Friday, March 6, 2026
Homeఅమెరికా`ఇజ్రాయిల్ విధ్వంసకాండకు భీకర ప్రతిఘటన

అమెరికా`ఇజ్రాయిల్ విధ్వంసకాండకు భీకర ప్రతిఘటన

- Advertisement -

డ్రోన్లతో విరుచుకుపడుతున్న ఇరాన్
అమెరికా దౌత్య కార్యాలయాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా భారీ దాడులు

తెహ్రాన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అంతకంతకూ తీవ్రతరమవుతున్నాయి. గంట గంటకూ పరిస్థితి మారిపోతోంది. యుద్ధోన్మాదంతో చెలరేగుతున్న అమెరికా, ఇజ్రాయిల్‌ను నియంత్రించేందుకు ఇరాన్ దాడులు చేస్తోంది. గల్ఫ్‌లో అమెరికా మిత్రదేశాలైన ఖతార్, యూఏఈ, కువైట్, బహ్రైయిన్, సౌదీ అరేబియాలపై డ్రోన్లతో విరుచుకుపడుతోంది. అమెరికా దౌత్య కార్యాలయాలు, సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలు, విలాసవంతమైన రెస్టారెంట్లు లక్ష్యంగా చేసుకొని డ్రోన్లతో దాడులు చేస్తోంది. మంగళవారం తెల్లవారుజామున బహ్రెయిన్‌లోని అమెరికా వైమానిక స్థావరానికి (షేక్ ఈసా బేస్) చెందిన ప్రధాన కమాండ్ కంట్రోల్ భవనాన్ని 20 డ్రోన్లు, 3 మిస్సైళ్లతో పేల్చేశామని ఇరాన్ ఐఆర్‌జీసీ ప్రకటించింది. సముద్ర జలాల్లో వివిధ ముడి చమురు ట్యాంకర్లకూ నిప్పు పెట్టామని ఐఆర్‌జీసీ పేర్కొంది. అమెరికా – ఇజ్రాయిల్ దాడులు కొనసాగినన్ని రోజులూ ఇరాన్ బలంగా ప్రతిఘటిస్తూనే ఉంటుందని ఐక్యరాజ్యసమితిలోని ఇరాన్ రాయబారి అమీర్ సయ్యిద్ ఇరావని తేల్చి చెప్పారు. మరోవైపు సౌదీ అరేబియా రాజధాని రియాద్ లో ఉన్న అమెరికన్ ఎంబసీపై రెండు డ్రోన్లతో ఇరాన్ దాడి చేసింది. ఈ ఘటనలో ఎంబసీ ఆవరణలో మంటలు చెలరేగగా, భవనానికి స్వల్ప నష్టం వాటిల్లింది. దౌత్య కార్యాలయాలపైనే నేరుగా దాడులు జరగడం యుద్ధ తీవ్రతను తెలియజేస్తోంది. మరోవైపు ఒమన్‌లోని దుక్మ్ పోర్ట్‌పై కూడా డ్రోన్ దాడి జరగడంతో ఇంధన ట్యాంక్ దెబ్బతింది. మరో వైపు ఇరాన్ వ్యూహాత్మకంగా హర్ముజ్ జలసంధిని మూసి వేసింది. నౌకలు దాటడానికి ప్రయత్నిస్తే తగలబెడతామని ఐఆర్‌జీసీ హెచ్చరించింది. ఇరాన్ చర్యతో హార్ముజ్ స్ట్రెయిట్ దగ్గర 700 లకు పైగా నౌకలు చిక్కుకుపోయాయి. వాటిలో 100 కంటైనర్ షిప్స్ ఉన్నాయి. మరో కీలక పరిణామం ఏంటంటే… చైనా కూడా యుద్ధంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా సంకేతాలు ఇచ్చింది. తాజాగా ఇరాన్‌కు మద్దతుగా గళం విప్పింది. ఇరాన్ సార్వభౌమాధికారాన్ని కాపాడతామని ప్రకటించింది. తక్షణమే అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం ఆపాలని చైనా సూచించింది. మరోవైపు ఇజ్రాయిల్ తెహ్రాన్‌లోని సైనిక లక్ష్యాలపై విరుచుకుపడింది. తెహ్రాన్ తూర్పున ఉన్న పార్డిస్ ప్రాంతంలో భారీ పేలుళ్లు సంభవించగా… నగరం మొత్తం పొగతో నిండిపోయింది. ఇజ్రాయిల్ అటు లెబనాన్ రాజధాని బీరుట్ దక్షిణ శివార్లలోనూ భవనాలను నేలమట్టం చేస్తోంది. దీనికి దీటుగా హిజ్బుల్లా కూడా గోలాన్ హైట్స్, మెరాన్, రమత్ డేవిడ్ వైమానిక స్థావరాలపై క్షిపణి దాడులు చేసింది. ఈ యుద్ధం కారణంగా సామాన్యులు బలవుతున్నారు. ఇరాన్‌లో ఇప్పటివరకు 787 మంది మరణించగా, అందులో 176 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. అటు అమెరికా వైపు ఆరుగురు సైనికులు మరణించారు. అమెరికా సైనికుల మరణాన్ని యూఎస్ సెంట్రల్ కమాండ్ కూడా ధృవీకరించింది.
ఇజ్రాయిల్ వైమానిక స్థావరంపై హిజ్బుల్లా దాడి
మంగళవారం తెల్లవారుజామున ఇజ్రాయిల్‌లోని రమత్ డేవిడ్ వైమానిక స్థావరంపై లెబనాన్‌లోని హిజ్బుల్లా మిలిటెంట్లు డ్రోన్లతో దాడులు చేశారు. పెద్దసంఖ్యలో డ్రోన్లు ఈ వైమానిక స్థావరంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లపై పడ్డాయంటూ అల్ జజీరా కథనం తెలిపింది. సోమవారం లెబనాన్‌పై ఇజ్రాయిల్ చేసిన దాడులకు ప్రతిగా, హిజ్బుల్లా ఈ దాడులు చేసిందని పేర్కొంది. కాగా, మంగళవారం తెల్లవారుజామున బీరుట్ నగరంలోని హిజ్బుల్లా అనుబంధ టీవీ ఛానల్ అల్ మనార్‌పై ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో ఆ టీవీ ఛానల్ భవనం తీవ్రంగా దెబ్బతింది. అయినప్పటికీ ఈ ఎటాక్ జరిగిన కొన్ని నిమిషాలకే, ఆ ఛానల్ మళ్లీ ప్రసారాలను మొదలుపెట్టింది. కాగా లెబనాన్ రాజధాని బీరుట్‌లోని హెజ్‌బొల్లా కమాండ్ సెంటర్ సహా ఆయుధ నిల్వ కేంద్రంపై దాడి చేసినట్లు ఇజ్రాయిల్ సైన్యం తెలిపింది. పలస్తీనా ఇస్లామిక్ జిహాద్‌కు చెందిన కమాండర్ అబు హమ్జాను బీరుట్‌లో హతమార్చామని వెల్లడించింది. బీరుట్ శివార్లు, దక్షిణ లెబనాన్‌లో రాత్రిపూట జరిగిన దాడుల్లో కనీసం 52 మంది మరణించారని, 154 మంది గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదించింది.
ఇరాన్ కమాండ్ కంట్రోల్ సెంటర్లను ధ్వంసం చేశాం: అమెరికా
ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) కమాండ్ కంట్రోల్ సెంటర్లను ధ్వంసం చేశామని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఇరాన్ సైన్యం, ఐఆర్‌జీసీలకు చెందిన కీలకమైన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకొని మంగళవారం ఉదయం దాడులు చేశామని వెల్లడించింది. ఈ దాడుల్లో ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలు, మిస్సైళ్లు, డ్రోన్ల లాంచ్ ప్యాడ్లు, వైమానిక స్థావరాలు కూడా ధ్వంసం అయ్యాయని తెలిపింది. ఇరాన్ నుంచి తమకు పొంచి ఉన్న ముప్పును నివారించేందుకు ఈ దాడులను కొనసాగిస్తామని అమెరికా సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. బీ-1 బాంబర్ విమానాలతో ఇరాన్‌లోని బాలిస్టిక్ మిస్సైల్ తయారీ, నిల్వ యూనిట్లపైనా దాడులు చేసినట్లు తెలిపింది.
సౌదీ, బహ్రెయిన్, జోర్డాన్‌లలో అమెరికా అడ్వైజరీలు
సైనిక ఘర్షణ తీవ్రరూపు దాలుస్తున్న వేళ సౌదీ అరేబియా, బహ్రెయిన్, జోర్డాన్‌లలో అమెరికా ముఖ్యమైన అడ్వైజరీలను జారీ చేసింది. బహ్రయిన్, జోర్డాన్‌లలోని అమెరికా సైనిక స్థావరాల్లో ఉన్న నాన్ – ఎమర్జెన్సీ విభాగాల సిబ్బంది, వారి కుటుంబాలు వెంటనే స్వదేశానికి వచ్చేయాలని అమెరికా విదేశాంగ శాఖ ఆదేశించింది. వారి భద్రతకు ముప్పు ఉన్నందునే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని తెలిపింది. కాగా అమెరికా రాయబార కార్యాలయంపై ఇరాన్ దాడిని సౌదీ అరేబియా రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. రియాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై రెండు డ్రోన్‌లతో దాడి చేసిందని.. దీంతో రాయబార కార్యాలయం లోపల మంటలు చెలరేగాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
లెబనాన్‌పై భూతల దాడులకు ఇజ్రాయిల్ సిద్ధం
ఇప్పటి వరకూ తమ ప్రాంతాలను నుండే శత్రు దేశంలోకి దాడి చేసిన ఇజ్రాయిల్ ఇప్పుడు గ్రౌండ్ లెవల్లో తమ దేశ సైన్యాన్ని రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. లెబనాన్‌పై పదాతిదళాల ఆపరేషన్‌కు ఇజ్రాయిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రౌండ్ ఆపరేషన్ వార్తలను ఇజ్రాయిల్ రక్షణ మంత్రి కట్జ్ ధృవీకరించారు. దీంతో ఇజ్రాయిల్ సైన్యం హిజ్బుల్లా టార్గెట్‌గా దక్షిణ లెబనాన్‌లోకి దూసుకెళుతున్నాయి. దీంతో యుద్ధం మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం కీలక ప్రకటన చేశారు. ఇప్పటి వరకు అమెరికా కేవలం కంబాట్ దాడులే చేసిందని అవసరమైతే అమెరికా సైన్యాన్ని ఇరాన్‌కు పంపిస్తాం. ప్రత్యక్ష యుద్ధం చేస్తామని హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు