అస్సాం ముఖ్యమంత్రి హేమంత బిశ్వశర్మ విద్వేష ప్రసంగాలను, చర్యలను నిలిపి వేయించాలని పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జోయ్ మాల్య బాగ్చీ, విపుల్ పంచోలీతో కూడిన బెంచి పిటిషనర్లు ముందు అస్సాం హైకోర్టుకు వెళ్లాల్సిందని సూచించింది. అయితే ఈ పిటిషన్‌ను ఎందుకు విచారణకు స్వీకరించడం లేదో న్యాయమూర్తులు వివరించారు. ఈ వివరణలోనూ విచిత్రమైన అంశాలు ఉన్నాయి. పిటిషన్లను నిరాకరించడానికి సుప్రీంకోర్టు విచిత్రమైన కారణాలు చూపించింది. అస్సాం శాసనసభకు మార్చ్ లేదా ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగనున్నాయి కనక ఈ పిటిషన్లు దాఖలు చేశారని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ముందు అస్సాం హైకోర్టును ఆశ్రయించి ఉండాల్సిందని ప్రధాన న్యాయమూర్తితో కూడిన పీఠం అభిప్రాయపడింది. అంతకన్నా ఆదేశించింది అనడమే మేలేమో. అంటే భవిష్యత్తులో కూడా సుప్రీంకోర్టు ఇలాంటి పిటిషన్లను విచారించదు అనుకోవాల్సిందేనా? అయిన దానికి కాని దానికి సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసి హైకోర్టుల నైతిక స్థైర్యాన్ని దిగజరుస్తున్నారని కూడా అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పుడల్లా సుప్రీంకోర్టుకు వస్తున్నారని కూడా న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ఎన్నికలు జరగాల్సి ఉంటే జరగొచ్చు కానీ హేమంత బిశ్వశర్మ విద్వేష పూరిత మాటల్లాంటి సమస్య ఎదురైనప్పుడు ప్రాథమిక హక్కులను పరిరక్షించుకోవడానికి రాజ్యాంగమే హక్కు కల్పించింది. పైగా ఎన్నికలు పరస్పర గౌరవభావంతో, స్వీయ నియంత్రణతో నిర్వహించుకోవాలని న్యాయమూర్తులు సలహా ఇచ్చారు. ఈ మాట చెప్పినప్పుడు అత్యున్నత న్యాయస్థానం హేమంత బిశ్వశర్మ విపరీత వ్యాఖ్యలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదో. ఎన్నికలకు సంబంధించిన విషయంలో న్యాయమూర్తులు చెప్పిన విషయంలో సబబు ఉంటే ఉండొచ్చు కానీ హేమంత బిశ్వశర్మ వ్యాఖ్యలు విద్వేషంతో కూడినవని సుప్రీంకోర్టుకు తట్టి ఉండాలి గదా! ఇదే సుప్రీంకోర్టు ఎవరైనా విద్వేషం రెచ్చగొడ్తూ ఉంటే వెంటనే ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా ప్రభుత్వాలు చర్య తీసుకోవాలని చెప్పింది. హేమంత బిశ్వశర్మ నోటిని అదుపులో పెట్టుకోకపోతే చర్య తీసుకోవలసిన బాధ్యత సుప్రీంకోర్టుదే కదా! ఎందుకంటే ఇలాంటి విషపూరిత ప్రసంగాలు సమాజాన్ని విడదీస్తాయి. హేమంత బిశ్వశర్మ రెచ్చిపోతున్నది కూడా అస్సాంలో త్వరలో జరగాల్సి ఉన్న శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే అన్నది దాచినా దాగని సత్యం. సీపీ(ఎం), సీపీఐ నాయకురాలు అన్నీ రాజా, అస్సాం నుంచి మరో నలుగురు దాఖలు చేసిన పిటిషన్ల వ్యవహారం చర్చకు వచ్చినప్పుడు సుప్రీం కోర్టు విచారించడానికి నిరాకరించింది. అంటే ప్రాథమిక హక్కులకు సంబంధించిన కేసులను విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించకపోతే ఇక దిక్కేమిటి? ముందు హైకోర్టుకు వెళ్లాలి అని న్యాయమూర్తులు అన్నప్పుడు అస్సాం హైకోర్టుకు కాకుండా మరో హైకోర్టుకు వెళ్లే అవకాశం ఇవ్వాలని ప్రసిద్ధ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ చేసిన విజ్ఞప్తిని కూడా న్యాయమూర్తులు ఒప్పుకోలేదు. ఏ వ్యవహారమైనా సుప్రీంకోర్టుకు వస్తే అది మీడియాలో ప్రముఖంగా వస్తుందని సుప్రీంకోర్టు అనడం వింతగా ఉంది. ఆ మాటకొస్తే సుప్రీంకోర్టు నిరాకరించడం కూడా వార్తలకెక్కే విషయమే అవుతుందిగా! ప్రాథమిక హక్కుల కోసం పాటుపడే సామాజిక కార్యకర్త హర్ష్ మందర్‌పై అస్సాం ముఖ్యమంత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన మీద కేసులు మోపుతామని పోలీసులు చెప్పారట. ఆ కేసులేవో అస్సాంలోనే పెడితే ఎలాంటి స్పందన ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హేమంత్ రాజ్యాంగం మీద ప్రమాణం చేసే ముఖ్యమంత్రి అయ్యారు. ఆ ప్రమాణాన్ని ఉల్లంఘించి నోటికొచ్చినట్టు మాట్లాడడం సుప్రీంకోర్టుకు తప్పనిపించకపోవడం ఆశ్చర్యకరమే. రాజ్యాంగాన్ని ఉల్లంఘించే, సమాజాన్ని విచ్ఛిన్నం చేసే మాటలు మాట్లాడుతున్నప్పుడు సుప్రీంకోర్టు మీద చివరి నమ్మకం పెట్టుకుంటాం. దానికీ సుప్రీంకోర్టు చొరవ తీసుకోకపోవడం అదీ అనేక పిటిషన్లు దాఖలైనప్పుడు హైకోర్టుకు వెళ్లమనడం ఏ లెక్కన చూసినా సమంజసం అనిపించడం లేదు. ఇది సుప్రీంకోర్టుకు ఏవో దురుద్దేశాలు అంటగట్టాలనే ఉద్దేశంతో కాదు. రాజ్యాంగ పరిరక్షణ అంతిమంగా సుప్రీంకోర్టు బాధ్యతే. అప్ప్పుడైనా రాజ్యాంగంలోని 32వ అధికరణం ప్రకారం ఈ పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించి ఉండవలసింది. అదీ లేదు. ఇంతకన్నా చిన్న వ్యవహారాలు 17 ఉన్నాయని న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ గుర్తు చేశారు. మరో హైకోర్టుకు వెళ్లే అవకాశం ఇవ్వాలన్న సింఘ్వీ మాట సైతం న్యాయమూర్తులకు నచ్చినట్టు లేదు. సింఘ్వీ ఈ మాట చెప్పినప్పుడు “ఇది దురదృష్టకరమైన వాదన. మేం పరిష్కరించవలసిన కేసులు మాకు ఉన్నాయి” అని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. కింది కోర్టుల నుంచి అత్యున్నత న్యాయస్థానం దాకా లక్షలాది కోర్టులు అపరిష్కృతంగా మిగిలి పోతున్నాయి. అవన్నీ పరిష్కరించే దాకా ఇలాంటి కేసులను విచారించబోం అనడం విచిత్రంగా ఉంది.హేమంత బిశ్వశర్మ ప్రేలాపనలు కేవలం అస్సాంకే పరిమితం కాలేదు. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లో కూడా ఇలాంటి ప్రసంగాలే చేస్తున్నారు. దేశం అంతటా బీజేపీ నేతల విద్వేష భాషణలు మార్మోగుతున్నాయి.
ఈ విద్వేషం మొత్తం దేశాన్నే ఛిన్నాభిన్నం చేస్తోంది. ముఖ్యమంత్రే విద్వేష ప్రసంగాలు చేస్తున్నారు కనక తమంత తాము ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని గౌహతి హైకొర్టుకు లేఖ రాశామని కానీ ఏ చర్యా తీసుకోలేదని అస్సాంకు చెందిన నలుగురి తరఫున వాదిస్తున్న న్యాయవాది చందర్ ఉదయ్ సింగ్ ప్రధాన న్యాయమూర్తితో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల బెంచికి విన్నవించారు. అప్పుడూ ప్రధాన న్యాయమూర్తి తీవ్రంగానే స్పందించారు. లేఖ రాయడం వేరు, పిటిషన్లు దాఖలు చేయడం వేరు. దీన్నిబట్టి హైకోర్టుకెళ్లినా ఫలితం ఉంటుందన్న హామీ ఎక్కడ నుంచి వస్తుంది? హేమంత బిశ్వశర్మ విద్వేష ప్రసంగాలపై సాధారణ వ్యాఖ్యలైనా చేయాలని అభిషేక్ సింఘ్వీ విజ్ఞాపన కూడా న్యాయమూర్తులు పట్టించుకున్నట్టు లేదు. అస్సాం ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం కిందకైనా రావాలిగా! 2021 నుంచి 2026లో ఇప్పటివరకు హేమంత చేసిన వ్యాఖ్యలను పిటిషనర్లు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అస్సాం ముఖ్యమంత్రి బెంగాల్ కు చెందిన ముస్లింలను సామాజికంగా, ఆర్థికంగా వెలివేయాలని అన్నారు. అదీ తీవ్రమైన విద్వేష ప్రసంగం కాకుండా ఎలా పోతుంది. ముస్లింలకు జీవనోపాధి, రవాణా సదుపాయాలు, భూమి, ఓటింగ్ హక్కు లేకుండా చేయాలని కూడా అస్సాం ముఖ్యమంత్రి అన్నారు. రిక్షావాలాకు అయిదు రూపాయలు ఇవ్వాల్సి ఉంటే నాలుగు రూపాయలే ఇవ్వాలని కూడా అన్నారు. ఇవన్నీ బాహాటంగా విద్వేషం రెచ్చగొట్టేవే.
సుప్రీం కోర్టే కాదంటే దిక్కెవరు!
- Advertisement -


