దాదాపు దశాబ్దం తరవాత బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్‌తో సహా మహారాష్ట్రలో మొత్తం 29 మునిసిపల్ కార్పొరేషన్లకు గురువారం జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయ పథంలో సాగిపోతోంది. అంటే బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ మీద శివసేనకు పాతికేళ్ల నుంచి ఉన్న పట్టు సడలి పోయింది. ఏ ప్రాంతీయ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకున్నా ఆ పార్టీలు క్రమంగా అదృశ్యం అయిపోతాయి అన్నది గత పన్నెండే ళ్లుగా ఎదురవుతున్న అనుభవం. బృహన్ముంబై వార్షిక బడ్జెట్ హర్యానా బడ్జెట్ కన్నా ఎక్కువ. అది దాదాపు లక్ష కోట్ల రూపాయలకు చేరబోతోంది. ముంబై మునిసిపల్ కార్పొరేషన్ పై శివసేన పట్టు తగ్గడం అంటే శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే వారసత్వం సైతం ముగింపు దశకు రావడమే. శివసేన చీలిక వర్గం నాయకుడైన ఏక్‌నాథ్ షిండే మహారాష్ట్రలో బీజేపీ నాయకత్వంలో ఉన్న అధికార పక్షంలో ఉన్నారు కనక ఆ వర్గానికి ప్రస్తుతానికి పెద్ద నష్టం కనిపించకపోవచ్చు. కానీ బాల్ ఠాక్రే కుమారుడు ఉద్ధవ్ ఠాక్రేకు, బాల్ ఠాక్రే సోదరుని కుమారుడు రాజ్ ఠాక్రేకు కూడా ఇది కోలుకోలేని దెబ్బే కావచ్చు. ఎందుకంటే ఉద్ధవ్‌ఠాక్రే ముఖ్యమంత్రి పదవి నుంచి రాజీనామా చేయక తప్పని పరిస్థితులను బీజేపీ కల్పించింది. తరవాత షిండే వర్గాని కన్నా బీజేపీకి ఎక్కువ స్థానాలున్నప్పటికీ షిండే ముఖ్యమంత్రి కావడానికి అంగీకరించింది. ఆయన 2022 జూన్ 30 నుంచి 2024 డిసెంబర్ నాలుగు దాకా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఆయన దేవేంద్ర ఫడ్నవీస్ మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. షిండేకు అధికారంలో కొనసాగడం ప్రధానం అయితే బలమైన ప్రాంతీయ పార్టీగా ఉన్న శివసేనను అంతం చేయడం బీజేపీ లక్ష్యం. గురువారం జరిగిన మునిసిపల్ కార్పొరేషన్ ఫలితాలను పరిశీలిస్తే బీజేపీ ఎలా పుంజుకుంటోందో స్పష్టం అవుతోంది. ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే చివరి క్షణంలో ఐక్యమై బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ మీద పట్టు నిలుపుకోవాలని చేసిన ప్రయత్నం సఫలం కాలేదు. బాలా సాహెబ్ ఠాక్రే కు ఉన్న ప్రాబల్యం, జనబలం ఉద్ధవ్ ఠాక్రేకు లేవు. బాల్ ఠాక్రే ఇల్లు మాతోశ్రీ నుంచి నడిచే రాజకీయాలకు ఇక అవకాశం ఉండకపోవచ్చు. ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ శక్తిమంతమైన నాయకుడిగా తయారయ్యారు. ఏక్‌నాథ్ షిండే బీజేపీ నాయకుడు ఫడ్నవీస్ ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా ఉండొచ్చు. ఆయన నాయకత్వంలోని శివసేన వర్గం ఇప్పటికీ బలంగా ఉన్నట్టు కనిపించవచ్చు. కానీ దేవేంద్ర ఫడ్నవీస్, మొత్తంగా బీజేపీ అనుసరిస్తున్న వ్యూహాలను నిశితంగా పరిశీలిస్తే షిండే వర్గం కూడా చరిత్ర గర్భంలో ఇమిడిపోయే రోజులు ఎంతో దూరంలో లేవు. బృహన్ముంబైతో పాటు నాగపూర్, పుణే మునిసిపల్ కార్పొరేషన్లలోనూ బీజేపీ అపూర్వంగా మూడిరట రెండు వంతుల స్థానాలు సంపాదించి విజయం సాధించబోతోంది. శరద్ పవార్, బాలాసాహెబ్ ఠాక్రే, కాంగ్రెస్ సాంప్రదాయిక రాజకీయాలూ అంతమయ్యే దశకు చేరుకున్నాయి. దేవేంద్ర ఫడ్నవీస్ ఇప్పుడు అయిదేళ్ల పదవీ కాలం పూర్తి చేసిన వసంత్ రావ్ నాయక్, వై.బి.చవాన్ రికార్డును చేరుకున్నారు. బాలాసాహెబ్ ఠాక్రే సజీవంగా ఉన్నప్పుడు కూడా రాజ్‌ఠాక్రే రాజకీయాలలో ఎక్కువ రాణించారు. బాల్‌ఠాక్రే తరవాత రాజ్‌ఠాక్రేనే శివసేన అధినేత అవుతాడనుకున్నారు. కాని బాల్‌ఠాక్రే పుత్ర వ్యామోహంతో ఉద్ధవ్ ఠాక్రేకు శివసేన పగ్గాలు దక్కేలా చేశారు. అయితే ఉద్ధవ్ ఠాక్రే ఎన్నడూ తండ్రి స్థాయికి చేరుకోలేక పోయారు. ఉద్ధవ్ ఠాక్రేకు ఫొటోగ్రఫీ మీద ఉన్న అనురక్తి రాజకీయాల మీద ఉండేది కాదు. బాల్‌ఠాక్రే స్వభావం ఉద్ధవ్ ఠాక్రేకు వారసత్వంగా అబ్బలేదు. బాల్‌ఠాక్రే లాగా ఆయన తీవ్ర హిందుత్వ వైఖరిని అనుసరించలేకపోయారు. ఆయన శివసేన సంప్రదాయాన్ని వదిలి సాధారణ రాజకీయ పార్టీగా నడపడం మొదలుపెట్టారు. బాలాసాహెబ్ ఠాక్రేకు ఉన్న జనాకర్షక శక్తి కూడా ఉద్ధవ్‌ఠాక్రేలో కనిపించదు. ఈ పరిస్థితిని బీజేపీ వాటంగా వినియోగించుకుంది. 2014 తరవాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రాజకీయాల స్వరూపాన్నే పూర్తిగా మార్చేశారు. ఈ అంశాన్ని ఉద్ధవ్ ఠాక్రే గమనించినట్టు లేదు. శివసేనను చీల్చడం అసాధ్యం అనుకున్న స్థితిలో మోదీ, అమిత్ షా ఆ పార్టీని రెండు ముక్కలు చేయగలిగారు. బీజేపీ అండతో ఏక్‌నాథ్ షిండే అధికారాన్ని ఆసరాగా చేసుకుని బలమైన నాయకుడిగా ఎదిగారు. కానీ ఇది మూణ్నాళ్ల ముచ్చటే కావొచ్చు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలను అంతమొందించడమే బీజేపీ అసలు లక్ష్యం.మోదీ, అమిత్ షా రాజకీయాలను నిలవరించడంలో మహారాష్ట్రలోని ప్రతిపక్ష పార్టీలన్నీ విఫలం అవుతూనే ఉన్నాయి. బీజేపీకి అందుబాటులో ఉన్న సకల విధ వనరులు ఏ పార్టీ దగ్గరా లేవు. బీజేపీలాగా లక్ష్యాన్ని సాధించే పట్టుదల కూడా ప్రతిపక్ష పార్టీలకు లేదు. ప్రాంతీయ పార్టీలను అంతం చేయడానికి బీజేపీ పకడ్బందీ వ్యూహం పన్నడంతో పాటు ఎంతకైనా దిగజారగలదు. అవసరం అనుకున్నప్పుడు ప్రాంతీయ పార్టీలతో కత్తు కలపకలదు. ఆ తరవాత ఆ పార్టీల అస్తిత్వానికే ఎసరు పెట్టగలదు. దీనికి కర్నాటకలోని జనతా దళ్ (సెక్యులర్) ఉన్న దుస్థితే ప్రబల నిదర్శనం. అది ఇప్పుడు అవసాన దశలో ఉంది. 2017లో బృహన్ముంబై ఎన్నికలు జరిగినప్పుడు శివసేన ఆధిపత్యం సంపాదించింది. దానికి ప్రధాన కారణం శివసేన అప్పటికి ఐక్యంగా ఉండడం, బీజేపీ అస్తిత్వం నామమాత్రం కావడం కారణం కావొచ్చు. ఉద్ధవ్‌ఠాక్రేకు, రాజ్‌ఠాక్రేకు మధ్య సయోధ్య కుదిరినట్టు కనిపిస్తున్నా మునిసిపల్ కార్పొరేషన్ల ఎన్నికలలో కలిసి పోటీ చేయలేదు. రాజ్ ఠాక్రే నాయకత్వంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన విడిగానే పోటీ చేసింది. శుక్రవారం సాయంత్రానికి 29 కార్పొరేషన్ల పూర్తి ఫలితాలు వెలువడలేదు. కానీ అత్యధిక స్థానాల్లో బీజేపీనే గెలుపు బాటలో ఉంది. ఆ తరవాత షిండే నాయకత్వంలోని శివసేన వర్గం ఉంది. అయితే ఈ రెండు పార్టీల మధ్య అంతరం చాలాఎక్కువే. పుణేలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలోని శరద్‌పవార్ వర్గం, అధికారపక్షంలో చేరిపోయిన పవార్ సోదరుడి కుమారుడు అజిత్ పవార్ వర్గం ఉమ్మడిగా పోటీ చేసినా అంతగా ఫలితం దక్కలేదు. ఇది అపవిత్ర కలయిక అన్న మచ్చ మాత్రం తప్పలేదు. పూర్తి ఫలితాలు వెలువడక పోయినా బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ పై బీజేపీ పట్టు సాధించడం ఖాయం అనిపిస్తోంది. అయితే ప్రతిపక్షం విజయం సాధించకపోయినా మరీ కుదేలు కాకపోవడం గమనించదగిన అంశం. శివసేన చేతిలోంచి బృహన్ముంబై జారిపోవడం కన్నా బీజేపీ పట్టు సాధించడం ప్రత్యేకంగా గుర్తించవలసిన విషయం.


