భారత ప్రభుత్వం కార్మిక చట్టాలను సరళీకరించడం, పెట్టుబడులను ఆకర్షించడం, ఉపాధి అవకాశాలను పెంచడం అనే లక్ష్యాలతో 29 కార్మిక చట్టాలను నాలుగు ప్రధాన కార్మిక కోడ్లుగా విలీనం చేసింది. వీటిల్లో వేతన కోడ్-2019, పారిశ్రామిక సంబంధాల కోడ్-2020, వృత్తి భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్ -2020, సామాజిక భద్రతా కోడ్-2020 ఉన్నాయి. ప్రభుత్వం ఈ సంస్కరణలను కార్మిక రంగంలో ఆధునికీకరణ చర్య అని చెప్తున్నప్పటికీ కార్మిక సంఘాలు, కార్మిక హక్కుల పరిరక్షకులు వీటి వల్ల కార్మికుల హక్కులు బలహీనపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త కార్మిక కోడ్లలో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశం ఉద్యోగ భద్రత. పారిశ్రామిక సంబంధాల కోడ్ ప్రకారం 300 మంది వరకు ఉద్యోగులు ఉన్న సంస్థలు ప్రభుత్వ అనుమతి లేకుండానే ఉద్యోగులను తొలగించడం లేదా సంస్థను మూసేయడం వంటివి చేసే అవకాశం ఉంది. గతంలో ఈ పరిమితి 100 మంది ఉద్యోగులకు మాత్రమే ఉండేది. ఈ మార్పు వల్ల ఉద్యోగ భద్రత తగ్గిపోతుందని, యాజమాన్యాల ఒత్తిడి పెరుగుతుందని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ముఖ్యంగా శాశ్వత ఉద్యోగాల స్థానంలో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ , ఫిక్స్¦ టర్ˆ ఉద్యోగాలు పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల ఉద్యోగులు ఎప్పుడైనా ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఎదుర్కొనవచ్చు. కొత్త కోడ్లలో మరో ముఖ్యమైన అంశం సమ్మె హక్కుపై విధించిన పరిమితులు. కొత్త చట్టాల ప్రకారం సమ్మె చేయాలంటే 60 రోజుల ముందుగా నోటీసు ఇవ్వడం తప్పనిసరి. రాజీ ప్రక్రియ జరుగుతున్న సమయంలో సమ్మె చేయడానికి అనుమతి ఉండదు. దీనివల్ల కార్మికులు తమ సమస్యలపై తక్షణ నిరసన వ్యక్తం చేయడం కష్టమవుతుంది. యాజమాన్యాలు ముందుగానే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉండటంతో కార్మిక ఉద్యమాల ప్రభావం తగ్గే ప్రమాదం ఉంది. అలాగే కార్మిక సంఘాల గుర్తింపు నిబంధనల్లో వచ్చిన మార్పుల కారణంగా చిన్న సంఘాలు బలహీనపడే అవకాశం ఉంది.అదే సమయంలో యాజమాన్య అనుకూల సంఘాలకు ప్రాధాన్యం పెరగచ్చని భావిస్తున్నారు. మరోవైపు పని గంటల విషయంలో కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని నిబంధనల ప్రకారం రోజుకు 12 గంటల వరకు పని చేయించే అవకాశం ఉందనే అభిప్రాయం కార్మిక సంఘాల్లో ఉంది. దీనివల్ల శారీరక అలసట, మానసిక ఒత్తిడి, కుటుంబ జీవితంపై ప్రతికూల ప్రభావం, పని స్థలంలో ప్రమాదాలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మహిళా కార్మికులు, వృద్ధ కార్మికులు దీని ప్రభావానికి ఎక్కువగా గురయ్యే అవకాశం కనిపిస్తోంది. సామాజిక భద్రత విషయంలో కూడా అనేక సందేహాలు ఉన్నాయి. స్విగ్గీ, జొమాటో, ఉబెర్, ఓలా, అమెజాన్ వంటి సంస్థలలో పనిచేసే గిగ్ ,ప్లాట్ఫామ్ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ, ఉద్యోగ భద్రత వంటి హక్కులు లభించవు. అలాగే అసంఘటిత రంగంలో పనిచేసే కోట్లాది కార్మికులకు సంక్షేమ పథకాల అమలుపై స్పష్టత లేకపోవడం మరో ఆందోళనకర అంశం. వృత్తి భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్లో కూడా కొన్ని మార్పులు చర్చనీయాంశమయ్యాయి. పాత వ్యవస్థలో ఉన్న లేబర్ ఇన్సెÎక్టర్ల స్థానంలో ఇన్సెÎక్టర్-కమ్-ఫెసిలిటేటర్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ కొత్త విధానం సలహాలు, మార్గదర్శకత్వానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుందని, యాజమాన్యాలపై చర్యలు తీసుకునే అవకాశం తగ్గుతుందని కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి. అలాగే స్వీయ ధృవీకరణ, డిజిటల్ తనిఖీల కారణంగా భద్రతా ఉల్లంఘనలు బయటపడకుండా ఉండే ప్రమాదం ఉందని పేర్కొంటున్నాయి. పనిస్థలంలో జరిగే ప్రమాదాలు, గాయాలు, వికలాంగత, మరణాల విషయంలో అనేక ఆచరణాత్మక సమస్యలు ఎదురవుతున్నాయి. పరిహారం పొందే హక్కు కొనసాగుతున్నప్పటికీ చేస్తున్న ఉద్యోగానికి సంబంధించిన అవసరమైన పత్రాలను సమర్పించడం, కాంట్రాక్టర్ బాధ్యతను నిర్ధారించడం వంటి అంశాలు బాధిత కుటుంబాలకు భారంగా మారుతున్నాయి. ముఖ్యంగా కాంట్రాక్ట్ కార్మికుల విషయంలో పరిహారం పొందడం మరింత క్లిష్టమవుతోంది. అలాగే గనులు, నిర్మాణం, సిమెంట్, రసాయన మరియు పొగాకు పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు వృత్తి సంబంధ వ్యాధులకు గురైనప్పుడు అవి ఉద్యోగం కారణంగానే వచ్చాయని నిరూపించడం కష్టంగా మారుతోంది. మహిళా కార్మికుల విషయంలో కూడా ప్రత్యేక ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పని గంటలు పెరగడం వల్ల శారీరక, మానసిక ఒత్తిడి ఎక్కువవుతోంది. గర్భిణీలకు ఇది ఇబ్బందికర పరిస్థితి. రాత్రి షిఫ్టుల్లో పని చేసే అవకాశాన్ని కల్పించినప్పటికీ రవాణా భద్రత, కార్యాలయ భద్రత, లైంగిక వేధింపుల నిరోధం వంటి అంశాల్లో కఠినమైన చర్యల అమలు లేకపోతే మహిళల భద్రత ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో ప్రసూతి ప్రయోజనాలు, క్రెచ్ సౌకర్యాలు, ఉద్యోగ భద్రత వంటి హక్కులు పూర్తిగా అమలుకాకపోవచ్చనే భయాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాలు 300 మంది ఉద్యోగుల పరిమితిని రద్దు చేయాలని, సమ్మె హక్కుపై విధించిన పరిమితులను తొలగించాలని, కాంట్రాక్ట్ ఉద్యోగాలపై కఠిన నియంత్రణలు తీసుకురావాలని, గిగ్ మరియు ప్లాట్ఫామ్ కార్మికులకు పూర్తి సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. అలాగే మహిళా కార్మికుల భద్రతకు ప్రత్యేక రక్షణ చర్యలు అమలు చేయాలని, కార్మిక సంఘాల స్వతంత్రతను కాపాడాలని, ఎనిమిది గంటల పని దినాన్ని చట్టబద్ధ హక్కుగా కొనసాగించాలని కోరుతున్నాయి. నూతన కార్మిక కోడ్లు కార్మిక చట్టాల సరళీకరణ పేరుతో అమలులోకి వచ్చినప్పటికీ ఉద్యోగ భద్రత, సమ్మె హక్కు, కార్మిక సంఘాల స్వతంత్రత, సామాజిక భద్రత మరియు మహిళా కార్మికుల రక్షణ వంటి అంశాలపై తీవ్రమైన చర్చకు దారితీశాయి. దేశ ఆర్థికాభివృద్ధి, కార్మికుల హక్కులు రెండూ సమానంగా పరిరక్షించే విధంగా ఈ కోడ్లను అమలు చేయడం, అవసరమైన చోట సవరణలు చేయడం అత్యంత అవసరం.


