ఇంతా చేసి ఇదంతా ప్రీ రిలీజ్లాంటిది. బెనిఫిట్ షో కాదు కానీ.. నాకు మాత్రమే దక్కిన బెనిఫిట్ కవిత్వం. పుస్తకంగా రాకముందే చదివి చెప్పండంటూ మందరపు హైమవతి గారు పంపిన నవ్వని నక్షత్రాల పువ్వుల ముళ్లతోట. చెప్పొద్దూ…! ఇవి చదువుతూంటే కాసింత కన్నీరు వచ్చింది. ఒకింత కోపం రగిలింది. ఆగ్రహావేశాల పుట్ట ఈ కవిత్వం అని కూడా అనిపించింది. తెలుగు సాహిత్యంలో లబ్దప్రతిష్టులైన కవయిత్రులు చాలా మందే ఉన్నారు. కానీ, మందరపు హైమవతి మాత్రం ఒకే ఒక్క కవితతో ఆ లబ్దప్రతిష్టులను దాటి చాలా దూరం వచ్చేశారు. అదే సర్పపరిష్వంగం. ఆ కవిత వచ్చిన సమయానికి నేను యవ్వనంలో ఉన్నాను. పెళ్లి కాలేదు. ఇక పెటాకులు ఎందుకంటుంది? అయితే, ఓ విషయం మాత్రం తెలిసింది ఆ సర్పపరిష్వంగం కవిత చదివాక. అదేంటంటే, బతికితే మనిషిలా బతకాలి కానీ మగాడిలా బతకకూడదని. రెంటికీ చాలా తేడా ఉంది. అదేంటో తెలియాలంటే సర్పపరిష్వంగం చదివి తీరాల్సింది. ఇదంతా పాత యవ్వారం. కొత్తగా మందరపు హైమవతి ప్రకటిస్తున్న నవ్వని నక్షత్రాలు కవిత్వ సంపుటిలో ప్రపంచాన్ని ప్రశ్నించిన కవిత్వం ఉంది. సంపుటిలో అదే తొలి కవిత అవునో కాదో నాకు తెలీదు కానీ నాకు పంపిన సంపుటిలో మాత్రం “వాళ్లేం చేసారు” తొలి కవిత. అవును పిల్లలు ఏం చేసారు. ఏం చేస్తారో తెలిస్తే ఏం చేయరో తెలుస్తుంది. నీ అధికార దాహానికి… నీ ఆధిపత్యానికి… నీ మొండితనానికి.. నీ చేతకానితనానికి.. నీ పెత్తనానికి ఆ పిల్లలు అడ్డు చెప్పలేదు కదా..! కనీసం నువ్వు ఎక్కడుంటావో కూడా తెలియని అమాయక బాల్యపు గుజ్జనగూళ్లు కదా పిల్లలంటే.. అందుకే మందరపు హైమవతి ఆగ్రహించారు. ప్రశ్నించారు. నిలదీసారు. ఒరేయ్ నిన్ను చంపేస్తారోయ్ అనలేదు కానీ ఆ ఒక్క కవితతో ఆ సామ్రాజ్ఞవాదుల్ని చంపేశారు. విషయం ఏంటంటే ఆ ముష్కరుల చేతికి ఈ కవిత అందలేదు కానీ… అంది ఉంటే వాళ్లు ఆత్మహత్య చేసుకుందురు ఇది చదివాక. ఇంతకీ ఆ వాళ్లేం చేసారు కవితలో ఏమన్నారంటే… “ముట్టుకుంటే మాసిపోయే దూది బొమ్మలు/ ఈ లోకపు బాధల మరకలు/ … నీ సామ్రాజ్యంలో సగభాగం అడిగారా/ నీ సంపదలో భాగస్వామ్యం కోరారా/… బుగ్గల మీద కన్నీటి చారికలతో/ దిగులు కవిత ఒంటరి పువ్వుల్లా…/ ఆ పసిపాపను చూసైనా/ నీ రాతిగుండె చెమర్చలేదు/ బాంబు మోతలకు/ నిద్రలో ఉలిక్‌కి పడి లేచే పీడకలల/ గుణకారాలు లేని ప్రపంచం మీద శాంతి ఓనమాలు దిద్దుకుందాం…/ యుద్ధ ఋతువులు లేని/ కాలం కోసం కలలు కందాం… యుద్ధం జరుగుతున్నప్పుడు… జరిగిన తర్వాత… ముగిసిందని అనుకున్న తర్వాత కూడా చిన్నారులపై తెలుగు కవయిత్రులు, కవులు ఎక్కువగానే స్పందించారు. స్పందించాలి కూడా. ఆ కవిత్వాన్ని… కవుల్ని తక్కువ చేయడం కాదు కాని మందరపు హైమవతి రాసిన ఈ కవిత ప్రచురణ సమయంలోనే చాలా మందిని కదిలించింది. ఈ సంకలనం వచ్చిన తర్వాత మరింత కన్నీరు తెప్పిస్తుంది. చెట్టుకవి ఇస్మాయిల్ని చదువుకున్నాం కదా..! ఆ కవి ప్రభావం కాదు కాని మద్రాస్ వీధుల్లో చెట్లను చూసి రాసిన కవిత చెట్టుతల్లి. పువ్వుల్ని, పిట్టల్ని, చెట్లని, పసిపాపల్ని చూసిన తర్వాత సాధారణ మానవులే కవిత్వమవుతారు. మరి ఓ సీనియర్ కవయిత్రి అయితే చెప్పాలా..! ఒకానొక మార్మిక లోకంలో/ అడుగు పెట్టినట్లు/ ప్రాచీన స్మృతులు మురిసిన చప్పుడు/ సైనిక కవాతుకు వరుసగా నిలబడి/ అభివాదం చేస్తున్నట్లు/ నింగిన ముద్దాడే హరితవర’ తరువులు… ఇలా ఓ సీన్తో ప్రారంభించిన ఈ కవిత ఓ మహా నగరం నిండా కవయిత్రిని వెంటాడే చెట్ల దృశ్యం. అలసి సొలసి విసిగి విరిగిన మనసులకు/ అలరించి హాయి పాట వినిపించే చెట్ల తల్లులకు వందనం మహ్ఙాóవందనం… అంటూ ముగుస్తుంది. బహుశా కాంక్రీట్ వనాలా మధ్య బతుకుతున్న వారికి మరో మహానగరంలో ఇలా చెట్లు స్వాగతం పలకడం ఓ నిండైన ఆనందాన్ని ఇస్తుంది. ఆ ఆనందమే ఇదిగో ఇలా కవిత్వమవుతుంది. అలసిన కన్నులు నిద్రని కాంక్షిస్తాయి. కాని మనసు వికలమైనప్పుడో.. మరో ఆవేదన వెంటాడుతున్నప్పుడో ఆ నిద్ర దూరం అవుతుంది. అలా నిద్ర పట్టని రాత్రిని కవిత్వీకరించారు మందరపు హైమవతి నిదురపిల్ల కవితలో…. అటుదొర్లి ఇటుదొర్లి/ పొర్లు దండాలు పెట్టినా/ ఒడ్డున పడి కొట్టుకుంటున్న చేపల్లా/ కనురెప్పల తలుపులు మూతపడవు/ రాత్రి తీగ చిగురించదు/నిద్ర పువ్వు ప్రసవించదు/తలపుల జాతరలో తప్పిపోయిన పిల్ల/ తెల్లవార్లూ కాళ్లు నొప్పి పుట్టేలా/ వెదికినా దొరకదు…చిన్న కవితలో నిద్రావస్థని ఎంత అద్భుతంగా చెప్పారో మందరపు హైమవతి. ఈ అనుభవం చాలామంది కలిగిందే. కలిగించేదే. ఆ అవస్థని కవిత్వీకరించడంలో కవి పరిణితి తెలుస్తుంది. మందరపు హైమవతికి వస్తు కొరత లేదు. శిల్ప కొరత లేదు. రూప కొరత లేదు. మందరపు హైమవతి చేత కవిత్వీకరించబడాలని అన్ని వస్తువులు ఎదురు చూస్తాయి. కొందరు మనుషులు కూడా అలా ఎదురుచూసే వారిలో ఉంటారు. ఇన్నేళ్ల తన కవిత్వ ప్రయాణంలో మందరపు హైమవతి సాధించింది – నన్ను కవిత్వం చేయవP అనే ఎదురుచూపులే…!
- సీనియర్ జర్నలిస్టు, 99120 19929


