Thursday, December 12, 2024
Homeఆంధ్రప్రదేశ్విద్యుత్‌ చార్జీలపై 19న భారీ నిరసన

విద్యుత్‌ చార్జీలపై 19న భారీ నిరసన

పవన్‌ భుజంపై ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండా: రామకృష్ణ విమర్శ
20 నుంచి సభలు, సమావేశాలు: శ్రీనివాసరావు

విశాలాంధ్ర – విజయవాడ : సర్దుబాటు పేరుతో ప్రజలపై విద్యుత్‌ చార్జీల భారం మోపటం దుర్మార్గమని, పెంచిన చార్జీలు రద్దు చేసే వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని వామపక్షాల నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చ రించారు. సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తానంటూ ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ అజెండాను భుజానవేసుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేశారు. స్థానిక హనుమాన్‌పేట దాసరి భవన్‌లో వామపక్ష పార్టీల నేతలు శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇప్పటికే సర్దుబాటు చార్జీల భారం రూ.6,072 కోట్లు మోపగా… తాజాగా మరో రూ.11 వేల కోట్ల భారం మోపాలనుకోవడం దుర్మార్గమన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఏనాడూ ఇంత పెద్ద ఎత్తున భారం పడలేదన్నారు. పెంచిన చార్జీలను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామన్నారు. చార్జీల పెంపుపై అభ్యంతరాలు తెలిపేందుకు ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ)ఈ నెల 19వ తేదీ వరకు అవకాశం కల్పించిందని, ప్రజలు, ప్రజాసంఘాలు, ప్రతిపక్ష పార్టీలు తమ అభ్యంతరాలను ఏపీఈఆర్‌సీకి స్పష్టంగా చెప్పాలని కోరారు. ఈ అభ్యంతరాలపై తమ వాదనలు వినిపించేందుకు అవకాశం కల్పించాలని ఏపీఈఆర్‌సీకి విజ్ఞప్తి చేశారు. విద్యుత్‌ చార్జీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చేసిన పాపం తమకు శాపంగా మారిందని, కృష్ణపట్నం, వీటీపీఎస్‌లలో విద్యుత్‌ ఉత్పత్తి చేయకుండా బయట నుంచి విద్యుత్‌ కొనుగోలు చేయటం వల్ల చార్జీల భారం మోపకతప్పటం లేదని చెప్పటం, రెవెన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్‌ చార్జీలు పెంచటాన్ని సమర్థిస్తూ కథనాలు రాయటం సరికాదన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే విద్యుత్‌ చార్జీలు పెంచబోమని చంద్రబాబు చెప్పిన విషయాన్ని రామకృష్ణ గుర్తు చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విద్యుత్‌ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఈనెల 19వ తేదీన విజయవాడలో వామపక్షాలు నిరసన తెలియజేయనున్నట్లు వెల్లడిరచారు. 20 నుండి 30వ తేదీ వరకు 26 జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వ పనితీరును ఎండగడతామని హెచ్చరించారు. సనాతనవాదంపై పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండా అయిన సనాతనవాదాన్ని పవన్‌ భుజానకెత్తుకుని మైనార్టీలకు వ్యతిరేకంగా ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు. పవన్‌ సినిమాలను అందరూ చూడబట్టే ఆయన గొప్పగా ఎదిగారని పేర్కొన్నారు. అన్ని కులాలు, మతాలు, వర్గాల వారు జనసేనలో ఉన్నారని, జనసేనకు ఒక్క ఎమ్మెల్యే కూడా లేని సందర్భంలో ఆ పార్టీని బీజేపీలో విలీనం చేయమని అమిత్‌ షా కోరినప్పుడు పవన్‌ అంగీకరించకపోవటంతో జనసేన పార్టీని లౌకికపార్టీగా ప్రజలు గుర్తించారని చెప్పారు. దీనిపై పవన్‌ కల్యాణ్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ తరపున ఉన్న సత్యకుమార్‌, ఇతర మంత్రులు కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడటం లేదన్నారు. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి పవన్‌ కల్యాణ్‌ని హద్దుల్లో పెట్టాలని కోరారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల ముందు విద్యుత్‌ చార్జీలు పెంచబోమని చెప్పి టీడీపీ అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు. విద్యుత్‌ చార్జీల భారం జగన్‌ ప్రభుత్వ నిర్ణయమని చంద్రబాబు చెప్పడం దుర్మార్గమన్నారు. విద్యుత్‌ భారాలు వేసిన వైసీపీని ప్రజలు తిరస్కరించారన్నారు. విద్యుత్‌ చార్జీల పెంపుతో వినియోగదారులపై ఒక్కో యూనిట్‌కు రూ.1.80 నుండి రూ.2.40 అదనపు భారం పడుతుందన్నారు. గతంలో స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు వద్దన్న టీడీపీ…ఇప్పుడు కొనసాగిస్తున్నదని ఆరోపించారు. విద్యుత్‌ మీటర్ల కాంట్రాక్టును టీడీపీ సర్కారు కూడా షిర్డీసాయి కంపెనీకే కట్టబెడుతున్నదని తెలిపారు. మద్యం, ఇసుక, పెరిగిన ధరలపై ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై ఇప్పటికే అసంతృప్తి ఉందన్నారు. ప్రజావాణి వినిపించేందుకు 19న నిరసన తెలుపుతున్నట్లు స్పష్టంచేశారు. ఈ నెల 20 నుండి వామపక్ష నాయకులు మూడు దళాలుగా రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు, సభలు, రౌండ్‌టేబుల్‌ సమావేశాలు నిర్వహించి నిరసన తెలుపుతామని చెప్పారు. వామపక్షాలు చేపట్టిన ఆందోళనకు ప్రజలు మద్దతు పలికి జయప్రదం చేయాలని కోరారు. పవన్‌ కల్యాణ్‌ సనాతన ధర్మం వ్యాఖ్యలు సరికాదన్నారు. రాష్ట్రంలో మత సామరస్యాన్ని పెంపొందించాలన్నారు. జనసేన కార్యకర్తలు ఆలోచించి మత రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచించారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్‌ బాబూరావు, సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు పి.ప్రసాద్‌, ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌కే ఖాదర్‌బాషా మాట్లాడుతూ విద్యుత్‌ చార్జీలు రద్దు చేయకపోతే బషీర్‌బాగ్‌ తరహా విద్యుత్‌ ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌లో మత విద్వేషాలు రెచ్చగొట్టవద్దని వపన్‌కల్యాణ్‌కి హితవు పలికారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జల్లి విల్సన్‌, సీపీఐ(ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు కె.పొలారి పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు