Homeబీళ్లన్నీ ఇక పంటలే

బీళ్లన్నీ ఇక పంటలే

- Advertisement -

పోలవరం ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు

  • 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, 9 లక్షల మందికి తాగునీరు
  • 2028 నాటికి 12 సాగునీటి ప్రాజెక్టులు పూర్తి
  • పాయకరావుపేట సభలో సీఎం చంద్రబాబు

విశాలాంధ్ర – పాయకరాపుపేట : పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్రలోకి అడుగుపెట్టాయి. పాయకరావుపేట వద్ద క్రాస్ రెగ్యులేటర్ నుంచి ప్రవహించిన గోదారమ్మకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించి జల హారతి ఇచ్చారు. పవిత్ర జలాలను శిరస్సుపై చల్లుకుని అనంతరం అక్కడే శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనకాపల్లికి గోదారమ్మ తరలి వచ్చిన భావోద్వేగ వాతావరణం మధ్య పోలవరం ఎడమ కాలువలో నిల్చుని గోదావరి జలాలకు పుష్పాలు, పసుపు కుంకుమ సమర్పించిన సీఎం…జలహారతి ఇచ్చారు. కాలువకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో చేరిన స్థానికులు, రైతులు, మహిళలు పుష్పాలతో జలాలకు స్వాగతం పలికారు. మహిళలు హారతులు ఇచ్చారు. అరుణవర్ణంలో పరవళ్లు తొక్కుతూ వస్తున్న గోదావరి జలాలకు సీఎం సాష్టాంగ నమస్కారం చేశారు. గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు చేరడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. గోదావరి జలాలకు జలహారతి అనంతరం క్రాస్ రెగ్యులేటర్ వద్దకు చేరుకుని స్థానిక రైతులతో కలిసి రెగ్యులేటర్ గేట్లను ఎత్తారు. ప్రస్తుతం ఎడమ కాలువ ద్వారా విడుదల చేసిన నీటితో తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లోని 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, 9.23 లక్షల మందికి తాగునీరు ఇచ్చేలా ప్రభుత్వం ప్రణాళిక చేసింది. తాండవ, వరాహ, శారదా నదులతో పాటు ఏలేరు కాలువలపై సైఫన్లు, ఆకిÇడెకుట్లను నిర్మించింది. ఎడమ కాలువ కోసం ఇప్పటి వరకూ రూ.4192 కోట్లను ప్రభుత్వం వ్యయం చేసింది. ఎడమ కాలువ ద్వారా వచ్చిన నీటితో అనకాపల్లి వద్ద ఏలేరు కాలువతో పాటు జిల్లాలోని 110 చెరువులను నింపేలా జల వనరుల శాఖ ప్రణాళిక చేసింది. గోదావరి జలాలతో పుష్కర ఆయకట్టు పరిధిలో 1.48 లక్షల ఎకరాలు, ఏలేరు కింద 80 వేల ఎకరాలు, పంపా కింద 12 వేల ఎకరాలు, తాండవ, వరహా, మామిడి గెడ¦ ఆయకట్టు పరిధిలో ఉన్న 46,620 ఎకరాల స్థిరీకరణ జరుగనుంది. దీంతో పాటు విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని పారిశ్రామిక అవసరాలకు, తాగు, సాగునీటి అవసరాల కోసం 23.44 టీఎంసీల నీటిని తరలించేలా ప్రణాళిక చేసినట్టు సీఎంకు జల వనరుల శాఖ అధికారులు వివరించారు. ఈ సందర్భంగా పీఎల్ పురం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్లు వచ్చాయి. ఇక ఈ ప్రాంతంలోని బీళ్లన్నీ పంటలు పండుతాయని ఆనందం వ్యక్తం చేశారు. గోదావరి మూడు పాయలు గౌతమి, వశిష్ఠ, వైనతేయ సముద్రంలో కలుస్తుంటే..ఇప్పుడు పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లికి గోదావరి తరలి వచ్చిందన్నారు. తూర్పు కనుమలు, అడవులు, నదులు, వాగులు, వంకలు, హైవేలను దాటుకుని అన్నవరం సత్య దేవుడి ఆశీస్సుల కోసం గోదారమ్మ ఇక్కడకు వచ్చిందని పేర్కొన్నారు. వచ్చే ఏడాదికి సింహాచలం అప్పన్న చెంతకు గోదావరి జలాలను తీసుకువెళతామని, ఆపై అరసవల్లి సూర్యనారాయణ స్వామి వద్దకు తరలించి వంశధార వరకూ గోదావరిని జలాలను తరలించి అనుసంధానం చేస్తామని చెప్పారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో సాగు, తాగునీటి అవసరాలు తీర్చేలా ప్రణాళిక రూపొందించామని సీఎం తెలిపారు. తొలి దశలో 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, 9 లక్షల మందికి తాగునీరు అందేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. పోలవరం ఎడమ కాలువలో ప్రవహిస్తున్న ప్రతి నీటి చుక్క వెనుక ఇంజినీర్ల ప్రతిభ, కార్మికుల కష్టం, రైతుల నిరీక్షణ, నిర్వాసితుల త్యాగం, ప్రభుత్వ సమర్థత ఉన్నాయని సీఎం పేర్కొన్నారు.
కూటమి వచ్చాక పోలవరానికి శాప విముక్తి
2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరం ప్రాజెక్టు సాకారం కావడానికి ఏడు ముంపు మండలాలను రాష్ట్రంలో విలీనం చేసేలా కృషి చేశానని చంద్రబాబు తెలిపారు. ప్రతి సోమవారాన్ని పోలవారంగా మార్చుకుని 2019 వరకు 72 శాతం పనులు పూర్తి చేశామని గుర్తు చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన గొడ్డలి పార్టీ పోలవరం ప్రాజెక్టును విధ్వంసం చేసిందన్నారు. డయాఫ్రాం వాల్ కొట్టుకు పోయిందని అన్నారు. 2024లో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం ద్వారా ప్రజలే పోలవరానికి శాప విముక్తి కల్పించారని అన్నారు. రాష్ట్రంలో ఏ మంచి జరిగినా తామే చేశామంటూ గొడ్డలి పార్టీ పేక్ ప్రచారానికి పాల్పడుతోందని విమర్శించారు. భోగాపురం ఎయిర్ పోర్టు, వెలిగొండ ప్రాజెక్టులు తామే కట్టామని చెప్పుకుంటోందని అన్నారు. ప్రజలు ఛీ కొట్టినా ఆ పార్టీకి సిగ్గు రావటం లేదన్నారు. అనకాపల్లికి నీరు కూడా తామే చేశామని చెప్పుకుంటారని, పోలవరం పూర్తి అయితే మా గొప్పే అంటారని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు తీసుకురావడం అంత సులభంగా జరగలేదని, గంటలు, రోజుల వారీగా లక్ష్యాలు పెట్టుకుని పనులు పరుగులు పెట్టించామని తెలిపారు. ఎడమ ప్రధాన కాలువను మరింత విస్తరించి ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి అనుసంధానం చేస్తామని చంద్రబాబు చెప్పారు. రూ.3,200 కోట్లతో ఉత్తరాంధ్రలోని 12 ప్రధాన ప్రాజెక్టులను పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. వచ్చే మూడేళ్లలో రూ.35 వేల కోట్లతో 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని తెలిపారు. గత రెండేళ్లలో సాగునీటి రంగంలో రూ.25 వేల కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. గోదావరి- కృష్ణా సహా రాష్ట్రంలోని అన్ని నదులను అనుసంధానం చేసి తెలుగు తల్లికి జల హారతి ఇస్తానని చంద్రబాబు ప్రకటించారు.
ఇక ఉత్తరాంధ్రకే వలసలు
నీరు పుష్కలంగా ఉంటే పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధికి భద్రత ఉంటుందని సీఎం చెప్పారు. విశాఖ, అనకాపల్లి ప్రాంతాల్లో భారీ పెట్టుబడులు రాన్నుాయని తెలిపారు. ఆరు నెలల క్రితం అనకాపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశామని గుర్తుచేశారు. పెద్ద డేటా సెంటర్లు, ఐటీ కంపెనీలు వస్తున్నాయని, ఆసియా మొత్తాన్ని అనుసంధానించే సబ్సీ కేబుల్ కనెక్టివిటీ కూడా రానుందని తెలిపారు. హార్బర్లు, మూలపేట పోర్టుల ద్వారా తూర్పు తీరాన్‌ని మధ్య భారత్‌తో అనుసంధానిస్తా మన్నారు. హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి తరహాలో అనకాపల్లి అభివృద్ధికి చిరునామాగా మారుతుందని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర నుంచి వలసలు వెళ్లడం కాదు..ఉత్తరాంధ్రకే వలసలు వచ్చే పరిస్థితి వస్తుందని. ఉత్తరాంధ్ర ఉన్నతాంధ్రగా మారుతుందని ముఖ్యమంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సహా మంత్రులు నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, పి.నారాయణ, కె.అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, కె.పారÆసారధి, ఎంపీలు విజయ్, సీఎం రమేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు