భారత రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులు, ప్రభుత్వ అధికారాలు, పోలీసు వ్యవస్థ జవాబుదారీతనం, న్యాయవ్యవస్థ పాత్ర పై ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తున్నది. దేశంలో ప్రజాస్వామ్య భవిష్యత్తు సంక్షోభంలోకి వెళుతున్నదనే ఆందోళన తీవ్రమైంది. జన సామాన్యపు ప్రాథమిక హక్కుల విషయంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరే అన్ని చోట్ల ప్రతిఫలిస్తోంది. ఇప్పుడు ఏపీలో ప్రధానంగా తీవ్ర చర్చకు దారితీసిన అంశాల్లో యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్ట్ ఒకటి కాగా మరొకటి విజయవాడలో వెలుగులోకి వచ్చిన కస్టోడియల్ డెత్ ఆరోపణల కేసు. ఈ రెండు సంఘటనలు వేర్వేరుగా కనిపించినప్పటికీ, లోతుగా పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వ అధికారాల వినియోగానికి రాజ్యాంగపరమైన హద్దులు లేవా అనే ప్రశ్న మన ముందుకొస్తోంది. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికలు కాదు. ప్రభుత్వం ప్రజల నుంచి వ్యక్తమయ్యే విమర్శలను వినడం, ప్రతిపక్షాలకు, పౌర ప్రజా సంఘాలకు మాట్లాడే అవకాశం ఉండడం, మీడియాకు ప్రశ్నించే స్వేచ్ఛ, పోలీసులు చట్ట పరిమితుల్లో వ్యవహరించడం, కోర్టులు స్వతంత్రంగా పనిచేయడం ఇవన్నీ కలిపే ప్రజాస్వామ్యానికి సరైన అర్థాన్నిస్తాయి. తాజా వరుస ఘటనల్ని చూస్తే ఇవన్నీ మృగ్యమైనట్టు కనిపిస్తోంది. హింసను ప్రేరేపించే ప్రసంగం చేసిన ఆరోపణలతో (ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ని విమర్శించడం) ప్రముఖ యూట్యూబర్ ప్రశ్న రావణ్ పై పెట్టిన దేశద్రోహం సహా వరుస కేసులు దేశవ్యాప్తంగా పెద్ద దుమారాన్ని లేపాయి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని, దాన్ని నడిపే నాయకులను విమర్శించడం దేశద్రోహం కాదు. ఒక వ్యక్తికి కోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత వరుసగా ఇతర కేసుల్లో మళ్లీ అరెస్టు చేయడం అవసరమా ? తమ విధానాలను విమర్శించారని, ప్రశ్నిస్తూ ఇబ్బంది కలిగించారనే కారణంతో ప్రభుత్వ పెద్దల మద్దతుతో పోలీసుల ద్వారా కఠిన చట్టాల వినియోగాన్ని ప్రోత్సహించడం సముచితం కాదు అని గుర్తించాలి. ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ పనితీరు చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తోంది. రక్షించాల్సిన వ్యవస్థే రాక్షసంగా మారుతోంది. గత కొన్ని రోజుల్లో వెలుగులోకి వచ్చిన అనేక సంఘటనలను గమనిస్తే ఏపీలో పోలీసు వ్యవస్థ ఎంత కరుకుగా మారిందో కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నది.
విజయవాడ సీఐ నాగరాజు పై వచ్చిన లాకప్ డెత్ వ్యవహారం పెద్ద దుమరం లేపింది. విజయవాడలో రౌడీ షీటర్ గాదె సాయికృష్ణ పోలీసు కస్టడీలో మరణించాడనే ఆరోపణలు రావడం, అనంతరం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ వెల్లడించిన అంశాలు ఆంధ్రప్రదేశ్‌లోనే కాక దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీశాయి. ఈ కేసులో కృష్ణలంక సీఐగా ఉన్న నాగరాజుపై హత్యతో పాటు ఇతర అభియోగాలు నమోదు కావడం, రిమాండ్ నివేదికలో కస్టోడియల్ డెత్ జరిగిందని సిట్ పేర్కొనడం పోలీసు వ్యవస్థలో లేని జవాబుదారీతనం, మానవ హక్కుల హననంపై కీలక ప్రశ్నలను లేవనెత్తాయి. నేరాన్ని విచారించే అధికారం చట్టం పోలీసులకు ఇచ్చినప్పటికీ హద్దులు దాటి శిక్షించే అధికారం లేదు. నేరం నిరూపితమైతే చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అధికారం మాత్రం కోర్టులకే ఉంది. కాబట్టి, ఒక వ్యక్తి పోలీసు కస్టడీలో మరణిస్తే అది ఒక నేర సంఘటన మాత్రమే కాదు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులపై ప్రత్యక్ష దాడిగా పరిగణించాలి. ఈ కేసులో గాదె సాయికృష్ణను అక్రమంగా నిర్బంధించి, విచారణ పేరుతో తీవ్రంగా హింసించడంతో అతడు మరణించాడని సిట్ తన రిమాండ్ నివేదికలో పేర్కొంది. కస్టడిలో హత్య చేసిన తర్వాత దానికి సంబంధం ఉన్న ఆధారాలను నాశనం చేయడానికి ప్రయత్నించారని, సీసీ టీవీ ఫుటేజ్ తొలగించినట్లు, మృతదేహాన్ని మాయం చేసినట్లు దర్యాప్తు అధికారులు కోర్టుకు తెలపడంతో రాష్ట్ర పోలీసు వ్యవస్థలో వేళ్లూనుకుని ఉన్న క్రూరత్వం బయటపడింది. భారత రాజ్యాంగంలోని జీవించే హక్కు (ఆర్టికల్ 21) ప్రతి వ్యక్తికి వర్తిస్తుంది. నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికీ అదే హక్కు ఉంటుంది. కస్టడీలో ఉన్న వ్యక్తిని హింసించడం లేదా వాళ్ల ప్రాణాలకు ముప్పు కలిగించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. కస్టోడియల్ డెత్‌లు ప్రజాస్వామ్య వ్యవస్థలో తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనే అనీ అత్యున్నత న్యాయస్థానం అనేక తీర్పుల్లో తేల్చి చెప్పింది. ఇదిలా ఉండగానే పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన మైనారిటీ ఉద్యోగి దరియా హుస్సేన్ ఆత్మహత్యకు కూడా ఇదే పోలీసు వ్యవస్థ కారణం అయిందనే ఆరోపణలు వచ్చాయి. 2018 నుంచి పిడుగురాళ్ల సిఐ తనను వేధిస్తున్నాడని ఆవేదనతో సూసైడ్ నోట్ రాసిన సదరు యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ నోట్లో సీఐ వేధింపులతోనే చచ్చిపోతున్నానని స్పష్టంగా రాశాడు. ఒక వ్యక్తి చనిపోయే ముందు తన మరణానికి కారణమైన వారి పేరు రాస్తే, పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి విచారణ చేయాలి. కానీ ఇక్కడ జరిగింది ఇందుకు భిన్నం. ఇది లాకప్ డెత్తో సమానమే. ఇదే పరంపరలో నెల్లూరు పోలీసులు ఒక హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారనే మరో ఘటన వెలుగు చూసింది. ఈ విషయం బయటపడడంతో 23 మంది పోలీసులను ఏకంగా బదిలీ చేశారు. కానీ ఆ బదిలీలు చేసిన 24 గంటల్లోనే మళ్లీ మరో లాకప్ డెత్ జరిగింది. ఇలా వరుస ఘటనలు జరుగుతున్నా పోలీసు అధికారుల్లో ఎలాంటి మార్పు లేకపోగా వారి దౌర¨న్యవం పెరిగిపోతోంది. మాలగంగమ్మ మృతికి కూడా కర్నూలు జిల్లా పోలీసుల వ్యవహార తీరే కారణమనే విషయంలోనూ ఆరోపణలు వచ్చాయి. కర్నూలు జిల్లాలోని బాదినహల్ గ్రామంలో 2024 నవంబర్‌లో మొదలైన మాల గంగమ్మ కేసు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గంగమ్మ కొడుకు వీరేంద్ర పొలం పనికి వెళ్లి కనిపించకుండా పోగా, పోలీసులు సరిగా దర్యాప్తు చేయడం లేదని గంగమ్మ హైకోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాలతో ఏర్పడిన సిట్ దర్యాప్తులో గంగమ్మ, ఆమె ప్రియుడు బేగారి దుర్గయ్య కలిసి కొడుకును హత్య చేసి పాతిపెట్టారని తేల్చారు. అయితే 2026 మే చివర్లో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. శవం ఆచూకీ చెప్పించడానికి గంగమ్మను ఆదోనిలోని సిట్ ఆఫీసులో 5 రోజులు నిర్బంధించి తీవ్రంగా చిత్రహింసలు పెట్టడంతోనే ఈ ఏడాది జూన్‌లో గంగమ్మ కర్నూలు ఆసుపత్రిలో మృతి చెందినట్టు ఆరోపణలు వచ్చాయి. పోలీసులు ఇది సహజ మరణమని చెబుతున్నా ఆమెది కష్టడి డెత్ అనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ తరహా వరుస కస్టోడియల్ డెత్‌ల విషయంలో ఏపీ పోలీసు వ్యవస్థ ప్రజా బోనులోకి ఎక్కడం తీవ్ర విచారకరం. ఇటీవల ఏపీ సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్ వజ్జా శ్రీనివాసరావు ఆర్టీఐ చట్టం అమలు తీరును పరిశీలించడానికి గుంటూరు జిల్లా మేడికొండూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. కానీ పోలీసులు ఆయనను స్టేషన్ లోపలికి కూడా రానివ్వలేదు. స్టేషన్ తలుపులు మూసి జిల్లా ఎస్పి అనుమతి ఉంటేనే లోపలికి రానిస్తామని తెగేసి చెప్పడం పోలీసుల అహంకారానికి నిదర్శనంగా మారింది. సమాచార కమిషన్ అనేది ఆర్టిఐ అనే చట్టం ద్వారా రూపొందిన రాజ్యాంగబద్ధమైన సంస్థ. ఆ సంస్థ అధిపతికే ఏపీ పోలీసులు మోకాలు అడ్డారు. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులే చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారు. జిల్లా ఎస్పి అనుమతి లేకుండా ఒక కమిషనర్ లోపలికి రాకూడదనే నిబంధన ఏ పోలీస్ మాన్యువల్‌లో ఉంది ? సమాచార కమిషనర్‌కే ఈ పరిస్థితి అయితే, సమాచారం కోరడానికి వెళ్లే సామాన్య పౌరుడి పరిస్థితి ఏమిటినేది ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న. ఈ అన్ని ఘటనలను పరిశీలన చేస్తే ప్రభుత్వ యంత్రాంగంలో జవాబుదారీతనం శూన్యమనే విషయం బయట పడుతోంది. పోలీసులు ఎంత ఘోరం చేసినా, నేరం చేసినా సాధారణ బదిలీతో సరిపెడతారనేది జనం గ్రహించిన అంశం. వారిపై క్రిమినల్ కేసు అనే మాటే ఉండకపోవడంతో తాము చట్టానికి అతీతులమనే భావన పోలీసుల్లో బలపడుతోంది. ఇదే ఈ తరహా వరుస ఘటనలకు ప్రధాన కారణం. పోలీసుల బాధితుల్లో ఎక్కువ మంది దళితులు, మైనారిటీలే ఉండడం అనేది పాలకుల వైఖరిని అద్దం పడుతున్నది. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలి. వరుసగా వెలుగులోకి వచ్చిన ఈ లాకప్ డెత్‌లపై, కస్టడీ వేధింపులపై స్వతంత్ర సంస్థలతో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలకు దిగితే తప్ప హక్కుల ఉల్లంఘనలు ఆగవు.
సెల్ : 9059837847
హక్కుల ఉల్లంఘనకు అంతమెప్పుడు ?
- Advertisement -


