. మొదటి దశలో 46.22 కి.మీ – 43 స్టేషన్లు
. రూ.11వేల కోట్ల వ్యయం
న్యూదిల్లీ: విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలి పింది. దిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు… కేంద్రమంత్రి మనోహ ర్లాల్తో భేటీ అయిన సందర్భంగా మనోహర్‌లాల్ స్వయంగా ఈ విషయాన్ని సీఎంకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విశాఖ, విజయవాడ మెట్రోకు ప్రతిపాదనలు పంపింది. ఈ నేపథ్యంలో విశాఖ మెట్రోకు పచ్చజెండా ఊపినట్లు సీఎంకు కేంద్రమంత్రి తెలిపారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, ప్రయాణాన్ని సులభతరం చేయడానికి ఈ మెట్రో ప్రాజెక్టు ఎంతగానో ఉపయోగపడ నుందని ప్రభుత్వం చెబుతోంది. విశాఖ మెట్రో మొదటిదశ ప్రాజెక్టుకు రూ.11 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ మెట్రోను మొదటి దశలో 3 కారిడార్లలో నిర్మించాలని డీపీఆర్ సిద్ధం చేశారు. 3 కారిడార్లలో కలిపి మొత్తం 46.22 కి.మీ, 43 మెట్రో స్టేషన్లను నిర్మించనున్నారు. అలానే ఈ మెట్రో ప్రాజెక్టును డబుల్ డెక్కర్ విధానంలో నిర్మించేలా డీపీఆర్ సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టులో ఎనఏడీ, తాటిచెట్లపాలెం, గురుద్వారా, మద్దిలపాలెం, హనుమంతువాక వద్ద ఇంటిగ్రేటెడ్ మెట్రో స్టేషన్లు ఉండనున్నాయి.
మొదటిదశలో మూడు కారిడార్లు:
విశాఖ నగరంలోని కూర్మన్నపాలెం-కొమ్మాది జంక్షన్ మధ్య మొదటి మెట్రో లైను 34.4 కి.మీ, 29 మెట్రో స్టేషన్లు ఉండనున్నాయి. గురుద్వారా-పాత పోస్టాఫీసు మధ్య 2వ మెట్రో లైను రానుంది. ఈ కారిడార్‌లో 5.07 కి.మీ, 6 స్టేషన్లు నిర్మించనున్నారు.
తాడిచెట్లపాలెం-చినవాల్తేరు మధ్య 3వ మెట్రో లైను రానుంది. ఈ కారిడార్‌లో 6.75 కి.మీ, 7 మెట్రో స్టేషన్లు రానున్నాయి.
విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుల డీపీఆర్‌లను 2015లోనే అప్పటి టీడీపీ ప్రభుత్వం మొదటిసారి కేంద్రానికి పంపగా… అప్పట్లోనే కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. తర్వాత కేంద్రం తీసుకువచ్చిన కొత్త మెట్రో రైలు విధానానికి అనుగుణంగా మళ్లీ డీపీఆర్‌లు సమర్పించాలంటూ వాటిని తిప్పి పంపింది. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టులకు కేంద్రానికి ఎలాంటి డీపీఆర్‌లు అందలేదు. కూటమి అధికారంలోకి వచ్చాక విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు 6 నెలల్లోనే డీపీఆర్‌లు సిద్ధం చేసింది. 2025 డిసెంబరులో కేంద్రం ఆమోదానికి పంపింది. విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుల్ని 2 దశల్లో చేపడతారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త భాగస్వామ్య విధానం (జేవీ మోడల్)లో ప్రాజెక్టు వ్యయంలో 40 శాతం చెరిసగం భరించాలన్న అంగీకారం గతంలోనే జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు సమకూర్చేందుకు, వాటితో పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. ప్రాజెక్టులో జాప్యాన్ని నివారించేందుకు కేంద్రం నుంచి అనుమతులు వచ్చేలోగా తన వంతు 20 శాతం నిధులతో భూసేకరణ, సివిల్ పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. టెండర్లు కూడా పిలిచింది. ఆ పనులకు అనుమతుల కోసం 2 నెలల క్రితం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. సంయుక్త భాగస్వామ్య ప్రాజెక్టు కావడంతో రాష్ట్ర నిధులతో చేపట్టే పనులకైనా కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. అమరావతి పనులు ఊపందుకోవడం, విశాఖకు గూగుల్, ఐటీ లాంటి దిగ్గజ కంపెనీలు వస్తుండటంతో విజయవాడ, విశాఖలకు మెట్రో ప్రాజెక్టులు అత్యంత అవసరం అని, వచ్చే ఎన్నికల్లోగా తొలి దశ పనులైనా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.


