పాటు సంపద కొద్దిమంది వద్ద పోగుబడి ఉండటం వల్ల ప్రపంచంలో పేదరికం తీవ్రంగా ఉంది. ప్రపంచ జనాభాలోని 70 కోట్లకు పైగా ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన తీవ్ర పేదరికంలో ఉన్నారు. రోజుకి మూడు అమెరికా డాలర్లు, భారతీయ కరెన్సీలో 250 రూపాయల కంటే తక్కువ ఆదాయంతో జీవించే వారిని తీవ్ర పేదరికంలో ఉన్నవారిగా ఐక్యరాజ్య సమితి, ప్రపంచ బ్యాంకు పరిగణిస్తున్నాయి. సబ్`సహారా ఆఫ్రికా ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత పేద ప్రాంతం. అక్కడ 4కోట్ల, 30 లక్షల మంది తీవ్ర పేదరికంలో ఉన్నారు. అత్యధిక శాతం పేదలున్న దేశంగా ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది భారతదేశం. దేశంలో 23.4 కోట్ల మంది తీవ్ర పేదరికంలో మగ్గుతున్నారని ఐక్యరాజ్య సమితి నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. రోజువారీ ఆదాయం మూడు డాలర్ల కన్నా తక్కువ ఉన్నవారిని ప్రామాణికంగా తీసుకుంటే, భారతదేశంలో తీవ్ర పేదరికంలో ఉన్నవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. దేశం రోజు మూడు డాలర్ల ఆదాయం కూడా అత్యధిక ప్రజలకు లభించకపోవడమే అందుకు కారణం. భారతదేశంలో, పాకిస్తాన్, ఇథియోపియా, నైజీరియా దేశాల కన్నా పేదలు ఎక్కువగా ఉన్నారు. సంపదలోని వ్యత్యాసాల వల్ల ప్రజలు పేదరికంలో మగ్గుతూ ఆకలితో అలమటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 90 లక్షల మంది ప్రజలు ఆకలితో మరణిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి, వివిధ అంతర్జాతీయ సంస్థల నివేదికల ప్రకారం ఈ గణాంకాలు నమోదయ్యాయి. ప్రతి రోజు ప్రపంచవ్యాప్తంగా 25 వేల మంది ఆకలి వల్ల మరణిస్తున్నారు. యుద్ధాలు, అంతర్గత కలహాలు నడుస్తున్న దేశాల్లోనే ఆకలి వల్ల వేలాది మంది చనిపోతున్నారని ఆక్స్ఫామ్ నివేదిక పేర్కొంది. ఆకలి మరణాలలో మూడింట ఒక వంతు అంటే 30 లక్షల మంది ఐదేళ్లలోపు చిన్నారులే ఉంటున్నారు. తీవ్ర ఆహార లోపం వల్ల పిల్లల రోగనిరోధక శక్తి క్ష్మీణించి, సాధారణ వ్యాధులు కూడా ప్రాణాంతకంగా మారుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 73.3 కోట్ల మంది ప్రతి రాత్రి ఆకలితో నిద్రపోతున్నారు. సూడాన్, పాలస్తీనా (గాజా) దక్షిణ సూడాన్ ,హైతీ, మాలి వంటి దేశాల్లో కరువు పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. 2030 నాటికి ఆకలి రహిత ప్రపంచంగా మార్చాలనే ఐక్యరాజ్య సమితి లక్ష్యం నెరవేరే పరిస్థితి కనుచూపు మేరలో కల్పించడం లేదు. తాజా గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రకారం, 123 దేశాల్లో భారత్ 102వ స్థానంలో ఉంది. ఆకలి, పోషకాహార లోపం తీవ్రతను వర్గీకరించి మన దేశానికి 25.8 స్కోర్ లభించింది. దేశ జనాభాలో అవసరమైన క్యాలరీలున్న ఆహారం కూడా లభించని వారు 12శాతం ఉన్నారు. ఐదేళ్ల లోపు పిల్లల్లో, వయసుకు తగ్గ ఎత్తు కూడా లేని పిల్లలు 32.9 శాతంగా ఉన్నారు. ప్రతి ముగ్గురులో ఒకరు ఎత్తుకు తగ్గ బరువు లేరు. తీవ్ర పోషకాహార లోపం ఉన్న పిల్లలు 18.7శాతం ఉన్నారు. ఎన్ఎఫ్హెచ్ఎస్ నివేదిక ప్రకారం దేశంలో 50శాతం మంది గర్భిణలు, కౌమార బాలికలు రక్తహీనతతో బాధపడుతున్నారు. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం భారతదేశంలో తీవ్ర పోషకాహార లోపం వల్ల ఐదేళ్ల లోపు పిల్లలు ఏటా 3 లక్షలకు పైగా చనిపోతున్నారు. భారతదేశంలో ప్రత్యక్షంగా ఆకలి లేక అన్నం లేక చనిపోయిన వారి మరణాలు నమోదు కాలేదని, దేశంలో ఆకలి చావులు లేవని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కాని అంతర్జాతీయ సంస్థలు యూనిసెఫ్, ఎఫ్ఏఓ వివిధ స్వచ్ఛంద సంస్థల పరిశోధనల ప్రకారం తీవ్రమైన పోషకాహార లోపం వల్ల ఏర్పడే అనారోగ్య సమస్యల వల్ల భారత్లో ఏటా లక్షలాది మంది మరణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పేదరికానికి, ఆకలి మరణాలకు పెట్టుబడిదారీ, భూస్వామ్య వ్యవస్థలే కారణం. ఈ వ్యవస్థల స్థానంలో నూతన ప్రజాతంత్ర వ్యవస్థలు, సోషలిస్టు వ్యవస్థలు ఏర్పడినప్పుడే పేదరికం తొలగి ఆకలి మరణాలు ఆగుతాయి. అందుకు వెనుకబడిన దేశాల, పెట్టుబడిదారీ దేశాల ప్రజలు నేటి వ్యవస్థల మార్పు కోసం ఉద్యమించాలి.
రైతు కూలీ సంఘం (ఆం.ప్ర) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సెల్ : 9885983526
ప్రపంచవ్యాప్తంగా పేదరికం… ఆకలి మరణాలు
- Advertisement -


