నిరుద్యోగ సమస్యపై అసెంబ్లీలో చర్చించాలి
జి. కోటేశ్వరరావు.
విశాలాంధ్ర`విజయవాడ: కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సీపీఐ నగర కార్యదర్శి జి. కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. నగరంలోని దాసరిభవన్‌లో ఏఐవైఎఫ్ నగర అధ్యక్షుడు కంచర్ల భార్గవ్ అధ్యక్షతన శుక్రవారం నగర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కోటేశ్వరరావు మాట్లాడుతూ నెలకు రూ 3వేలు నిరుద్యోగ భృతి, ప్రతి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, 19 నెలలు గడుస్తున్నా ఆ దిశగా అడుగులు వేయలేదని విమర్శించారు. ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగ సమస్యపై ప్రత్యేకంగా చర్చించాలని, దీనిపై ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఉగాదికి తీపి కబురు చెబుతామని నమ్మించి, 2.60 లక్షల మంది వాలంటీర్లను రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 2 లక్షల మంది టెట్ అభ్యర్థులు నష్టపోతున్నా, ప్రత్యేక టెట్ నిర్వహించాలన్న వారి విన్నపాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. బేవరేజెస్ కార్పొరేషన్ మరియు రేషన్ వాహనాల్లో పనిచేస్తున్న సుమారు 40,000 మందిని తొలగించడం దారుణమని, దీనిపై డివిజన్ల వారీగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఏఐవైఎప్ నగర కార్యదర్శి లంకా గోవిందరాజులు మాట్లాడుతూ నిరుద్యోగ సమస్యపై తాము చేపట్టిన రణభేరి కార్యక్రమ ప్రభావంతో ప్రభుత్వం స్పందించడం శుభపరిణామమన్నారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి…? కొత్తగా వచ్చిన పరిశ్రమలు ఎన్ని…? వాటి ద్వారా ఎంతమందికి ఉపాధి లభించింది…? అనే అంశాలను స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 9వ తేదీన నిర్వహించే నిరసన కార్యక్రమాలను యువత భారీ ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాయకులు సింగంశెట్టి మోహన్ ప్రసాద్, వెంకటేశ్వర్లు, శ్రీరాం రవికుమార్, ఎం. సాయి కుమార్, గంటా మమత, షైనీ, రామకృష్ణ, కారెపు కార్తీక్, హరీష్, బర్రె రాజా, గాడి అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల వాగ్దానాలు అమలు చేయాలి
- Advertisement -
RELATED ARTICLES


