Friday, March 6, 2026
Homeసంపాదకీయంమమత తానే వాదించడంవెనక దాగిన ఆవేదన

మమత తానే వాదించడంవెనక దాగిన ఆవేదన

- Advertisement -

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సాహసానికి ప్రతీక. ఈ సాహసంలో నాటకీయత ఉండొచ్చు. కానీ బుధవారం మమతా బెనర్జీ సుప్రీంకోర్టులో సాక్షాత్తు ప్రధాన న్యాయమూర్తి ఎదుట ప్రత్యేక, సునిశిత ఓటర్ల జాబితా (సర్) పై తానే స్వయంగా వాదనలు వినిపించారు. ఇలా తన కేసును తానే వాదించుకున్న ముఖ్యమంత్రి ఇప్పటివరకు మమత ఒక్కరే కావొచ్చు. ఓటర్ల జాబితాలో కొత్తవారిని చేర్చడానికి కాకుండా జాబితాలో ఉన్న వారి పేర్లను తొలగించడానికి ఎన్నికల కమిషన్ “ఎస్.ఐ.ఆర్.”ను వినియోగించుకుంటోందని ఆమె ఆవేదనతో విన్నవించారు.ఈ దుస్థితి నుంచి దేశాన్ని కాపాడాలని ఆమె ప్రధాన న్యాయమూర్తికి విన్నవించారు. ఆమె నివేదన కేవలం బెంగాల్ తరఫుననే కాదు. దేశవాసులందరి తరఫున ఆమె ఈ మాట చెప్పారు. ఎన్నికల కమిషన్ దుర్వర్తన వల్ల అంతా సర్వనాశనం అయిపోతోందని ఆమె తెలియజేశారు. ఎక్కడా న్యాయం జరగడం లేదని, న్యాయం తలుపు వెనక నిలబడి దీనంగా రోదిస్తోందని ఆమె నిండు న్యాయ స్థానంలో అన్నారు. ఎన్నికల కమిషన్ ఇప్పుడు వాట్సాప్ కమిషన్‌గా దిగజారిపోయిందని ఆమె ఆక్రోశం వ్యక్తం చేశారు. బెంగాల్ శాసనసభకు త్వరలో ఎన్నికలు జరగాల్సి ఉంది. అక్కడ ఇప్పుడు “ఎస్.ఐ.ఆర్.” కొనసాగుతోంది. బిహార్ ఎన్నికల సమయంలోనూ ఎన్నికల కమిషన్ దుష్టపాత్ర దేశమంతటినీ కుదిపేసింది. తాను తన పార్టీ కోసం పోరాడడం లేదని మమత చెప్పారు. ఎస్.ఐ.ఆర్. మీద జరుగుతున్న విచారణలో తన వాదన వినిపించడానికి అవకాశం ఇవ్వాలని మమత కోరితే ప్రధాన న్యాయమూర్తి స్వయంగా వాదించడానికి మమతకు అవకాశం ఇచ్చారు. మమత ఆఖరి ప్రయత్నంగా ఎస్.ఐ.ఆర్. రూపంలో జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా తానే వాదించాలనుకున్నారు. మమతా బెనర్జీ హఠాత్తుగా సుప్రీంకోర్టులో వాదించలేదు. సోమవారం ఎన్నికల కమిషన్ ఎదుట తన గోడు వినిపించారు. మంగళవారం మీడియా ముందు ఇదే వాదన చేశారు. బుధవారం సుప్రీంకోర్టులో తానే వాదించి చరిత్ర సృష్టించారు. ఎన్నికలకు ముందు బెంగాల్ మీద ప్రత్యేకంగా గురిపెట్టి అక్రమంగా ఓటర్ల జాబితాలోంచి పేర్లు తొలగిస్తున్నారని ఆమె చెప్పారు. 24 ఏళ్ల తరవాత ఎస్.ఐ.ఆర్. ప్రక్రియను హడావుడిగా మూడు నెలల్లో పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్ మొండిగా ప్రవర్తిస్తోంది. నిజానికి ఇలాంటి సవరణ సుదీర్ఘ ప్రక్రియ. కానీ ఎన్నికలు జరగాల్సి ఉన్న రాష్ట్రాలలో హడావుడిగా ఎన్నికల కమిషన్ ఎస్.ఐ.ఆర్. నిర్వహిస్తోంది. నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించడం, అవసరమైనప్పుడు ఓటర్ల జాబితా సవరించడం ఎన్నికల కమిషన్ రాజ్యాంగ విధి. కానీ ఎన్నికల కమిషన్, ముఖ్యంగా ఈ కమిషన్ ప్రధానాధికారి జ్ఞానేశ్‌కుమార్ తీరు చూస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని గెలిపించడానికి నానా తంటాలు పడ్తున్నట్టు కనిపిస్తోంది. తమ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ బెంగాల్ ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌కు ఆరు లేఖలు రాశారు. కమిషన్ ఒక్క దానికైనా జవాబివ్వలేదు. అంటే ఎన్నికల కమిషన్ నిరంకుశత్వంలో మోదీ సర్కారుతో పోటీ పడాలనుకుంటున్నట్టుంది. కృత్రిమ మేధ (ఎ.ఐ.) ఆధారంగా ఎన్నికల కమిషన్ కొందరి పేర్లు పనిగట్టుకుని తొలగిస్తోంది. ఉచ్చారణ, మాండలికం ఆధారంగా ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారని అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తెచ్చినందుకు ప్రధాన న్యాయమూర్తి మమతకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలా జరుగుతూ ఉంటే కనక దీన్ని నివారించాల్సిందే అని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల కమిషన్ ఈ బాధ్యత నుంచి తప్పించుకోలేదని కూడా ఆయన గట్టిగానే చెప్పారు. మమత చెప్తున్న అంశాలు తమకు తెలియదని, ఈ విషయాల గురించి వారం రోజుల్లో వివరణ ఇస్తామని ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది డి.ఎస్.నాయుడు అన్నారు. వారం రోజుల గడువు ఇవ్వడం కుదరదని సూర్యకాంత్ తేల్చి చెప్పారు. నాయుడు ఈ మాటలు చెప్పడంలో నిజాన్ని దాచేస్తున్నారని చెప్పక్కర్లేదు.
ఎందుకంటే సుప్రీంకోర్టులో వాదించే న్యాయమూర్తి మీడియాలో వచ్చే సమాచారం చూడలేదని ఎలా అనుకోగలం? బతికి ఉన్న వారిని మృతుల కింద చూపించి వారి పేర్లు ఎన్నికల కమిషన్ బిహార్‌లో తొలగించినట్టే బెంగాల్‌లోనూ అదే ఆట మొదలుపెట్టింది. బెంగాల్‌లో మొత్తం 58లక్షల మంది పేర్లు తొలగించారు. తార్కికమైన వ్యత్యాసాలున్నాయని మరో కోటి మందికి పైగా ఓటర్లకు నోటీసులు జారీ చేశారు. ఇలాంటి వ్యవహారాలను పరిశీలించాలని సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. రెండో తేదీన మమతా బెనర్జీ తన మద్దతుదార్లతో కలిసి ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వెళ్లారు. జ్ఞానేశ్‌కుమార్ మధ్యలోనే నిష్క్రమించి మమతను అవమానించారు. బిహార్ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నాయకులు ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వెళ్లినప్పుడు కూడా జ్ఞానేశ్‌కుమార్ ఇలాగే నిరంకుశంగా ప్రవర్తించారు. తనది రాజ్యాంగ హోదా కనక తనను ఎవరూ ఏమీ చేయలేరన్న అహంకారం ఆయనలో కనిపిస్తోంది. ఆయనకు దక్కిన రాజ్యాంగబద్ధ అధికారం నిష్పాక్షికంగా పని చేయడానికే తప్ప తానే ప్రభువునైనట్టు ప్రవర్తించడానికి కాదని ఆయనకు ఎప్పుడు తలకెక్కాలి. సకల ప్రయత్నాలు చేసిన తరవాతే ఆఖరి ప్రయత్నంగా అత్యున్నత న్యాయస్థానం మీద విశ్వాసంతో మమత కోర్టులో తానే వాదించారు. బిహార్‌లో ఎస్.ఐ.ఆర్. సందర్భంగా దాఖలైన కేసులో తీర్పు ఇప్పటిదాకా రాలేదు. మమతా బెనర్జీ విధిలేని పరిస్థితిలోనే సుప్రీంకోర్టులో తానే వాదించవలసిన పరిస్థితి రావడం అనూహ్యం. కానీ ఆమె ప్రజల తరఫున చేసిన వాదనలో పటుత్వం ఉంది. ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి జ్ఞానేశ్‌కుమార్ అహంకారం ఎంతటిదంటే ఆయన ఏ ప్రశ్నకు సమాధానం ఇవ్వరు.
వెలికి వచ్చే సమాచారం అంతా “విశ్వసనీయ వర్గాల” ద్వారానే. ఈ నడవడిక పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని పాతర వేయడానికే తోడ్పడుతుంది. ఈ పని చేయడానికి జ్ఞానేశ్‌కుమార్ కంకణం కట్టుకున్నట్టున్నారు. జ్ఞానేశ్ కుమార్ తాము వెళ్లినప్పుడు చాలా దురుసుగా ప్రవర్తించారు, బల్ల మీద చరవడం మొదలెట్టారు అని మమత తెలియజేశారు. ఈ వ్యవహారమంతటినీ మమతా బెనర్జీ బుధవారం ప్రధాన న్యాయమూర్తికి తన వాదనలో భాగంగా విడమర్చారు. సజీవంగా ఉన్న వారి పేర్లను తొలగించారని నిరూపించడానికి మమతాబెనర్జీ నిన్న కొందరిని మీడియా సమావేశానికి తీసుకొచ్చారు. ఇంతకు ముందు ఇదే పని సుప్రీంకోర్టులో జరిగింది. ఇదే ఎస్.ఐ.ఆర్. విషయంలో ఇటీవలే సామాజిక కార్యకర్త యోగేంద్రయాదవ్ సైతం తన వాదన తానే వినిపించారు. ఈ రెండు ఉదంతాలను చూసిన తరవాత సుప్రీంకోర్టు ఇచ్చేతీర్పు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఉపయుక్తంగా ఉంటుందనుకోవడం అత్యాశ కాదు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు