దోనేపూడి శంకర్
భారత కమ్యూనిష్టు పార్టీ (సీపీఐ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా కమ్యూనిస్టు సమితి నిర్వాహణలో పెనుగంచిప్రోలులో నిర్వహించిన రాష్ట్ర స్థాయి రాజకీయ-సైద్ధాంతిక శిక్షణ శిబిరం విజయవంతంగా ముగిసింది. ఉద్యమ చరిత్రలో ఈ శిక్షణ శిబిరం ఒక విశిష్ట ఘట్టంగా, పార్టీ నిర్మాణం, ఉద్యమ బలోపేతానికి ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. పార్టీ భావజాలంపై అవగాహనను విస్తృతం చేయడం, ప్రజా సమస్యలపై పోరాటాలకు సమర్థవంతమైన నాయకత్వాన్ని తీర్చిదిద్దడం, మతోన్మాద-ప్రతిఘాత శక్తుల దాడులను తిప్పికొట్టేందుకు ప్రజలను సంఘటితం చేయడం, ప్రజాస్వామ్య-లౌకిక విలువల పరిరక్షణకు ఉద్యమాలను విస్తరించడమే లక్ష్యంగా ఈ శిక్షణ శిబిరాన్ని సీపీఐ నిర్వహించింది. రాష్ట్రం నలుమూలల నుంచి హాజరైన పార్టీ నాయకులు, కార్యకర్తలు దేశ,రాష్ట్ర రాజకీయ పరిణామాలు, సీపీఐ ఉద్యమ చరిత్ర, వర్గ పోరాటాల అనుభవాలు, సమకాలీన సవాళ్లు, పార్టీ కార్యాచరణ దిశలపై అవగాహన పొందారు. శిబిరంలో జరిగిన అధ్యయనాలు, పరస్పర అనుభవాల మార్పిడి పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని, రాజకీయ స్పష్టతను, ఉద్యమ నిబద్ధతను పెంపొందించాయి. ప్రజాపోరాటాల నిర్మాణానికి అవసరమైన సైద్ధాంతిక దృఢత్వాన్ని, రాజకీయ చైతన్యాన్ని, ఉద్యమ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తూ ఈ శిక్షణ శిబిరం తన లక్ష్య సాధన దిశగా ముందడుగు వేసింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం, మతోన్మాదం-నయాఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలను విస్తృతం చేయాలనే సంకల్పంతో శిబిరం ముగిసింది. జూన్ 10 నుంచి 15 వరకు నిర్వహించిన రాజకీయ శిక్షణ తరగతులు ఉద్యమపరమైన దిశానిర్దేశాన్ని అందించాయి. ‘సైద్ధాంతిక పునాదిలేని పార్టీ మనజాలదు’అనే లెనిన్ సూక్తి ఆధారంగా ప్రారంభ దశల్లోనే రాజకీయ`సైద్ధాంతిక శిక్షణకు ప్రాధాన్యత ఇచ్చింది. 1937-38 ప్రాంతంలో నిర్వహించిన రాజకీయ శిక్షణ నుంచి ఆ సంప్రదాయం ప్రారంభమైనది. ఉమ్మడి కృష్ణాజిల్లాలో 1973లో పెనుగంచి ప్రోలులో నిర్వహించిన యువజన రాజకీయ పాఠశాల తర్వాత, ఇలాంటి పార్టీ రాష్ట్ర స్థాయి శిక్షణ శిబిరం 53 ఏళ్ల తర్వాత పెనుగంచిప్రోలు మళ్లీ నిర్వహించటం విశేషం. ఈ శిబిరాన్ని విజయవంతం చేయడానికి నెల రోజుల పాటు పక్కా ప్రణాళికతో సీపీఐ ఎన్టీఆర్ జిల్లా సమితి ఏర్పాట్లుచేపట్టింది. శిబిరం నిర్వహణ, వసతి, భోజన సదుపాయాలు, అధ్యయన సామాగ్రి, సెషన్ల నిర్వహణ తదితర అంశాలలో పార్టీ నాయకత్వం అత్యంత శ్రద్ధ చూపింది. ప్రారంభంలో కొందరు విద్యార్థులు/ ప్రతినిధులకు గ్రామీణ ప్రాంతంలో శిబిరం నిర్వహించడం వల్ల సౌకర్యాల విషయంలో సందేహాలు ఉన్నప్పటికీ, పెనుగ్రంచిప్రోలులోని స్నేహ గార్డెన్లోను, కేఎల్(కర్ల లింగయ్య) ఫంక్షన్ హాల్లోను కల్పించిన ప్రశాంత వాతావరణం, క్రమశిక్షణతో కూడిన ఏర్పాట్లు, స్నేహపూర్వక వాతావరణం వారిని ఆకట్టుకున్నాయి. చివరి రోజు వరకూ ప్రతి విద్యార్థి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని 28 జిల్లాల నుంచి పార్టీ నాయకులు, శ్రేణులు ప్రజాసంఘాల ప్రతినిధులు కలిపి దాదాపు 300 మంది హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతోపాటు కొందరు నేతలు ఆహ్వానితులుగా విచ్ఛేశారు. ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సెషన్లలో వివిధ రంగాల నిపుణులు, మేధావులు, అధ్యాపకులు, ఉద్యమ నాయకులు బోధనలు నిర్వహించారు. జూన్ 10న జరిగిన ప్రారంభ కార్యక్రమంలో సీనియర్ కమ్యూనిస్టు పార్టీ నాయకులు, విశాలాంధ్ర పూర్వపు సంపాదకులు కామ్రేడ్ ఈడ్పుగంటి నాగేశ్వరరావు శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఉద్యమ చరిత్రలో పశ్చిమకృష్ణా ప్రాంతంలో పెనుగంచిప్రోలు వీరులపాడు ప్రాంతం పోషించిన చారిత్రక పాత్రను ఆయన స్మరించుకున్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలో విప్లవ యోధులకు ఈ ప్రాంతం ఆశ్రయ కేంద్రంగా నిలిచి, ప్రజావిముక్తి పోరాటాలకు బలమైన అండగా నిలిచిందని గుర్తుచేశారు. జిల్లా పార్టీ సీనియర్ నాయకులు కామ్రేడ్ వల్లంకొండ బ్రహ్మం పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. ఎర్రజెండా రెపరెపల మధ్య ప్రారంభమైన శిబిరం ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించింది. అదే రోజు సాయంత్రం ‘వీక్షణ’ సంపాదకులు ఎన్.వేణుగోపాల్ ‘మార్కిస్జం-సమాజ భవిష్యత్తు’ అంశంపై లోతైన ఉపన్యాసం చేశారు. ‘భారత దేశంలో ప్రతిఘాత భావజాలం-హిందూత్వ తాత్విక, సాంస్కృతిక మూలాలు’ అంశంపై ప్రసంగిస్తూ..మతోన్మాద రాజకీయాల వెనుక దాగి ఉన్న వర్గప్రయోజనాలను, ప్రజాస్వామ్య, లౌకిక విలువలపై వాటి దాడులను విశ్లేషించారు. 11న ప్రముఖ ఆర్థికవేత్త, రాజకీయ విశ్లేషకుడు డాక్టర్ పరకాల ప్రభాకర్ ‘ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ-పర్యవసానాలు’ అంశంపై బోధించారు. ఎన్నికల వ్యవస్థ స్వతంత్రతపై పెరుగుతున్న ముప్పులను, ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచే ధోరణులను, ఎన్నికల ప్రక్రియలో అధికార జోక్యాన్ని విశ్లేషిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అప్రమత్తత అవసరమని పిలుపునిచ్చారు. ‘గతితార్కిక, చారిత్రక భౌతికవాదం’ అంశంపై విశాలాంధ్ర సంపాదకులు ఆర్వీ.రామారావు పాఠం చెప్పారు. 12న భారతీయ భౌతిక వాద సంప్రదాయాలు, వాటి వారసత్వంపై ముత్తేవి రవీంద్రనాథ్ ప్రసంగించారు. మార్కిస్జం-పర్యావరణం అంశంపై రివేర మాట్లాడుతూ పెట్టుబడిదారీ అభివృద్ధి నమూనా ప్రకృతి సంపదల విధ్వంసానికి, పర్యావరణ సంక్షోభాలకు ఎలా కారణమవుతుందనేదీ విశ్లేషించారు. భారత కమ్యూనిస్టు ఉద్యమ నూరేళ్ల చరిత్ర, దాని త్యాగాలు, పోరాట సంప్రదాయాలు, భారత కమ్యూనిస్టు పార్టీ కార్యక్రమం గురించి సీపీఐ జాతియ సమితి కార్యదర్శి బీసీ కాంగో, ప్రొఫెసర్ రాజశేఖర్ అవగాహన కల్పించారు. 13న ‘19వ, 20వ శతాబ్దాల్లో బ్రాహ్మణీయ వ్యతిరేక ఉద్యమాలు-జ్యోతిరావుపూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, పెరియార్ పాత్ర’ అంశంపై ప్రొఫెసర్ కె.శ్రీనివాసులు ఉపన్యసించారు. కుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా సాగిన సామాజిక విముక్తి ఉద్యమాల చారిత్రక ప్రాధాన్యతను వివరించారు. కులగణన అవసరం, సామాజిక న్యాయం సాధనలో దాని పాత్రపై ప్రొఫెసర్ అంజిరెడ్డి మాట్లాడారు. ‘భారతదేశంలో మతం-మార్కిస్జం-లౌకికవాదం’ అంశంపై ఆయన చేసిన విశ్లేషణ పాల్గొన్న ప్రతినిధుల్లో చర్చకు దారితీసింది. మార్క్సిస్టు ఆర్థికశాస్త్రంపై పి.భరత్ సమగ్ర బోధనలు నిర్వహించారు. 14న ‘1990ల తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ పరిణామం-భవిష్యత్తు’ అంశంపై ప్రొఫెసర్ ఆర్.రమణమూర్తి ప్రసంగించారు. పార్టీ నిర్మాణం, ప్రజా సంఘాల బలోపేతం, ఉద్యమాల విస్తరణపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జేవీ.సత్యనారాయణమూర్తి బోధించారు. అంతర్జాతీయ, సామ్రాజ్యవాద దాడులు, యుద్ధోన్మాద రాజకీయాలు, కార్పొరేట్ ఆధిపత్యం ప్రపంచవ్యాప్తంగా మానవాళికి పెనుముప్పుగా మారుతున్నా యని, ప్రజల ఐక్యపోరాటాల ద్వారానే ఈ సవాళ్లను ఎదుర్కోగలమని పిలుపునిచ్చారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ప్రజాసమస్యలు, సీపీఐ రాజకీయ వైఖరిపై సీపీఐ జాతీయ సమితి కార్యదర్శి కె.రామకృష్ణ వివరించారు. శిక్షణ తరగతుల ముగింపు సందర్భంగా పెనుగ్రంచిప్రోలు సెంటర్ నుంచి మున్నేరు వాగు, స్నేహ గార్డెన్స్ వరకు భారీ ఎర్రదండు ప్రదర్శన కొనసాగింది. వందలాది మంది కామ్రేడ్లు క్రమశిక్షణతో, ఉద్యమస్ఫూర్తితో పాల్గొన్న ఈ ప్రదర్శన పెనుగ్రంచిప్రోలు ప్రాంతాన్ని ఎర్రజెండాలతో నింపివేసింది. మున్నేరు వంతెన పొడవునా రెపరెపలాడిన ఎర్ర జెండాలు కమ్యూనిస్టు ఉద్యమ వారసత్వాన్ని, శ్రమజీవుల విముక్తి కోసం సాగుతున్న పోరాట స్ఫూర్తిని చాటిచెప్పాయి. ప్రజాసమస్యల పరిష్కారమే తమ రాజకీయ కార్యాచరణకు కేంద్రబిందువని, కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, యువత, మహిళల హక్కుల పరిరక్షణ కోసం పోరాటాలను ఉధృతం చేస్తామనే దృఢసంకల్పాన్ని ఈ ఎర్రదండు ప్రతిధ్వనించింది. మతోన్మాద, కార్పొరేట్ అనుకూల, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ ప్రజారాజకీయాల నిర్మాణంలో కమ్యూనిస్టు శ్రేణులు చైతన్యంతో, సంఘటిత శక్తిగా ముందుకు సాగుతున్నాయనే సందేశాన్ని ఈ ప్రదర్శన స్పష్టంగా ప్రజలకు చాటింది. ఈ ప్రదర్శనకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ గుజ్జుల ఈశ్వరయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కామ్రేడ్ దోనేపూడి శంకర్, ఇతర రాష్ట్ర జిల్లా నాయకులు నాయకత్వం వహించారు. ఎర్రజెండా కింద ఐక్యమైన కార్యకర్తల అడుగులు భవిష్యత్తు ప్రజా పోరాటాలకు నాంది పలుకుతూ ఉద్యమ ప్రస్థానానికి కొత్త ఉత్సాహాన్ని నింపాయి. క్రమశిక్షణకు నిబద్ధతకు, మారుపేరైన పెనుగంచిప్రోలు మండల పార్టీ శ్రేణులు దృఢ సంకల్పంతో తరగతులను జయప్రదం చేయటంలో కీలకపాత్ర వహించారు. పార్టీ నాయకత్వం తమ కుటుంబ సభ్యులతో కలిసి రాజకీయ తరగతులకు విచ్చేసిన విద్యార్థులకు ఆతిథ్యం ఇవ్వటంలో కమ్యూనిస్టు ఆప్యాయతను కనపరిచారు. ఈ సందర్భంగా సీపీఐ సీనియర్ నాయకులు కామ్రేడ్ ఇంటూరి నాగేశ్వరరావు, భారతీ దంపతులకు జరిగిన చిరుసత్కారం ఉత్తేజాన్ని కలుగజేసింది. 20 రోజులు పాటు నాతో పాటు మండువేసవిలో సహకరించి వెన్నంటి ఉన్న ఎన్టీఆర్ జిల్లా పార్టీ నాయకులందరికీ కృతజ్ఞతలు. రాజకీయ శిక్షణ శిబిరం అనంతరం సీపీఐ రాష్ట్ర సమితి సమావేశం జరిగింది. రైతాంగం, కార్మికులు, వ్యవసాయ కూలీలు, నిరుద్యోగ యువత, మధ్య తరగతి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ జరిగింది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలను ఉధృతం చేయాలని నిర్ణయించారు. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం 30న ‘చలో విజయవాడ’ నిర్వహించాలని తీర్మానించింది. ఈ రాజకీయ-సైద్ధాంతిక శిక్షణ తరగతులు ఒక అధ్యయన కార్యక్రమంగానే కాకుండా,పార్టీ నిర్మాణాన్ని పటిష్ఠపరచడానికి, నూతన నాయకత్వాన్ని తీర్చి దిద్దడానికి, సిద్ధాంతపరమైన స్పష్టతను పదునుపెట్టడానికి, ప్రజా సమస్యలపై పోరాటస్ఫూర్తిని పెంపొందించడానికి పునాదిని వేశాయి. శిబిరంలో పాల్గొన్న ప్రతి కామ్రేడ్ పార్టీ దృక్పథాన్ని లోతుగా అవగాహన చేసుకుంటూ, ప్రజల జీవిత వాస్తవాలతో మమేకమవుతూ, పార్టీ-ప్రజల సంబంధాలను బలోపేతం చేస్తూ, శ్రమజీవుల హక్కుల సాధన కోసం జరిగే భవిష్యత్ పోరాటాలలో అగ్రభాగాన నిలిచే బాధ్యతను స్వీకరించాల్సిన అవసరముంది. నేటి పరిస్థితుల్లో కార్పొరేట్ అనుకూల విధానాలు, మతోన్మాద రాజకీయాలు, రాజ్యాంగ విరుద్ధ ధోరణులు, ప్రజాస్వామ్య సంస్థల బలహీనీకరణ, సామాజిక-ఆర్థిక అసమానతల పెరుగుదల వంటి సవాళ్లు దేశప్రజల ముందున్నాయి. ఈ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే రాజకీయ విద్య, సిద్ధాంతపరమైన దృఢత్వం, ప్రజలతో నిరంతర అనుబంధం, ఉద్యమ నిర్మాణ సామర్థ్యం, వర్గపోరాట దృక్పథం అవసరం. ప్రజా ఉద్యమాలను విస్తృతం చేస్తూ, శ్రమజీవి వర్గాల ఐక్యతను బలోపేతం చేస్తూ, లౌకిక-ప్రజాస్వామిక విలువలను పరిరక్షిస్తూ ముందుకు సాగాల్సిన చారిత్రక బాధ్యత కమ్యూనిస్టు శ్రేణులపై ఉంది. రాజకీయ-సైద్ధాంతిక శిక్షణ శిబిరం ఆ బాధ్యతను స్పష్టంగా చాటిచెప్పడమే కాకుండా, పార్టీశ్రేణుల్లో నూతనోత్సాహాన్ని, సైద్ధాంతిక నిబద్ధతను, పోరాట సంకల్పాన్ని నింపింది. కమ్యూనిస్టు ఉద్యమాన్ని బలోపేతం చేసే దిశగా, భవిష్యత్ ప్రజాపోరాటాలకు కార్యాచరణాత్మక మార్గదర్శకత్వాన్ని అందించిన ఈ శిబిరం పార్టీ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. ఆరు రోజుల పాటు సాగిన రాజకీయ సైదాంతిక శిక్షణా శిబిరానికి ఆర్థికంగా,హార్దికంగా సహకరించిన వారందరికీ ధన్యవాదాలు. – సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు
సీపీఐ రాజకీయ శిక్షణా తరగతులు విజయవంతం


