ఏదో ఒక చోట పేలుళ్లు జరగడం దేశ వాసులు నిర్ఘాంత పోవడం పరిపాటి అయిపోయింది. ఈ సారి సోమవారం సాయంత్రం దిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుళ్లు జరిగాయి. జనం మరోసారి నిర్ఘాంత పోయారు. ఈ పేలుళ్లలో తొమ్మిది మంది మరణించారని, 24 మంది గాయపడ్డారని అంటున్నారు. యథావిధిగా దిల్లీ పోలీసులు, జమ్మూ కశ్మీర్ పోలీసులతో పాటు ఎన్‌ఐఎ దర్యాప్తు జరుపుతున్నాయి. ఇవన్నీ ఎప్పుడు ఏ విధ్వంసం జరిగినా దొర్లే మాటలే. మంగళవారం సాయంత్రం దాకా ఈ పేలుళ్లకు బాధ్యులు ఎవరో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇసుమంత సమాచారం కూడా లేదు. సాధారణంగా ఇలాంటి సంఘటనలు జరిగిన ప్పుడు ఫలానా తీవ్రవాద ముఠా పనేనని, పాకిస్థాన్ హస్తం ఉందని ప్రభుత్వం రొడ్డ కొట్టుడు సమాచారం అందజేస్తూ ఉంటుంది. ఈసారి అలాంటిది ఏమీ లేకపోవడం విచిత్రమే. మరో వేపు జమ్మూ-కశ్మీర్ పోలీసులు అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ తీవ్రవాద ముఠా గుట్టు రట్టు చేశారట. దిల్లీ పేలుళ్లకూ, జమ్మూ-కశ్మీర్ పోలీసులు బహిర్గతం చేసిన తీవ్రవాద ముఠాకు మధ్య లంకె ఉందో లేదో. దిల్లీ పేలుళ్ల తరవాత డా. మహమ్మద్ షకీల్ (పుల్వామా), డా. ఆదిల్ అహమద్ (కుల్లాం), డా. షహీన్ షాహిద్ (అనంత్ నాగ్), డా. ఇమాం (షోపియా) తో పాటు మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారికీ ఈ దిల్లీ పేలుళ్లతో సంబంధం ఉందో లేదో ప్రభుత్వం నికరంగా తేల్చలేదు. కానీ పట్టుబడ్డ వారందరూ విద్యావంతులే కావడం చూస్తే తీవ్రవాద కార్యకలాపాలు ఏ స్థాయికి చేరాయో అర్థం అవుతుంది. అరెస్టు చేసిన వారు జైష్-ఎ-మహమ్మద్‌కు చెందిన వారంటున్నారు. 26 రోజులుగా వారి మీద నిఘా వేసి ఉంచారట. అరెస్టైన వారిలో ఓ మహిళా డాక్టర్ కూడా ఉన్నారు. అలాగే ఫరీదాబాద్‌లో 2900 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకుంటున్నారట. అందులో అమోనియం నైట్రేట్ కూడా ఉందంటున్నారు. దిల్లీ పేలి పోయిన కారులో ఉపయోగించింది కూడా అమోనియం నైట్రేటే అంటున్నారు. ఒక వేపు దిల్లీలో పేలుళ్లు, ఇంకో వేపు కశ్మీర్లోని వివిధ ప్రాతాలలోని వారిని అరెస్టు చేయడం, మరో వేపు ఫరీదాబాద్‌లో భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకోవడం మధ్య అంతస్సంబంధం ఉందో లేదో కానీ ఈ సంఘటనలనీ ఒకే రోజు జరగడం గమనార్హం. దిల్లీలో ఇంత ఘోరం జరిగినా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం భూటాన్ రాజు ఇస్తున్న విందువినోదాల్లో మునిగితేలేందుకు భూటాన్ పర్యటనకు వెళ్లిపోయారు. పహల్గాం పేలుళ్లు జరిగినప్పుడూ ప్రధాని విదేశీ పర్యటనలోనే ఉన్నారు. పేలుళ్లు జరిగిన తరవాత హుటా హుటిన దిల్లీ చేరుకున్నారు. కానీ మరుసటి రోజే బీహార్ పర్యటనకు వెళ్లిపోయారు. అప్పటికి బీహార్ ఎన్నికల ఉత్తర్వు వెలువడనైనా లేదు. తీవ్ర వాదులు తమ ఇష్టానుసారం ఎక్కడ కావాలనుకుంటే అక్కడ విధ్వంసం సృష్టించగలుగుతున్నారంటే మన నిఘా వ్యవస్థలు, గూఢచార వ్యవస్థలు ఏం చేస్తున్నాయో అంతుపట్టదు. అయితే దిల్లీ పేలుళ్లకు ఫరీదాబాద్‌లోని అల్ పహల్ ఆసుపత్రిలో పని చేస్తున్న డాక్టర్ల మీదే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
పేలుళ్లకు ఉపయోగించిన తెల్ల రంగు ఐ.20 అట. ఈ కారు పేలి పోవడానికి ముందు రెండు మూడు గంటల సేపు ఎర్రకోట పార్కింగ్ స్థలంలోనే ఉందట. ఆ తరవాత ఆ కారు ఓ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పేలిపోయింది. కారులో ముగ్గురు వ్యక్తులున్నారట. పేలుళ్లకు ఎవరు కారణం అన్న అంశం నింపాదిగా తేలవచ్చు. కానీ పేలుడు ప్రభావం వల్ల మరణించిన, గాయపడిన వారి శరీరాల్లో సాధారణంగా ఇలాంటి సందర్భా లలో కనిపించే లక్షణాలు ఏవీ లేవు. అధునాతన పేలుడు పదార్థం వినియోగించినప్పుడు మృతుల, క్షత గాత్రుల శరీరాలు నల్లబడతాయి. కానీ సోమవారం నాటి పేలుళ్లలో అలాంటిది ఏమీ లేదు. ఈ కారు కనీసం మూడు చేతులు మారిందంటున్నారు. మొదట ఈ కారు అమీర్‌ది అయితే ఆయన తారిక్‌కు అమ్మేశారట. ఆయన ఉమర్‌కు అమ్మేశారట. ఇవన్నీ విధ్వంసకారులు అనుసరించే వక్రమార్గాలకు ఆనవాళ్లలా ఉన్నాయి. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో అధికార పక్షానికి కొమ్ము కాసే ఏఎన్‌ఐ వార్తా సంస్థ ఇది విద్రోహుల దాడి అని వెల్లడిరచింది. అయితే ఇది అధికార సమాచారమేమీ కాదు. షరా మామూలుగా విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం మాత్రమే. అదీ ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే వార్తా సంస్థ వెల్లడిరచిన సమాచారం. విశ్వసనీయ వర్గాలకు అందే సమాచారం అధికారికంగా ఎందుకు వెలువడదో అర్థం కాదు. గోదీ మీడియా జనంతో పరిహాసాలాడుతున్నట్టుగా ఉంది. ఆపరేషన్ సిందూర్ ఆగిపోలేదని కొనసాగుతూనే ఉందని మోదీ ప్రభుత్వం పదే పదే చెప్తోంది. అదే నిజమైతే ఇలాంటి విధ్వంసాన్నీ ఎందుకు నిరోధించలేక పోయింది. వెలువడుతున్న ఆ కాస్తా సమాచారం కూడా గోదీ మీడియా ద్వారానే, అదీ విశ్వసనీయ వర్గాల వడపోత తరవాత ఎందుకు బయటకొస్తున్నట్టు? సమస్య ఎక్కడ ఉందంటే సోమవారం నాటి పేలుళ్లకు సంబంధించిన సమాచారం లేశ మాత్రమే. కానీ దాని చుట్టూ ఉన్న సమాచారం బోలెడు. మామూలుగా అయితే ఈ పాటికి చిన్నా పెద్ద బీజేపీ నాయకులు విరామం లేకుండా ప్రకటనలు గుప్పించే వారు. పాకిస్థాన్‌ను దోషిగా నిలబెట్టే వారు. ఇప్పుడు దిల్లీ పేలుళ్లు తీవ్రవాదుల పనే అని చెప్పడానికి ఎందుకు సాహసించడం లేదు. కాకపోతే ఆ విషయమైనా చెప్పొచ్చుగా. భారీ విధ్వంసం జరిగిన తరవాత ఇతర సంఘటనలతో ముడి పెట్టే ప్రయత్నం మాత్రం జోరుగా సాగుతోంది. పేలుళ్లు జరిగి పూర్తిగా 24 గంటలు గడిచినా దర్యాప్తు సంస్థలకు ఇతమిత్ధమైన కారణం అంతుపట్టకపోవడం విచిత్రంగా ఉంది. కేంద్ర హోం మంత్రి ఈ పేలుడుపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు సానుభూతి వ్యక్తం చేశారు. కానీ అసలు సమాచారం ఏమీ ఇవ్వలేదు. ఈ పేలుళ్లకు బాధ్యులెవరో చెప్పడానికి ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోంది. తొందరపడి ఏదో ఓ పక్షం మీద నింద వేయకపోవడం అన్న వివేకం ప్రభుత్వానికి ఎందుకు కలిగినట్టు? పాకిస్థాన్ మీద ఎందుకు విరుచుకుపడడం లేదో! ఇలాంటి సంఘటన ఏది జరిగినా దాన్ని యుద్ధం కిందే పరిగణిస్తామని రక్షణ శాఖ మంత్రి గట్టిగా చెప్పారుగా. ఇప్పుడు మౌనంగా ఎందుకున్నట్టో! పహల్గాం విషాద ఘటన తరవాత దిల్లీలో భారీ పేలుళ్లు ఎలా జరిగినట్టు? యుద్ధోన్మాద స్థాయిలో వ్యవహరించే మోదీ ప్రభుత్వం చేసిన కట్టుదిట్టాలు మాయమై పోయాయేమో! కాంగ్రెస్ అధ్యక్షుడు ఖడ్గే కుమారుడు, కర్నాటకలో మంత్రి ప్రియాంక్ ఖడ్గే నిర్భయంగా అమిత్ షాను కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలంటున్నారు. ఫరీదాబాద్‌కు భారీమొత్తంలో ఆర్‌డిఎక్స్ చేరడానికి బాధ్యత ఎవరిది? ఈ సందర్భంగా కొందరు డాక్టర్లను అరెస్టు చేసిన తరవాత కూడా దిల్లీలో పేలుళ్లు జరిగాయంటే మన గూఢచర్యం ఎంత బలహీనమైందో తెలిసిపోతోంది. మృతుల, క్షతగాత్రుల జీవితాలు బుగ్గి అయిపోయాయి. అమిత్ షా జీవితం సజావుగా సాగుతూనే ఉందిగా!
శోకసంద్రంలో జనం విందువిలాసాల్లో మోదీ
- Advertisement -


