ఏ కార్యక్రమమైనా లోకేశ్పైనే దృష్టి
శాఖా బాధ్యులకు దక్కని ప్రాధాన్యత
వెలిగొడ, పోలవరం ప్రారంభోత్సవాల్లో అదే పంథా
ప్రభుత్వ తీరుపై కూటమి శ్రేణుల్లో అసంతృప్తి
విశాలాంధ్రబ్యూరో-అమరావతి: కూటమి ప్రభుత్వంలో మంత్రుల పాత్రపై కొత్త చర్చ మొదలైంది. కీలక శాఖల మంత్రులకు అధికారిక కార్యక్రమాల్లోనే ప్రాధాన్యం దక్కడం లేదన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్తో పాటు సంబంధిత శాఖతో ప్రత్యక్ష సంబంధం లేని నారా లోకేశ్ ఫొటోలకు ప్రాధాన్యతిస్తూ.. మంత్రుల ఫొటోలను అధికారిక ప్రకటనల్లో విస్మరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లోనూ ఇదే తీరు ఉండటంతో కూటమి నేతలు, మంత్రుల అనుచరులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఆయా శాఖలకు బాధ్యత వహించే మంత్రులకు పాలనలో స్వేచ్ఛ, ప్రాధాన్యత ప్రశ్నార్థకంగా మారిందన్న చర్చ నడుస్తోంది. పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు బుధవారం నీటి విడుదల కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించింది. చంద్రబాబు నాయుడు గోదావరమ్మకు జలహారతి ఇచ్చారు. ఉత్తరాంధ్రకు నీటిని విడుదల చేశారు. అయితే అధికారిక ప్రకటనల్లో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడికి తగిన ప్రాధాన్యత దక్కలేదని కూటమి శ్రేణులు మాట్లాడుకుంటున్నారు. వెలిగొండ ప్రాజెక్టు విషయంలోనూ నిమ్మల ఫొటో లేకుండానే ప్రకటనలు వెలువడ్డాయి. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను ముఖ్యమంత్రి ప్రారంభించారు. పనులు వేగవంతం చేయడంలో మంత్రి నిమ్మల కీలకంగా వ్యవహరించారు. పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు 48 గంటలకుపైగా సొరంగంలో కార్మికులతో గడిపారు. మంత్రి కృషిని ప్రభుత్వ వర్గాలకు, ప్రజలందరికీ తెలిసినప్పటికీ వెలిగొండ, పోలవరం ఎడమ కాలువ వంటి జలవనరుల శాఖకు సంబంధించిన కార్యక్రమాలలో ఆయన ఫొటోకు ప్రాధాన్యత లేకపోవడంపై టీడీపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. మంత్రులు బహిరంగంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేయలేని పరిస్థితి ఉన్నప్పటికీ వారి అనుచరులు సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్కే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మిగిలిన మంత్రుల పాత్ర నామమాత్రంగా మారుతోందని అంటున్నారు. శాఖలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనే ‘ఉత్సవ విగ్రహాలు’గా మంత్రులు మిగిలిపోతున్నారా అని ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు.
ఏబీ వెంకటేశ్వరరావు వ్యంగ్యాస్త్రం
ఈ పరిణామంపై రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు ‘ఎక్స్’ వేదికగా విమర్శలు గుప్పించారు. కేబినెట్‌లో చంద్రబాబు, నారా లోకేశ్, పవన్ కల్యాణ్ మినహా మంత్రులంతా నామమాత్రులేన్న అభిప్రాయం ప్రజల్లో ఉందన్నారు. జల వనరుల శాఖ ప్రాజెక్టు కార్యక్రమంలో ఆ శాఖ మంత్రి ఫొటో లేకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు.
‘గతంలో తెలంగాణలో కేసీఆర్ 68 రోజులు ఆయన… మహమ్మద్ మహమూద్ అలీ మాత్రమే ఉండి, కేబినెట్ లేకుండా ప్రభుత్వం నడిపారు. మరి మీరు కూడా త్రిసభ్య కేబినెట్‌తో పరిపాలన చేయొచ్చుగా? ఎందుకు ఖర్చు దండగ?’ అంటూ వెంకటేశ్వరరావు వ్యంగ్యాస్త్రం సంధించారు. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరýయ్యాయి. దీంతో ప్రభుత్వంలో మంత్రుల ప్రాధాన్యత, అధికార వ్యవస్థలో వారి పాత్రపై రాజకీయ వర్గాల్లో చర్చ మరింత ముదిరింది.


