చింతపట్ల సుదర్శన్
మైదానంలో జనం కదలికలు కనిపించి లేచి నిలబడ్డది డాగీ. తల పైకిఎత్తి, చెవులు వెనక్కి లాగి తోకని నిటారుగా నిలబెట్టింది. డాగీ వాలకం కనిపెట్టిన డాంకీ ‘అలర్ట్’ అయింది. డాగీ యుద్ధోన్మాదం వద్దు, సాహసం అన్ని వేళలా జయప్రదం కాదు అన్న మాట వినలేదూ ఎందుకా ఆవేశకావేశం? ఎత్తిన తోక దించు అంది డాంకీ. అదేమిటో ‘బ్రో’ ఎవడో పరాయివాడు మన గడ్డమీద కాలు పెడితే ఊరుకుంటామా, కరవకపోతే పోతిమి, కనీసం నెత్తిన నోరు పెట్టుకుని అరవనైనా కూడదా. ఎన్నికల్లో ఓడి పదవి ఊడి నెత్తిన ఉత్తరీయం కప్పుకున్నవాడు అరిచినంత మాత్రాన ‘గీ’ పెట్టినంత మాత్రాన ఆకాశం ఊడిపడదు, ఐదేళ్ల దాకా ఎన్నికలలు కన్నా ఎన్నికలూ రావు. నీ అరుపులు ఎవరు విని భయపడతారు? అటు చూడు జనం గుంపులుగా వస్తున్నారు. అరిస్తే అందరూ కలిసి నీ నోరు కుట్టేయగలరు. ఏనుగు దేవుడి పండగ వస్తున్నది కదా. మండపం ఏర్పాట్లకు వస్తున్నారు వాళ్లంతా. నువ్వు అనవసరంగా కలగజేసుకుంటే నీకే ప్రమాదం. ఈ తొమ్మిది రోజులు, వాళ్ల డీజే మోతలూ, తీన్‌మార్ డప్పు డాన్సులూ భరించక తప్పది మనం అంది డాంకీ. ఏనుగు దేవుడి పండగంటే ఓహో వినాయకుడి పండుగా. ఇక ఊరంతా మోతేగా. రోడ్డుకు అడ్డంగా నిలబడే మండపాలతో ట్రాఫిక్ జామేగా అంది డాగీ, విషయం అర్థమయ్యి. చెవులు వేలాడేసి, తోక వడి తిప్పేసి, కూర్చుండి పోయింది.
అదీ బుద్ధిమంతుల లక్షణం ఎక్కడ వాగాలో, ఎక్కడ మొరగాలో తెలీని రాజకీయ నాయకుళ్లల్లా కాక తక్షణం అర్థం చేసుకున్నందుకు ‘థాంక్స్’. అసలే పేపర్ల నిండా కుక్క పీకుళ్లే. సుప్రీంకోర్టులోనే వెలుగుతున్నది మీ ప్రభ. ఇలాంటప్పుడు నువ్వు మొరిగితే జంతు ప్రేమికుల మీది కోపం, కసి నీ మీద చూపగలరు. అకులందున అణిగిమణిగీ కవిత కోకిల పలుక వలెనోయ్ అన్నాడో కవి అది నీకూ నాకూ కూడా వర్తిస్తుంది మరి అంది డాంకీ.
యుద్ధ విరమణ ప్రకటించి అస్త్ర సన్యాసంచేసి కూచున్న డాగీ చెవులకు లోపలి గదిలోంచి ఏవో ఏవేవో చప్పుళ్లు వినిపించేయి. ఏం చప్పుడు? ఎవరన్నా ఉన్నారా లోపల? అనడిగింది డాగీ. గంజాయి దమ్ము కోసం పకీర్లూ, బైరాగులూ ఈ తొమ్మిది రోజులూ ఊరవతలకి పోవలసిందే. లోపల చప్పుడు చేస్తున్నవి ఎలకలు అనగా ర్యాట్స్ అనగా మూషికములు అంది డాంకీ. అన్ని ‘సిననీమ్స్’ ఎందుకులే మొదటిదొక్కటి చాలు. పాత ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయి, ఖాళీ చేసిపోతే దివాళా తీసిన ఖజానాలా ఉన్న మన ఈ పాత కొంపలో ఎలుకలకేమి దొరుకుతుంది. లోపలికెళ్లి ఓ మొరుగు మొరిగి భయపెట్టి తోలేయనా? అంది డాగీ. ప్రభుత్వం చేయాల్సిన పని ప్రతిపక్షాలు, ప్రతిపక్షాలు తిట్టాల్సిన తిట్లు ప్రభుత్వాలు చెయ్యడం, వాడడం సబబు కాదు. అయినా ఎలుకలు పిల్లులకు బెదుర్తయి కాని, నీకూ నాకూ కాదు. పైగా ఇప్పుడు బలవంతపు చందాలతో, ఉచిత కరెంటుతో, మాడు వాయగొట్టే అరుపులు, కేకలతో, అలరారే మండపాలలో, అరచేతిలో దొంగలు ఎత్తుకు పోకుండా దారాలతో కట్టేయబడిన లడ్డూ మోస్తూ నిలబడి ఉండే వినాయకుడి వాహనం ఎలుక. ఈ తొమ్మిది రోజులూ అది ఒక సెలబ్రిటీ. దాని జోలికి నువ్వూ, నేనే కాదు గండుపిల్లి కూడా మ్యావ్ అంటూ వెళ్లడానికి వీల్లేని సమయం ఇది అని డాంకీ అంటుంటే అరుగు ఎక్కాడు అబ్బాయి.
ఏమిటి డాంకీ నీ నోట సెలబ్రిటీ అనే మాట వినపడిరది అన్నాడు అబ్బాయి. అన్ని వేళలా రాజకీయ నాయకులు, కొన్ని వేళల క్రీడాకారులు, సినీతారలు సెలబ్రిటీలయినట్టు ఈ తొమ్మిది రోజులూ ఉండ్రాళ్లూ, కుడుములూ భోంచేసే అయ్యవారితోపాటు ఎలక కూడా సెలబ్రిటీనే కదా మరి అంది డాంకీ. ఒక్కోసారి బాస్ కంటే సెకరెటరీకే వెయిట్ ఎక్కువ, సూట్‌కేసులూ, బ్రీఫ్ కేసులూ మొయ్యాలి కదా అయినా ఇంత ఎలకకి ఎంత హోదానో, మమ్మల్ని అడిగే వారేరీ అంది డాగీ. అలాగనకు జంతు ప్రేమికుల పుణ్యమా అని మీ జాతి వారికి షెల్టర్లూ, మధ్యాహ్న భోజన ‘కేఫెటేరియా’ లూ ఓపెన్ చేస్తార్ట అన్నాడు అబ్బాయి. అవునవును నువ్వు కుక్కవీ, నేను గాడిదనూ అయినందుకే బాధపడతాం కానీ, ఈ మనుషులకి, మనుషులకే కాదు దేవుళ్లకీ జంతువులంటే ఎంత ప్రేమో! దున్నపోతునీ ఎద్దునీ, కాకినీ, గబ్బిలాన్నీ కూడా తమ వాహనాలుగా వాడుతున్నారు దేవుళ్లు. ఇక ఆవుల్నీ, పాముల్నే కాదు కుక్కుటేశ్వరుడని కోడినీ, కాల భైరవుడని కుక్కనీ పూజిస్తున్నారు మనుషులు అంది డాంకీ.
అచ్చయిన కాగితాలు బాగానే నమిలావు డాంకీ. అయితే మనుషులు పదవుల్నీ, డబ్బునీ, జంతువుల్నీ ప్రేమిస్తారేమో కాని సాటి మనుషుల్ని మాత్రం ప్రేమించరు. పులిని పులీ. సింహాన్ని సింహం ఏనుగుని ఏనుగూ చంపకపోవచ్చు కాని, మనిషి మాత్రం సాటి మనిషిని, తన స్వార్థం కోసం నిర్దాక్షిణ్యంగా, క్రూరంగా చంపగలడు అన్నాడు అబ్బాయి.
మనుషుల ఆకలి తీర్చలేని ప్రభుత్వాలు మా ఆకలి తీర్చగలవా, ఊరికే నాలుగు రోజులు హడావిడి అంతే అంది డాగీ. మనిషి తన కోసం తాను బతుకుతాడు తప్ప పైకి ప్రదర్శించేదంతా మోసమూ, దగానే అని తెలీనీడు. అయినా మనిషి మారలేదు, ఆతని కాంక్ష తీరలేదు అన్నాడో కవి అంది డాంకీ.


