డా.రామకృష్ణ సూర్యదేవర
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి తరతరాలుగా, కోట్లాది మంది భారతీయులు చెమటోడ్చి, పన్నులు కట్టి, ఎన్నో త్యాగాలు చేసి నిర్మించుకున్న మన ప్రజా ఆస్తులు ఇవాళ ఒక్కసారిగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇది కేవలం దేశ ఆర్థిక అవసరమా ? లేక ఒక పక్కా వ్యూహమా ? ఈ ప్రశ్న ఇవాళ ప్రతి సామాన్యుడి గుండెను తొలుస్తోంది. నెహ్రూ, పటేల్ వంటి మన పెద్దలు కన్న కలల భారతాన్ని నిజం చేయడంలో మన ప్రభుత్వ రంగ సంస్థలు పిఎస్‌యూలు వెన్నెముకగా నిలిచాయి. ఇనుము, ఉక్కు తయారీనుంచి విమానాల వరకు, కరెంటు నుండి బ్యాంకింగ్ వరకు, ప్రతి అడుగులోనూ మన పిఎస్‌యూలే పునాది వేసి దేశాన్ని నడిపించాయి. భిలాయి, బొకారో, రూర్కెలా ఉక్కు కర్మాగారాలు మన పారిశ్రామిక శక్తికి ప్రతీకలు బిఎసఎనఎల్, ఎంటీఎనఎల్, బిపిసిఎల్, ఐఓసీ వంటి సంస్థలు లక్షలాది కుటుంబాలకు కూడు పెట్టాయి, భరోసానిచ్చాయి. కానీ ఇవాళ పరిస్థితి ఏంటి? మన కళ్ల ముందే మన సంస్థలను ఒక్కొక్కటిగా అమ్మేస్తున్నారు. భారత్ పెట్రోలియం, ఎయిర్ ఇండియా, షిప్పింగ్ కార్పొరేషన్, ఇలా జాబితా చాంతడంత ఉంది. ఒక్కో సంస్థ అమ్ముడవుతుంటే, దేశ సంపద ఒక్కొక్కటిగా కరిగిపోతున్నట్టే లెక్క. 1932లో జేఆర్డీ టాటా మొదలుపెట్టిన ఎయిర్ ఇండియా, మన దేశానికే ఒక గర్వకారణం. విదేశీ గడ్డపై ఆ విమానాన్ని చూస్తే ప్రతి భారతీయుడి గుండె ఉప్పొంగేది. కానీ కొందరి మేనేజ్మెంట్ లోపాలు, రాజకీయ జోక్యం ఆ సంస్థను నష్టాల ఊబిలోకి నెట్టేశాయి. చివరికి 2021లో కేవలం 18వేల కోట్లకు మళ్ళీ టాటాలకే అమ్మేశారు. ఆలోచించండి, ఆ సంస్థకున్న విమానాలు, ఎయిర్పోర్ట్ స్లాట్లు, ఆ బ్రాండ్ వాల్యూ అంతా కలిపితే 18 వేల కోట్లు అంటే చాలా తక్కువ. చెప్పాలంటే, మన రైతులకు ఇచ్చే ఒక్క ఏడాది రుణమాఫీ కంటే అది తక్కువ మొత్తం! ప్రైవేటీకరణ జరిగితే సేవలు అద్భుతంగా ఉంటాయన్నారు. కానీ ఇప్పుడు ఏమవుతోంది? విమాన ప్రయాణం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఏళ్ల తరబడి పనిచేసిన పాత ఉద్యోగులకు భద్రత లేకుండా పోయింది. ఒకప్పుడు సామాన్యుడికి అందుబాటులో ఉన్న విమానం, ఇప్పుడు మధ్యతరగతి మనిషికి కలలా మిగిలిపోతోంది. అలానే మన భారతీయ రైల్వే అంటే కేవలం పట్టాల మీద వెళ్లే బండి కాదు, అది మన దేశ ప్రాణం. రోజూ కోట్లాది మందిని తమ గమ్యస్థానాలకు చేర్చే ఒక నమ్మకం. భారీ నెట్వర్క్ దీని సొంతం ప్రతిరోజూ 2.3 కోట్ల మంది ప్రయాణికులు, 13 లక్షల మంది ఉద్యోగులు పేద, ధనిక అనే తేడా లేకుండా అందరినీ సమానంగా చూసే ఒకే ఒక్క వ్యవస్థ ఇది.
కానీ గత కొన్నేళ్లుగా రైల్వేలో ప్రైవేటీకరణ నిశ్శబ్దంగా చొరబడుతోంది. తేజస్, వందే భారత్ వంటి ప్రీమియం రైళ్లను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించడం దగ్గరి నుండి, స్టేషన్ల మెయింటెనెన్స్, క్యాటరింగ్, క్లీనింగ్ వరకు అన్నీ ప్రైవేట్ సంస్థల పరమవుతున్నాయి. దీనివల్ల మార్పులు కనిపిస్తున్నాయా అంటే, ఖచ్చితంగా కనిపిస్తున్నాయి, కానీ అవి సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి,ధరల మోతతో ప్లాట్ఫారమ్ టికెట్ ధరలు పెరిగాయి. పాత కాలం నాటి ఉచిత తాగునీటి సౌకర్యాలు మృగ్యమవుతున్నాయి. విమానంతో పోటీతో పోటీగా ప్రైవేట్ రైళ్లలో ఏసీ కోచ్ ధరలు చూస్తుంటే విమాన ఛార్జీలకు ఏమాత్రం తక్కువ కాకుండా ఉన్నాయి. భవిష్యత్తుపై భయం ఒకవేళ రైల్వేలు పూర్తిగా ప్రైవేట్ చేతుల్లోకి వెళ్తే పరిస్థితి ఏంటి? పేదవాడికి దూరం ఇవి దూరం అవుతాయి ఎలా అంటే లాభాలు రాని గ్రామీణ ప్రాంతాల్లో రైళ్లను నిలిపివేస్తారు. దేశ ఐక్యత కూడా ప్రమాదం ఏర్పడవచ్చు అది ఎలా అంటే దేశంలోని మారుమూల ప్రాంతాలను కలిపే ఈ గొప్ప వ్యవస్థ ముక్కలైపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ఏమంటోందంటే, ప్రభుత్వ సంస్థలు నష్టాల్లో ఉన్నాయని, ప్రైవేటీకరణ చేస్తే పనితీరు మెరుగవుతుందని, ఖజానాకు డబ్బు వస్తుందని వాదిస్తోంది. కానీ సేవ ముఖ్యం అనుకున్న చోట లాభం వెతుక్కోవడం ఎంతవరకు కరెక్ట్ ? ప్రభుత్వం చెబుతున్న వాదనలు ఒకెత్తయితే, క్షేత్రస్థాయిలో వాస్తవాలు మరోలా ఉన్నాయి. ఆలోచించాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఓఎన్‌జీసీ, కోల్ ఇండియా, ఐఓసీ, ఎన్‌టీపీసీ ఇవన్నీ అద్భుతమైన లాభాల్లో నడుస్తున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం నష్టాల్లో ఉన్న కొన్ని సంస్థలనే సాకుగా చూపిస్తోంది. నిజానికి బిఎసఎనఎల్‌కి 4జి ఇవ్వడంలో ఆలస్యం చేయడం, ఎయిర్ ఇండియా నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడం వల్లే అవి వెనకబడ్డాయి. అంటే, మొదట చేతులెత్తేసేలా చేసి, తర్వాత అమ్మకానికి పెట్టడం ఎంతవరకు న్యాయం? అమ్మడం వల్ల వచ్చేది అప్పనంగా వచ్చే డబ్బు మాత్రమే! ఇంటి ఆస్తిని అమ్మేస్తే ఒకసారికి డబ్బు వస్తుంది, కానీ భవిష్యత్తులో వచ్చే ఆదాయం, ఆ ఆస్తిపై మనకున్న హక్కు రెండూ పోతాయి. ప్రభుత్వానికి వ్యాపారంతో పనిలేదు అనే మాట వినడానికి బాగుండొచ్చు కానీ, అది దేశ నిర్మాణం కంటే కార్పొరేట్ లాభాలకే పెద్దపీట వేస్తోంది. సామాన్యుడి నడ్డి విరుస్తున్న ధరలు, ప్రైవేటీకరణ వల్ల సేవలు మెరుగవుతాయని చెబుతారు, కానీ దాని వెనుక వచ్చే ఖర్చులు భయంకరంగా ఉన్నాయి. వైద్యం కోసం ప్రైవేట్ హాస్పిటల్లో అడుగుపెడితే లక్షలు గుమ్మరించాల్సిందే. మధ్యతరగతి వాడు జబ్బు పడితే అప్పులపాలవ్వాల్సిందేనా? చదువులో కూడా అలానే వుంది ఐఐఎం లాంటి సంస్థల్లో ఫీజులు 25 లక్షలు దాటాయి. పేదవాడికి నాణ్యమైన చదువు ఇక కలగానే మిగిలిపోవాలా? చివరకు నీటి సరఫరా కూడా వ్యాపారంగా మారిపోయింది. ఉద్యోగ భద్రత ఏది? పీఎస్‌యూలలో పనిచేసే లక్షలాది మందికి ఇప్పుడు నిద్రలేని రాత్రులు గడుస్తున్నాయి. ప్రైవేట్ చేతుల్లోకి వెళ్తే ఉద్యోగ భద్రత ఉండదు, పెన్షన్లు రావు, వర్క్ ప్రెజర్ పెరిగిపోతుంది. ఎయిర్ ఇండియాలో వేలాది మంది పరిస్థితి ఇప్పుడిదే. దేశ భద్రతకే ముప్పు ! పెట్రోలియం, రక్షణ, టెలికాం, బ్యాంకింగ్, ఇవి దేశానికి అత్యంత కీలకమైన రంగాలు. రేపు ఏదైనా యుద్ధమో, మహమ్మారో వచ్చినప్పుడు ప్రైవేట్ సంస్థలు దేశం కోసం పనిచేస్తాయా? లేక వాళ్ల లాభం కోసం చూస్తాయా? ప్రపంచవ్యాప్తంగా బ్రిటన్, జర్మనీ లాంటి దేశాలు ప్రైవేటీకరణ వల్ల దెబ్బతిని, మళ్ళీ ఆ సంస్థలను ప్రభుత్వ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నాయి. మనం కూడా వారి తప్పుల నుండి నేర్చుకోవాలి, రాజకీయ జోక్యం తగ్గించి అధికారులకు స్వేచ్ఛనివ్వాలి. టెక్నాలజీని పెంచి అవినీతిని అరికట్టాలి. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో మెరుగైన ఫలితాలు సాధించాలి. ఈ ప్రజా ఆస్తులు ఎవరో ఇచ్చినవి కావు, మన తాత ముత్తాతల కష్టం, మన పిల్లల భవిష్యత్తు. వీటిని కేవలం లాభాల కోసం కార్పొరేట్లకు కట్టబెట్టడం మన దేశ ఆత్మను అమ్ముకోవడమే. ప్రజల కోసం ప్రజా ఆస్తులా? లేక కార్పొరేట్ల కోసం ప్రజా త్యాగాలా? ఆలోచించండి, గొంతు ఎత్తండి, ఎందుకంటే నిర్ణయం మనది, భవిష్యత్తు కూడా మనదే !
సెల్ : 9490754169


