న్యూదిల్లీ: కేంద్ర బడ్జెట్‌కు వేళయ్యింది. ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. దీంతో సంప్రదాయం ప్రకారం బడ్జెట్ హల్వా సిద్ధమైంది. ఈ వేడుక ఆర్థిక శాఖ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సహాయ మంత్రి పంకజ్ చౌధరీ పాల్గొన్నారు. ఆర్థిక శాఖ పరిధిలోని అన్ని విభాగాల కార్యదర్శులు, బడ్జెట్ రూపకల్పనలో భాగమైన అధికారులు హాజరయ్యారు. అనంతరం సీతారామన్ బడ్జెట్ ప్రతుల ముద్రణ, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది వరుసగా తొమ్మిదోసారి. ఒక వైపు అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, మరోవైపు దేశం 7.4శాతం వృద్ధి నేపథ్యంలో ప్రవేశపెట్టే బడ్జెట్ కావడంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. హల్వా వేడుకతో బడ్జెట్ తయారీలో ప్రత్యక్షంగా పాల్గొనే అధికారులు, సిబ్బంది పార్లమెంట్‌లో వార్షిక పద్దును ప్రవేశపెట్టేవరకు నార్త్ బ్లాక్‌లోనే ఉంటారు. బయటకు వెళ్లలేరు. సీసీటీవీ కెమెరాలు, భద్రతా సిబ్బంది నిఘాలో ఉంటారు. ఫోన్ చేయడానికి వీలుండదు. బడ్జెట్ ప్రసంగం పూర్తయిన తర్వాతే వీరు బయటకు వస్తారు. అంటే ఐదు రోజులు బయట ప్రపంచంతో వీరికి సంబంధాలు ఉండవు. 1950లో బడ్జెట్ ముద్రణ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో పద్దులు లీకయ్యాయి. దీంతో ‘లాక్-ఇన’ నిర్ణయం తీసుకున్నారు.


