కిందటి సార్వత్రిక ఎన్నికలలో మోదీ నాయకత్వంలో బీజేపీ 240 స్థానాల దగ్గరే ఆగిపోయి ఉండొచ్చు. మోదీ పోటీ చేసిన వారణాసిలోనూ మోదీ మెజారిటీ గణనీయంగా తగ్గి ఉండొచ్చు. కానీ ఆయనను ప్రధానిగా ఎన్నుకున్నది లోకసభ సభ్యులే. ఆయనా లోకసభ సభ్యులే. గురువారం మోదీ లోకసభకు రాకుండా తప్పించుకున్నారు. మాజీ సైన్యాధిపతి జనరల్ నర్వణే రాసిన “ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ” గ్రంథంలోని అంశాలను ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ సోమవారం చదివి వినిపించడానికి ప్రయత్నం చేసినప్పుడు ప్రభుత్వపక్ష తాబేదారుగా మారిన లోకసభ స్పీకర్ అనుమతించలేదు. దీనిమీద విపరీతమైన రగడ జరిగింది. అధికార ప్రతిపక్ష సభ్యులు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. అయినా రాహుల్ 45నిముషాల సేపు అదే విషయంపై పట్టుబట్టారు. ఈ రగడ జరిగినప్పుడు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఉగ్రులై నిలబడ్డారు. మోదీ ప్రభుత్వాన్ని భయపెట్టిన మరో విషయం అమెరికాకు లొంగిపోయి కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం. బుధవారం రోజే బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సుప్రీంకోర్టులో స్వయంగా వాదించి చరిత్ర సృష్టించారు. ముప్పిరిగొన్న ఈ అంశాల కారణంగా మోదీ రాష్ట్రపతి ప్రసంగంపై జరిగిన చర్చకు లోకసభలో సమాధానం చెప్పడానికి విపరీతంగా జంకారు. అందుకే గురువారం రాజ్యసభలో సమాధానం చెప్పారు. విచిత్రం ఏమిటంటే ప్రధాని కనక గురువారం సమాధానం చెప్తే ఆయనకు ప్రమాదం జరిగే అవకాశం ఉండేదని స్పీకర్ అన్నారు. అందుకే ఆయనకు లోకసభకు రావొద్దని తానే సలహా ఇచ్చానని బిర్లా ఏ మాత్రం బిడియం లేకుండా చెప్తున్నారు. ఇది ఆయన అసమర్థతకు నిదర్శనం. అదీగాక నిరసన తెలియజేస్తున్న ప్రతిపక్షాన్ని బూతంగా చిత్రీకరించడం. ఇంతకన్నా ఘోరం ఏమీ ఉండదు. 2జిపై రగడ జరుగుతున్నప్పుడు అప్పటి ప్రతిపక్ష నాయకురాలు సుష్మ స్వరాజ్ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాకముందే సభ జరగనివ్వం అని హెచ్చరించిన వాస్తవం ఓంబిర్లాకు గుర్తుకు రాకపోవడం ఆశ్చర్యకరం. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు రాజ్యసభలో సమాధానం చెప్పి మోదీ దాన్ని ఒక తంతుగా మార్చేశారు. 2004 తరవాత ప్రధాని రాజ్యసభలో సమాధానం చెప్పి కథ ముగించడం ఇదే మొదటిసారి. ప్రధాని సమాధానం లేకుండానే లోకసభ ధన్యవాద తీర్మానాన్ని ఆమోదించేసింది. మాజీ సైన్యాధిపతి జనరల్ నర్వణే రాసిన గ్రంథంలోని విషయాలు బయటపడ్తే తమ ప్రభుత్వానికి ముప్పు తప్పదని మోదీ ప్రభుత్వం నిలువెల్లా వణికిపోయింది. ధన్యవాదాల తీర్మానాన్ని ఆమోదించినప్పుడు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కూడా సభలో లేకుండా తప్పించుకున్నారు. కళంకిత మంత్రులను మంత్రివర్గంలో చేర్చుకున్నారని ఇదివరకు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ గందరగోళం లేవదీసినప్పుడు 2004 జూన్ 10న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ సభలో లేకుండానే ధన్యవాదాల తీర్మానం ఆమోదించారు. జనరల్ నర్వణే గ్రంథంలో బయటపెట్టిన అంశాలపై సోమవారం నుంచి సభలో రగడ జరుగుతూనే ఉంది. ఈ పుస్తకం అసలు ప్రచురితమే కాలేదని రాజ్‌నాథ్‌సింగ్, అమిత్ షా వితండవాదానికి దిగారు. ఈ గ్రంథం ముద్రితం అయింది కానీ రక్షణ మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉందన్న సమాచారం వచ్చింది. ఈ పుస్తకం వెలికిరాని మాట నిజమే కావొచ్చు. వెలికి రాకుండా అడ్డుకున్నది రక్షణ మంత్రిత్వశాఖే. 2020 ఆగస్టులో చైనా సేనలు లద్దాఖ్ మీద దాడికి తరలివస్తుండగా ఏం చేయమంటారు అని నర్వణే ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కేంద్ర ప్రభుత్వం చలించనే లేదు. తరవాత మీకు సముచితమైనది చేయండి అని చెప్పి తప్పించుకుంది. ఈ వివరాలన్నీ నర్వణే గ్రంథంలో ఉన్నాయి. నర్వణే గ్రంథాన్ని కారవాన్ పత్రిక విపులంగా పరిచయం చేసింది. దీనిలోని అయిదు పంక్తులను చదివి వినిపిస్తానని రాహుల్‌గాంధీ అంటే స్పీకర్‌తో సహా రాజ్‌నాథ్, అమిత్‌షా గట్టిగా వ్యతిరేకించారు. అసలు నర్వణే గ్రంథం అచ్చే కాలేదని కేంద్ర ప్రభుత్వం గట్టిగా వాదించింది. కానీ రాహుల్‌గాంధీ బుధవారం ఈ పుస్తకం ప్రతిని తీసుకొచ్చి పార్లమెంటులో చూపించారు. అంతటితో ఆగకుండా మోదీ సభకు వస్తే ఆయనకూ ఒక ప్రతి ఇస్తానన్నారు. ఇదంతా గమనించి మోదీ గురువారం లోకసభకు రాకుండా రాజ్యసభలో ధన్యవాదాల తీర్మానానికి సమాధానం ఇచ్చి ఓ లాంఛనం పూర్తి చేశారు. మోదీ నిన్న సాయంత్రం అయిదు గంటలకు లోకసభలో ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సమాధానం ఇవ్వాల్సింది. అయితే కారణం ఏదీ చెప్పకుండానే స్పీకర్ సభ వాయిదా వేశారు. మోదీ సభకు రాలేదంటే ఎంత భయపడి పోయారో అర్థం అవుతోంది. తీరిగ్గా గురువారం రాజ్యసభలో మాత్రం సమాధానం చెప్పారు. మరీ విచిత్రం ఏమిటంటే అసందర్భంగా, అసభ్య పదజాలంతో మాట్లాడడానికి అలవాటుపడ్డ బీజేపీ సభ్యుడు నిశికాంత్ దుబే అనేక పుస్తకాలు తీసుకొచ్చి బుధవారం నోటికొచ్చినట్టు మాట్లాడారు. నెహ్రూ, ఇందిరాగాంధీ గురించి కల్పిత పురాణం విప్పారు.
దీనికి స్పీకర్ బిర్లా ఎలా అనుమతించారో మరి. ఈ పని చేయడం లోకసభ 349వ నిబంధనకు విరుద్ధమని మోదీ ప్రభుత్వాన్ని సమర్థిస్తున్న తెలుగుదేశం ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ ఎంత చెప్పినా బిర్లా వినిపించుకోనే లేదు. ప్రతిపక్షం మీద దుమ్మెత్తి పోసే వారిని ప్రోత్సహించడమే బిర్లా పనిగా పెట్టుకున్నారు. సభ జరగకుండా చేసే అధికారపక్ష సభ్యులు ఇష్టారీతిన మాట్లాడడానికి మాత్రం స్పీకర్ ఉత్సాహంగా అనుమతిస్తుంటారు. నిశికాంత్ దుబే అప్రస్తుత, అసభ్యకరమైన ప్రసంగంపై నిరసన వ్యక్తం చేయడానికి ప్రతిపక్ష సభ్యులు బుధవారం స్పీకర్ చేంబర్‌కు వెళ్లారు. తన చేంబర్లో ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తన చాలా బాధ కలిగించిందని, ఇలాంటి ఘటన ఇదివరకెన్నడూ జరగలేదని బిర్లా వాపోయారు. స్పీకర్ బాధ్యత ఏమిటో రాజ్యాంగంలో నిర్దిష్టంగా నిర్దేశించారని కూడా ఆయన అన్నారు. అలాంటి బాధ్యత నిర్వహించకుండా పాలక పక్షాన్ని కాపాడడంలో స్పీకర్ నిమగ్నమవుతున్నారు. ప్రతిపక్ష సభ్యులు పార్లమెంటుకు మచ్చ అని వాదిస్తున్న బిర్లాకు తన నడవడిక గురించి ఆత్మ పరిశీలన చేసుకునే శక్తి మాత్రం లేదు. 349వ నిబంధన ప్రకారం ఏదైనా గ్రంథంలోని లేదా పత్రికల్లోని భాగాలను సభలో ప్రస్తావించకూడదని సుద్దులు చెప్పిన స్పీకర్ నిశికాంత్ దుబే అదే పని చేయడానికి ఎలా అనుమతి ఇచ్చారో మాత్రం చెప్పరు. ప్రతిపక్ష సభ్యులు తన చేంబర్‌కు ఎందుకు వచ్చారో కూడా చెప్పరు. ప్రతిపక్షం అంటే మోదీకే కాదు స్పీకర్‌కూ చచ్చేంత భయం.
లోకసభ నుంచిమోదీ పలాయనం
- Advertisement -


