Sunday, March 16, 2025
Homeవిశ్లేషణభలే మంచిరోజు

భలే మంచిరోజు

చింతపట్ల సుదర్శన్‌
బారెడు పొద్దెక్కింది. ఎండ చురుక్కుమం టున్నది. అయినా డాగీ ఎప్పటిలా లేచి మొరగలేదు. డాంకీ ఎప్పటిలా సంగీత సాధనకు పూనుకోలేదు. ఎండ చురుకు ఎక్కువైంది. వీధుల్లో జనం ఊరికే తిరగరు కదా అరిచి గీ పెడ్తారు కదా. ఆ అరుపులూ, కేకలకు మొదట కళ్లు తెరిచింది డాగీ. అలా తెరిచిన కళ్లను గోడవారన ఉన్న డాంకీ కేసి తిప్పింది. డాంకీ తోలు మందం కదా ఎండ చురుకు తగల్లేదేమో ఇంకా మూసిన కళ్లు తెరవనే లేదు.
లేచి ఒళ్లు విరుచుకుని మైదానం కేసి చూసింది డాగీ. మైదానం నిండా చిత్తు కాగితాలు, విరిగిపోయిన ప్లాస్టిక్‌ కుర్చీల తాలూకు కాళ్లూ, చేతులు, లౌడ్‌ స్పీకర్ల కోసం పాతిపెట్టిన ఖాళీ గుంజలు కనిపించేయి. మైక్‌ టెస్టింగ్‌ కోసం హలో, హలో అని అరిచినట్టు నోరు తెరిచి రెండు ‘భౌభౌ’ లు గాల్లోకి విసిరేసింది. అవి తెర్చుకుని ఉన్న డాంకీ చెవుల్లో దూరి, మూసుకున్న దాని కళ్లు తెరిచేయి.
ఏంటి ‘బ్రో’ నిద్ర చెడగొడ్తున్నావు అని విసుక్కుంది డాంకీ తెరిచిన కళ్లు నులుముకుంటూ. ఇంకా ఎంతసేపు పండుకుంటావు. మన మేమన్నా అసెంబ్లీ, పార్లమెంటు సభ్యులమా సబ్సిడీ కేఫ్‌ల్లో చవగ్గా తిని త్రేన్చటానికి. తిండి కోసం ఒళ్లు దాచుకోకుండా వీధులన్నీ సర్వే చేయాలి కదా అంది డాగీ. అది సరేననుకో. కానీ రాత్రి మైదానంలో జరిగిన గలాటా చూశావు కదా. అరుపులు, కేకలు, చప్పట్లు, ఈలలు మైకుల్లో లౌడ్‌ స్పీకర్లను చిత్రవధ చేసిన ఉపన్యాసాలు అర్ధరాత్రి దాటిం తర్వాతే కదా సమావేశం చట్టుబండలయింది. కునుకు వేసే ఛాన్సు వచ్చింది అంది డాంకీ. నువ్వే కాదు నేను కూడా బాధితుడ్నే. చూడు మైదానం చెత్త కాగితాల్తో, విరిగిన వస్తువుల్తో ఎంత కళకళలాడ్తున్నదో. డాంకీ లేచి అరుగు చివరకు వెళ్లి ఎక్కడ చూసినా కాగితాలు, తిని పారేసిన పేపరు ప్లేట్లే. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభానంతర మైదానం ఇలాగ ఈకలు పీకిన కోడైయిందన్న మాట. అబ్బబ్బ ఏమి ఉపన్యాసాలు దంచారు. ప్రతిపక్షాల మీద ఏమి చురకత్తులు నూరారు అంది డాంకీ. చెప్పే వాడికి వినేవాడు ఎప్పుడూ లోకువే కదా. అయినా ఏడాదికి ఒక్క రోజన్నా ఆడ కూతుర్ల మీద ఈ మాత్రం గౌరవం… మమకారం చూపవలసిందే కదా. మళ్లీ ఏడు మార్చి 8 వరకూ సరిపోయేంత ఒలక బోయవలసిందే కదా అంది డాగీ. ప్రతి రోజూ ఎంత హింస పెట్టినా ఏటికి ఒక్కరోజన్నా ‘ఇస్పెషల్‌’ గా చూడాలి కదా అంది డాంకీ. ఎంత ప్రేమ ఒలకబోశారు సర్కారీ పెద్దలు. భారతీయ సంప్రదాయంలో స్త్రీలకు ఉన్న గౌరవాన్ని ఎంత చక్కగా చెప్పి గొప్ప చెక్క భజన చేశారు అంది డాగీ. అవునవును ఓ పక్క చెక్క భజన, మరోపక్క గత ప్రభుత్వం హయాంలో స్త్రీలకు జరిగిన అన్యాయాల వివరణ ఇవ్వడం, వారి కివ్వాల్సిన డబ్బు మింగేసిన పందికొక్కులను తిట్టిన తిట్టు రిపీటవకుండా తిట్టడం ఎంత రంజుగా ఉండిరదో. నడి వేసవిలో చెమటలు పట్టేవాడికి ‘ఐబాకో ఐస్‌క్రీం’ తిన్న ఫీలింగు వచ్చేట్టు ఎన్ని వరాలు కురింపించారో ఎన్ని హామీలు గుప్పించారో అంది డాంకీ.
ఉద్యోగం రాక ముందే ఊబకాయం, బట్టతలా వచ్చేస్తయేమోనని భయపడి రోజూ బుద్ధిగా వాకింగ్‌కు వస్తున్న అబ్బాయి అరుగు ఎక్కాడు. మైదానం అంతా కుక్కలు చింపిన విస్తరి అయిందే సారీ డాగీ అలవాటులో పొరపాటు అన్నాడబ్బాయి. మీటింగ్‌కి నువ్వూ వచ్చావు కదా రాత్రి. ముగ్గురు మెయిన్‌ దేవుళ్లే కాక ముప్పయి మూడు కోట్ల మంది దేవతలు దిగివచ్చినా ధైర్యం చేసి ఇవ్వలేని వరాలన్నీ గుప్పించి వదిలేరు మైకుల్లో అంది డాగీ.
అవును. చెప్పే వరాలే కాని ఇచ్చే వరాలు కావుగదా. నోరు జారడమే కాని చేయి విదిల్చేది ఉండదు కదా. అక్కచెల్లెమ్మల కోసం ఆ మాత్రం నోరు పారేసుకోక పోతే బావుండదు కదా. అక్కలయితేనేం చెలమ్మ్లలయితేనేం అందరినీ కోటీశ్వరాళ్లను చేస్తాం అన్నారు. అదానీ అంబానీలను చేస్తామన్నారు. అందరికీ రైసు మిల్లులిస్తామన్నారు. గోదాములు కట్టిస్తామన్నారు. స్వంతంగా కరెంటు తయారు చేసుకోండని అన్నారు. ఈ మాత్రం ‘మస్కా’ లేకుండా రేపు ఓటు కోసం నమస్కారాలెలా చేస్తారు మరి అన్నాడు అబ్బాయి.
ఆడాళ్లకో రోజు, మగాళ్ల కోరోజు, ముసిలాళ్లకోరోజు, పడుచోళ్లకో రోజు, బుడ్డోళ్లకో రోజు, సర్కారోళ్లు మాటల మూటలు పంచడానికున్నయి ఎన్నో భలే మంచి రోజులు అని నడ్డి తిప్పుతూ ‘డాన్సు’ చేసింది డాగీ.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు