నామినేటెడ్ పోస్టులు, రాజ్యసభ అభ్యర్థులు,
శాఖాపరమైన అంశాలపై చర్చ
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మంగళవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి మధ్యాహ్న సమయంలో వచ్చిన పవన్ కల్యాణ్ సీఎంతో ఏకాంతంగా సమావేశమయ్యారు. దాదాపు గంటకు పైగా వివిధ అంశాలపై ఇరువురు మధ్య చర్చ జరిగింది. అధికారికంగా ఉప ముఖ్యమంత్రి నిర్వహించే శాఖలకు సంబంధించి నిధులు, ఇతర అంశాలు చర్చించినట్లు మీడియాకు తెలియజేసినప్పటికీ నామినేటెడ్ పోస్టులు, రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక, ఇతర విషయాలు కూడా ఈ సమావేశంలో చర్చకొచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా కల్తీ నెయ్యిపై ఏక సభ్య కమిషన్ ఏర్పాటు తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, మండలిలో వైఎస్సార్సీపీ వ్యవహారశైలి , పెండింగ్ లో ఉన్న నామినేటెడ్ పదవుల పంపకాలు, కూటమి పార్టీల మధ్య సమన్వయం, కేంద్రంతో సమన్వయం చేసుకోవాల్సిన అంశాలపైన చర్చించినట్లు తెల్సింది. ఇక ఉప ముఖ్యమంత్రి శాఖలకు సంబంధించి పంచాయతీరాజ్ గ్రామీణా భివృద్ధి, ఆర్ డబ్ల్యూఎస్, అటవీ శాఖకి సంబంధించి జల్ జీవన్ మిషన్ పనుల పురోగతి, నిధుల వినియోగం, పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని రోడ్ల అభివృద్ధి నిధుల కేటాయింపు, నియోజకవర్గాల వారీగా జరిగిన కేటాయింపులు తదితర అంశాలను పవన్ కల్యాణ్ సీఎంకు దష్టికి తెచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పంచాయతీల్లో చేపట్టిన మ్యాజిక్ డ్రెయిన్ల పనుల గురించి తెలియజేసి, రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో ఈ తరహా డ్రెయిన్స్ నిర్మించడం ద్వారా పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా అమలు చేయవచ్చని వివరించారు. నీటిపారుదలశాఖ పరిధిలోని డ్రైనేజీల్లో ప్రస్తుత వేసవిలో పూడిక తీత పనులు చేపట్టి రైతులు పంటలు వేసేలోపు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.అటవీ శాఖ చేపట్టిన హనుమాన్ ప్రాజెక్ట్ వివరాలను తెలియజేశారు.


