ట్రంప్ వ్యాఖ్యలు సరికాదన్న స్టార్మర్
వాషింగ్టన్: కేవలం ముస్లిం ఓట్ల కోసమే ఇరాన్‌పై జరుపుతున్న దాడుల్లో బ్రిటన్ భాగస్వామి కాలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తమ దేశంలోని ముస్లిం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. బ్రిటన్‌కు ఓ ప్రముఖ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. “బ్రిటన్ ఇకపై గుర్తించదగిన దేశం కాదు. ప్రధాని స్టార్మర్ ముస్లిం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పాకులాడుతున్నారు. ఆయన మాకు ఏ మాత్రం సహకరించలేదు. బ్రిటన్ నుంచి మాకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. మేము బ్రిటన్‌ను చాలా ప్రేమిస్తాం. కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు” అని ట్రంప్ పేర్కొన్నారు.
బ్రిటన్ ప్రధాని రాజకీయ కారణాలతో ముస్లిం ఓటర్ల కోసం పాకులాడుతున్నట్లు మీరు భావిస్తున్నారా అని సదరు పాత్రికేయుడు ట్రంప్‌ను ప్రశ్నించగా… “అది నిజం కావచ్చు” అని సమాధానం ఇచ్చారు. “లండన్ ఇప్పుడు చాలా మారిపోయింది. అక్కడ ఒక భయంకరమైన మేయర్? (సాదిఖ్ ఖాన్) ఉన్నాడు. అక్కడ ఇంకొంత మంది వ్యక్తులు ఉన్నారు. లండన్ ఇప్పుడు పూర్తిగా భిన్నమైన ప్రదేశం” అని ట్రంప్ విమర్శలు గుప్పించారు. ఇంతకు ముందు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధవాతావరణంపై మాట్లాడుతూ… “ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో బ్రిటన్ పాల్గొనలేదు. ఇది కావాలని తీసుకున్న నిర్ణయం. పశ్చిమాసియాలో శాంతి నెలకొనాలంటే, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడం ఒక్కటే మార్గమని నేను భావిస్తున్నాను. అలాగే ఇరాన్ తన అణ్వస్త్ర ఆకాంక్షలను విరమించుకోవాలి. అలాగే పశ్చిమాసియాలో అస్థిరతకు కారణమయ్యే కార్యకలాపాలన్నింటినీ ఇరాన్ ఆపేయాలని మేము కోరుకుంటున్నాం. ఇది బ్రిటన్ ప్రభుత్వ దీర్ఘకాలిక విధానం” అని అన్నారు. తమ నిర్ణయం పట్ల ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు కానీ బ్రిటన్ జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఏది సరైనదో, దాన్నే నిర్ణయించడం తన బాధ్యత అని తెలిపారు మరోవైపు గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడి చేయడాన్ని స్టార్మర్ తప్పుపట్టారు. అది బ్రిటన్ మిత్రదేశాలకు, వాటి ప్రయోజనాలకు ముప్పు కలిగిస్తుందని పేర్కొన్నారు.


