డిప్యూటీ సీఎంలుగా మరో ఇద్దరు
ఇంఫాల్: రాష్ట్రపతి పాలన ఎత్తివేసిన మణిపూర్‌లో నూతన ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ నేత యుమ్నం ఖేమ్‌చంద్ సింగ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. కుకీ సామాజిక వర్గానికి చెందిన బీజేపీ నేత నెమ్చా కిప్‌జెన్, నాగా సామాజికవర్గానికి చెందిన నాగా పీపుల్స్ ఫ్రంట్ ఎమ్మెల్యే లోసిడిఖో ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. లోక్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ అజయ్ కుమార్ బల్లా వీరితో ప్రమాణం చేయించారు. కాగా, కిప్‌జెన్ రాష్ట్రానికి మొదటి మహిళా ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అంతకుముందు ఖేమ్‌చంద్ సింగ్ గవర్నర్ అజయ్ కుమార్ uల్లాను కలిసి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. మంగళవారం బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఖేమ్‌చంద్ ఎన్నికైన సంగతి విదితమే. బీజేపీ నాయకుడు ఎన్ బీరెన్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం ఫిబ్రవరి 2025 నుండి మణిపూర్ రాష్ట్రపతి పాలనలో అమలులో ఉంది. ఆగస్టులో ఆరునెలలపాటు రాష్ట్రపతి పాలన పొడిగించగా… ఈ నెలతో ఆ గడువు ముగియనుంది. ఖేమ్‌చంద్ సింగ్ 2017`2022 మధ్య అసెంబ్లీ స్పీకర్‌గా, బీరెన్ సింగ్ ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా ఉన్నారు.
రాష్ట్రపతి పాలన ఎత్తివేత
న్యూదిల్లీ: మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తూ కేంద్ర హోంశాఖ బుధవారం గెజిట్ విడుదల చేసింది. దాదాపు ఏడాది తర్వాత రాష్ట్రపతి పాలనను కేంద్రం ఉపసంహరించుకుంది. ఈశాన్య రాష్ట్రంలో రాజ్యాంగ ప్రక్రియను అధికారికంగా పునరుద్ధరించాలని హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. బీరెన్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది.


