Friday, March 6, 2026
Homeఅంతర్జాతీయంసూసైడ్ డ్రోన్లతో ఇరాన్ దాడులు

సూసైడ్ డ్రోన్లతో ఇరాన్ దాడులు

- Advertisement -

గల్ఫ్ దేశాలకు వణుకు
తెహ్రాన్: అమెరికా- ఇజ్రాయెల్ వైమానిక దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ప్రయోగిస్తున్న డ్రోన్లు… అమెరికాకు తొత్తులుగా మారిన కొన్ని గల్ఫ్ దేశాలకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. తక్కువ ఖర్చుతో తయారయ్యే షాహెద్ సూసైడ్ డ్రోన్లు ఆయా దేశాలకు తీవ్ర ఆర్థిక నష్టాన్ని కలిగిస్తున్నాయి. చాలా చౌకైన ఆ డ్రోన్లను మిత్రదేశమైన రష్యాకు కూడా ఇరాన్ అందించగా… ఉక్రెయిన్ యుద్ధంలో ఆ డ్రోన్లతో రష్యా విధ్వంసం సృష్టించింది. ఇప్పుడు అదే డ్రోన్లను గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలు, దాని మిత్రదేశాల బేస్‌లపై ఇరాన్ ప్రయోగిస్తోంది. ఇరాన్ తయారు చేస్తున్న షాహెద్-136 వన్‌వే అటాక్ డ్రోన్లు చిన్న క్రూయిజ్ మిస్సైళ్లలా పనిచేస్తాయి. ఇవి లక్ష్యాన్ని చేరుకున్న వెంటనే పేలిపోతాయి. కాబట్టి వీటిని సూసైడ్ డ్రోన్లుగా పిలుస్తారు. అమెరికా సైనిక స్థావరాలు, చమురు నిల్వలు, మౌలిక వసతులు, పౌర భవనాలపై దాడులు చేస్తున్నాయి. గల్ఫ్ దేశాలు అప్రమత్తమవుతున్నప్పటికీ, నిరంతర దాడులు వాటి రక్షణ వ్యవస్థలపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. అయితే యుద్ధంలో ప్రధానంగా చర్చనీయాంశమవుతున్నది షాహెద్ డ్రోన్ల ఖర్చు… ఒక్కొక్క డ్రోన్ తయారీకి సుమారు 20 వేల డాలర్లు, అంటే సుమారు 16 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది. కానీ దానిని అడ్డుకునేందుకు గల్ఫ్ దేశాలు, అమెరికా వినియోగిస్తున్న రక్షణ క్షిపణుల ఖర్చు కోట్లు దాటుతోంది. ఉదాహరణకు ఇజ్రాయిల్ ఉపయోగిస్తున్న ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ నిర్వహించే ఐరన్ డోమ్ వ్యవస్థలో ఒక్క క్షిపణి ధర. 35- 45 లక్షల రూపాయల వరకు ఉంటుంది. విమానాల నుంచి ప్రయోగించే సైడ్‌వైండర్ క్షిపణుల ధర మరింత ఎక్కువ. ఇక అమెరికా ఉపయోగిస్తున్న యునైటెడ్ స్టేట్స్ ఆర్మీకి చెందిన పాట్రియాట్ మిస్సైల్ సిస్టమ్లో ఒక్క ఇంటర్‌సెప్టర్ క్షిపణి ధర 30 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుంది. అంటే 16 లక్షల డ్రోన్‌ను కూల్చేందుకు 30 కోట్ల క్షిపణి వినియోగించాల్సిన పరిస్థితి. ఈ వ్యత్యాసమే ఇప్పుడు పాశ్చాత్య దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. యుద్ధం దీర్ఘకాలం సాగితే ఖరీదైన మిస్సైళ్ల నిల్వలు త్వరగా ఖాళీ కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికే గల్ఫ్‌లోని కొన్ని దేశాల్లో నిల్వలు తగ్గుతున్నాయని అంతర్గత అంచనాలు చెబుతున్నాయి. ఒకవైపు డ్రోన్లు భారీ సంఖ్యలో వస్తుండగా, మరోవైపు వాటిని అడ్డుకునే ఆయుధాలు తగ్గిపోతే పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉంది. సైనిక విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఇది అట్రిషన్ వార్ వ్యూహం. అంటే శత్రువును ఖర్చులతో అలిసిపోయేలా చేయడం. ఇరాన్ తక్కువ ఖర్చుతో వేలాది డ్రోన్లు తయారు చేసి ప్రయోగిస్తే, అమెరికా–ఇజ్రాయిల్‌లకు వాటిని అడ్డుకోవడం ఆర్థికంగా భారమవుతుంది. చివరకు ఆయుధాల కొరత, రాజకీయ ఒత్తిడి కారణంగా యుద్ధాన్ని నిలిపివేయాల్సిన పరిస్థితి రావచ్చని వారు భావిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు