ట్రాఫిక్ కెమెరాలు హ్యాక్…కొన్నేళ్లుగా గూఢచర్యం
పక్కా ప్రణాళికతోనే సుప్రీం లీడర్ కార్యాలయంపై భీకర వైమానికదాడి
లండన్: ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కదలికలను ట్రాక్ చేసేందుకు రాజధాని నగరం తెహ్రాన్‌లోని ట్రాఫిక్ కెమెరాలను ఇజ్రాయిల్ అధునాతన టెక్నాలజీని వినియోగించి తస్కరించిందని బ్రిటన్‌కు చెందిన ఫైనాన్షియల్ టైమ్స్ సంచలన కథనం ప్రచురించింది. ఇందుకోసం గత కొన్నేళ్లుగా ఇరాన్ రాజధాని తెహ్రాన్‌లోని అన్ని ట్రాఫిక్ కెమెరాలు, మొబైల్ ఫోన్ నెట్‌వర్క్‌లను ఇజ్రాయిల్ హ్యాక్ చేసిందని పేర్కొంది. తెహ్రాన్ నగర ట్రాఫిక్ ఫుటేజీ ఎప్పటికప్పుడు ఇజ్రాయిల్‌లోని సర్వర్లకు బదిలీ అయ్యేదని… చాలా ఏళ్లుగా దీని ద్వారా ఖామేనీ కదలికలను ఇజ్రాయిల్ పసిగట్టినట్లు వెల్లడించింది. ఆ కెమెరాల ద్వారా ప్రభుత్వ కార్యాలయాలు, భద్రతా సిబ్బంది కదలికలు, వాహనాల రాకపోకలను నిరంతరం గమనించేవారని తెలిపింది. ప్రత్యేకంగా పాస్తూర్ స్ట్రీట్ సమీపంలోని కెమెరా అత్యంత కీలకంగా మారిందని తెలుస్తోంది. ఈ ప్రాంతంలో ఉన్న అధికారిక భవనాలు, భద్రతా బృందాల డ్యూటీలు, వాహనాల పార్కింగ్ పద్ధతులు వంటి వివరాలను ఆ కెమెరా ద్వారా ఖచ్చితంగా తెలుసుకున్నట్లు నివేదిక స్పష్టం చేసింది. కేవలం ట్రాఫిక్ కెమెరాలకే పరిమితం కాకుండా మొబైల్ ఫోన్ నెట్‌వర్క్‌ల్లోనూ ఇజ్రాయిల్ గూఢచారులు చొరబడ్డారని తెలిసింది. ఖామేనీ ఉన్న భవనంపై దాడికి ముందు కొన్ని సెల్ టవర్లను ఉద్దేశపూర్వకంగా నిలిపివేసి భద్రతా సిబ్బంది మధ్య కమ్యూనికేషన్‌ను అడ్డుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అంతర్గత సమన్వయం దెబ్బతింది. ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ అధికారులు సేకరించిన భారీ డేటాను అధునాతన అనలిటిక్స్ ద్వారా విశ్లేషించారు. సోషియల్ నెట్‌వర్క్ అనాలిసిస్ సాయంతో ఇరాన్ నాయకత్వంలోని సంబంధాలు, నిర్ణయ కేంద్రాలు, కీలక వ్యక్తులను గుర్తించారు. బిలియన్ల డేటా పాయింట్లను పరిశీలించి, ఎవరిని పర్యవేక్షించాలి, ఎవరిపై దాడి చేయాలి అనే లక్ష్య జాబితా రూపొందించినట్లు తెలిసింది. ఇందులో యూనిట్ 8200 సిగ్నల్ ఇంటెలిజెన్స్, మోస్సాద్ మానవ వనరుల సేకరణ కీలక పాత్ర పోషించాయి. ఈ రెండు సంస్థలు కలిసి సంవత్సరాలుగా సమాచారాన్ని సేకరించి రోజువారీ నివేదికలు తయారు చేశాయని కథనం తెలిపింది. ఇలాంటి లక్ష్యాధారిత గూఢచర్యం ఇజ్రాయిల్ వ్యూహంలో ముఖ్య భాగమని మాజీ అధికారులు పేర్కొన్నారు.
“ఒకరిని టార్గెట్ చేయాలనే నిర్ణయం తీసుకుంటే, అవసరమైన కచ్చితమైన సమాచారం అందించడం మా సంస్కృతి” అని రిజర్వ్ బ్రిగేడియర్ జనరల్ ఇటాయ్ షపీరా వ్యాఖ్యానించినట్లు వెల్లడించారు. ఫిబ్రవరి 28న ఉదయం ఖామేనీ తన అధికారిక నివాసంలో ఉన్నారనే నిర్ధారణ ఇంటెలిజెన్స్‌కు లభించిన తర్వాతనే వెంటనే సంయుక్త చర్యకు రంగం సిద్ధమైంది. ఈ ఆపరేషన్‌లో అమెరికా కూడా భాగస్వామ్యమైందని నివేదికలు చెబుతున్నాయి. అమెరికా- ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ సంస్థలు ఖామేనీ షెడ్యూల్, సమావేశాలు, నివాస మార్పులను సమగ్రంగా ట్రాక్ చేశాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తుదినిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో దాడికి ఆదేశాలు జారీ చేసిన వెంటనే ముందుగా సైబర్ దాడులు చేసి ఇరాన్ కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థలను అస్తవ్యస్తం చేశారు. అనంతరం సుమారు 200 ఇజ్రాయిల్ యుద్ధ విమానాలు తెహ్రాన్ గగనతలంలోకి ప్రవేశించి… 30 బంకర్ బస్టర్ బాంబులను లక్ష్యంపై వదిలినట్లు కథనం వివరించింది. మొత్తంగా చూస్తే, ఈ దాడి ఒక్కరోజులో జరిగిన చర్య కాదని, సంవత్సరాలపాటు సేకరించిన గూఢచర్య సమాచారం, సాంకేతిక పర్యవేక్షణ, మానవ వనరుల సహకారం, సైబర్ వ్యూహాల సమ్మేళనమే ఈ ఆపరేషన్‌కు బలం చేకూర్చిందని అంతర్జాతీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


