Sunday, January 18, 2026
Homeసంపాదకీయంమాయమైన చొరబాటుదార్లు

మాయమైన చొరబాటుదార్లు

- Advertisement -

బీహార్‌లో ఓటు వేయడానికి అధికారం లేని వారిని ఓటర్ల జాబితాలోంచి తొలగించడానికే ప్రత్యేక నిశిత ఓటర్ల జాబితా సవరణ చేస్తున్నామని ఎన్నికల కమిషన్‌ గత మూడు నెలలుగా ఊదరగొట్టింది. బీహార్‌లో చొరబాటుదార్లు ఉన్నారని వారి పేర్లను జాబితాలోంచి తొలగించి పరిశుద్ధమైన జాబితా విడుదల చేస్తామని ఎన్నికల కమిషన్‌ నమ్మిస్తూ వచ్చింది. మంగళవారం బీహార్‌ ఓటర్ల తుది జాబితా వెలువడిరది. ఇందులో చొరబాటు దార్లను తొలగించడానికి సంబంధించిన ఊసే లేదు. సరిహద్దు రాష్ట్రాలలో చొరబాటుదార్ల బెడద ఉందని సాక్షాత్తు ప్రధాన మంత్రి మోదీ అనేక సార్లు చెప్పారు. కాంగ్రెస్‌, రాష్ట్రీయ జనతా దళ్‌ (ఆర్‌జేడీ) ముస్లింలను సంతృప్తిపరచడానికి ఏమైనా చేస్తాయని మోదీ, అమిత్‌ షా నిరంతరం వాదిస్తూ ఉంటారు. ఈ చొరబాటుదార్ల వల్ల మహిళలకు ప్రమాదం పొంచి ఉందని అంటూ ఉంటారు. చొరబాటుదార్లను తొలగించాల్సిన అవసరం ఉందని, ఆ పని చేస్తామని ఇది మోదీ గ్యారంటీ అని చెప్తూ వచ్చారు. రాహుల్‌, లాలూ చొరబాటుదార్లకు ఓటు హక్కు ఇవ్వాలనుకుంటారని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కొద్ది రోజుల కింద కూడా ఆరోపించారు. కానీ ఓటర్ల తుది జాబితా విడుదల చేసినప్పుడు చొరబాటుదార్ల ప్రస్తావనే లేదు. దీన్ని బట్టి చొరబాటుదార్లు ఉన్నారని యాగీ చేయడం మోదీ ఎన్నికలలో విజయం సాధించడానికి వేసిన ఎత్తుగడ అనుకోవలసి వస్తుంది. బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణ వివాదం సుప్రీంకోర్టుకు కూడా ఎక్కింది. అక్కడా ఎన్నికల సంఘం వితండవాదమే చేసింది. ఓటర్ల జాబితా సవరణను పౌరసత్వం నిర్ధారించడానికి ఉపయోగించుకుంది. నిజానికి పౌరులు ఎవరో కారో నిర్ణయించే అధికారం ఎన్నికల కమిషన్‌కు లేదు. ఆ కమిషన్‌కు ఉన్న అధికారమల్లా ఓటర్ల జాబితా నుంచి అనర్హులను తొలగించడం, అర్హులందరినీ ఓట్ల జాబితాలో చేర్చడం మాత్రమే. ప్రభుత్వమే జారీ చేసిన ఆధార్‌ కార్డును గుర్తింపు కోసం ప్రామాణికంగా స్వీకరించడానికి నిరాకరిస్తూ ఎన్నికల సంఘం మొండికేసింది. వీటిని ప్రామాణికంగా స్వీకరించాలని సుప్రీంకోర్టు సూచించినా ఎన్నికల కమిషన్‌ ఆ పని చేయలేదు. చివరకు సుప్రీంకోర్టు ఆదేశిస్తే తప్ప ఆధార్‌ కార్డు చెల్లుబాటు కాలేదు. ఈ కార్డులు నకిలీవి అని ఎన్నికల కమిషన్‌ వితండవాదానికి దిగింది. ఆ లెక్కన దేన్నైనా నకిలీగా మార్చొచ్చు. అలా మార్చడానికి ఎవరైనా ప్రయత్నం చేయొచ్చు. ఆ ప్రమాదం లేకుండా చూడడం కూడా ప్రభుత్వ బాధ్యతే. మరీ చెప్పాలంటే చొరబాటుదార్లను నిరోధించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే తప్ప రాష్ట్రాలకు ఆ అవకాశమే లేదు. సరిహద్దు భద్రతా దళం లాంటివి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధీనంలోనే పని చేస్తాయి. విదేశీయులకు ఓటు హక్కు కల్పించడం అత్యంత ప్రమాదకరం అని మోదీ సర్కారు వాదించింది. బీహార్‌లో ప్రత్యేక, సునిశిత ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు చొరబాటుదార్ల గురించి ఎన్నికల సంఘం కూడా నానా యాగీ చేసింది. అలాంటి వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తామని బీరాలు పలికింది. అయితే ఈ మాట ఎన్నికల కమిషన్‌ అధికారికంగా ఎన్నడూ చెప్పలేదు. ఎన్నికల కమిషన్‌ ప్రధానాధికారి జ్ఞానేశ్‌ కుమార్‌ కూడా ఈ విషయం స్వయంగా ఎప్పుడూ ప్రకటించలేదు. ఈ సమాచారం అంతా ‘‘విశ్వసనీయ వర్గాల’’ ద్వారానే బయటకు వస్తూ ఉండేది. మరణించిన వారి, ఉన్న చోట నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి పేర్లను తుది ఓటర్ల జాబితాలోంచి తొలగించిన సమాచారం మాత్రం ఓటర్ల జాబితాలో ఉంది. ఓటర్ల జాబితా ముసాయిదా వెలువరించినప్పుడు 65 లక్షల మంది పేర్లను తొలగించామని చెప్పారు. తుది జాబితాలో మరో మూడు లక్షల మంది పేర్లు తొలగించినట్టు కనిపిస్తోంది. అంటే తొలగించిన ఓటర్ల సంఖ్య 69 నుంచి 70 లక్షల దాకా ఉండొచ్చు. ముసాయిదా జాబితా తరవాత తొలగించిన ఓటర్ల సంఖ్య 3.66 లక్షలు ఉంది. అంటే ఇది ముందు చెప్పిన 65 లక్షలకు అదనం.
ఓటర్ల జాబితాలో కొత్తగా చేర్చిన వారి సంఖ్య కేవలం 21.53 లక్షలే. 2025 జూన్‌ 24 నాటికి బీహార్‌ ఓటర్ల జాబితాలో 7.89 కోట్ల మంది ఓటర్లు ఉండే వారు. తుది జాబితాలో వీరి సంఖ్య 7.42 కోట్లకు తగ్గింది. పౌరులు కాని వారి పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తామని ఎన్నికల కమిషన్‌ పదే పదే వాదించింది. పౌరసత్వాన్ని నిర్ధారించే అధికారం ఎన్నికల కమిషన్‌కు లేదని, ఆ అధికారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు మాత్రమే ఉందని సుప్రీంకోర్టు గుర్తు చేయాల్సి వచ్చింది. విదేశీయులకు ఓటు హక్కు ఉండకూడదన్న ప్రభుత్వ వాదనతో ఎవరూ విభేదించరు. విదేశీయులను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలన్న పరమ లక్ష్యంతోనే ప్రత్యేక, సునిశిత ఓటర్ల జాబితా ప్రక్రియ చేపట్టారు. కానీ తుది జాబితాలో ఆ ప్రస్తావనే లేదు. భారీ సంఖ్యలో విదేశీయుల పేర్లు ఓటర్ల జాబితాలో ఉన్నాయని, అందుకే ఆ జాబితాను ప్రక్షాళన చేస్తామని ఎన్నికల కమిషన్‌ చెప్తూ వచ్చింది. చొరబాటుదార్లు అని బీజేపీ చేసిన ప్రచారం ఏ వర్గాన్ని ఉద్దేశించి చేస్తోందో అందరికీ తెలుసు. కానీ ఆ ప్రస్తావన తుది జాబితాలో ఎక్కడా లేదు. విదేశీయుల చొరబాటు గురించి మోదీ సర్కారు నిరంతరం ఆక్షేపిస్తూనే ఉంది. కానీ మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉన్నప్పుడే విదేశీయులను ఎక్కువ సంఖ్యలో గుర్తించడమే కాక వారిని తిప్పి పంపారు కూడా. ఉదాహరణకు 2009 లో 10,602 మందిని, 2010లో 6,290 మందిని, 2011లో 6,761 మందిని, 2012లో 6,537 మందిని, 2013లో 5,234 మందిని విదేశీయులుగా గుర్తించడమే కాక వారిని వెనక్కు పంపించారు కూడా. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో మోదీ చొరబాటుదార్ల అంశాన్ని భీకరంగా ప్రస్తావించారు. ఆయన దృష్టిలో చొరబాటుదార్లంటే ముస్లింలే. వారు మన గేదెలను తోలుకెళ్తారని, మంగళ సూత్రాలు లాక్కెళ్తారని మోదీ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ మోదీ హయాంలో 2014లో 990 మందిని, 2015 లో 474 మందిని, 2016లో 308 మందిని, 2017లో కేవలం 51 మందిని, 2018లో 445 మందిని, 2019లో 299 మందిని మాత్రమే విదేశీయులుగా గుర్తించారు. అలాంటప్పుడు బీహార్‌ ఓటర్ల జాబితా సవరణ సందర్భంగానే చొరబాటుదార్ల అంశాన్నే ప్రధానాంశం ఎందుకు చేసినట్టో! మోదీ పదేళ్ల పాలనలో గుర్తించిన విదేశీయుల సంఖ్య పది వేలకన్నా తక్కువే. మన్మోహన్‌సింగ్‌ హయాంలో దాదాపు 90 వేల మంది విదేశీయులను గుర్తించారని మోదీ చేసిన ప్రచారం అంతా డొల్ల అని గణాంకాలే రుజువు చేస్తున్నాయి. ముస్లింలను బూచిగా చూపి హిందువుల ఓట్లను పోగు చేసి ఎన్నికలలో విజయం సాధించడమే మోదీ ప్రధాన లక్ష్యం అని స్పష్టం అవుతూనే ఉంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు