Homeఅమరావతిలో ‘క్వాంటం’ విప్లవం

అమరావతిలో ‘క్వాంటం’ విప్లవం

- Advertisement -

. దేశంలోనే తొలి అధునాతన సాంకేతిక వ్యవస్థ
. నేడు క్వాంటం భవనానికి శంకుస్థాపన

విశాలాంధ్ర – సచివాలయం: నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ అధ్వర్యంలో “అమరా వతి క్వాంటం వ్యాలీ” ఏర్పాటుకు శనివారం కేంద్ర శాస్త సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌తో కలసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి చిరునామాగా అమరావతిని మార్చేందుకు ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టులో ప్రపంచ ఐటీ దిగ్గజ సంస్థలు తమవంతు సహకారం అందిస్తున్నాయి. ఐబీఏం భారత్‌లోనే అత్యంత శక్తివంతమైన 156-క్యూబిట్ సామర్థ్యం కలిగిన క్వాంటం కంప్యూటర్‌ను ఇక్కడ ఏర్పాటు చేయనుంది. ఇది దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద క్వాంటం కంప్యూటింగ్ కేంద్రంగా నిలవనుంది. టీసీఎస్ క్వాంటం కంప్యూటింగ్‌కు అవసర మైన అత్యాధునిక సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్, అల్గారిథమ్స్ అప్లికేషన్లను టీసీఎస్ అభివృద్ధి చేయనుంది. ఎల్ అండ్ టీ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలు, భవన నిర్మాణ బాధ్యతలను ఎల్ అండ్ టీ సంస్థ చేపట్టింది. ఈ ప్రాజెక్టు కోసం సీఆర్డీఏ రాయపూడి పరిధిలో 50 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ వ్యాలీ ద్వారా వచ్చే ఐదేళ్లలో సుమారు 1 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కేంద్రం ద్వారా సుమారు 15 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా.
క్వాంటం కంప్యూటింగ్ వల్ల ఉపయోగాలు: సాధారణ కంప్యూటర్లు చేయలేని అత్యంత క్లిష్టమైన గణనలను సెకన్ల వ్యవధిలో క్వాంటం కంప్యూటర్లు పూర్తి చేస్తాయి. దీనివల్ల ఔషధాల తయారీ, వాతావరణ మార్పుల అంచనా, సైబర్ సెక్యూరిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. ఈ ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే క్వాంటం టెక్నాలజీకి కేంద్ర బిందువుగా మారబోతోంది. అమరావతిలో నిర్మించనున్న ఈ ‘క్వాంటం వ్యాలీ’ కేవలం ఒక భవనం లేదా కంప్యూటర్ సెంటర్ మాత్రమే కాదు, ఇది రాబోయే దశాబ్ద కాలంలో ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తును మార్చే ఒక భారీ ‘నాలెడ్జ్ ఎకోసిస్టమ’. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి విజన్ ప్రకారం, 2030 నాటికి అమరావతిని ప్రపంచ క్వాంటం రాజధానిగా మార్చడమే లక్ష్యం. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే వైజర్, క్కుబిటెక్ వంటి సంస్థలతో కలిసి 50వేల మంది విద్యార్థులకు క్వాంటం కంప్యూటింగ్‌లో శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్వాంటం స్కిల్లింగ్ ప్రోగ్రామ్. క్వాంటం వ్యాలీ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 1 లక్ష ఉద్యోగాలను సృష్టించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కేవలం ఐటీ మాత్రమే కాకుండా ఫిజిక్స్, మ్యాథ్స్, మెటీరియల్ సైన్స్ విద్యార్థులకు కూడా ఇందులో ప్రాధాన్యత ఉంటుంది. సాధారణ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలతో పోలిస్తే, క్వాంటం డెవలపర్లు రీసెర్చర్లకు ప్రారంభంలోనే 8 లక్షల నుండి 25 లక్షల వరకు వార్షిక వేతనం లభించే అవకాశం ఉంది. 1,000 కోట్లతో ‘క్వాంటం ఇన్నోవేషన్ ఫండ’ ఏర్పాటు కానుంది. సొంతంగా స్టార్టప్‌లు పెట్టాలనుకునే యువతకు ప్రభుత్వం ఆర్థిక సహాయం మౌలిక సదుపాయాలను అందిస్తుంది. అమరావతిలో ఏర్పాటు చేయనున్న ఐబీఏం క్వాంటం సిస్టమ్ 2 (156 క్యూబిట్స్) దక్షిణాసియాలోనే అత్యంత శక్తివంతమైన కంప్యూటర్. దీనిని క్లౌడ్ ద్వారా రాష్ట్రంలోని విద్యార్థులు, పరిశోధకులు ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయవచ్చు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అమరావతిలో ఏర్పాటు కానున్న ఈ హబ్ ద్వారా క్వాంటం టెక్నాలజీపై యువతకు హ్యాండ్స్-ఆన్ ట్రైనింగ్ లభిస్తుంది. క్వాంటం రెఫరెన్స్ ఫెసిలిటీ దేశంలోనే మొట్టమొదటి క్వాంటం హార్డ్‌వేర్ ల్యాబ్ తయారీ కేంద్రాన్ని ఇక్కడ నిర్మించనున్నారు. అంటే సాఫ్ట్‌వేర్ మాత్రమే కాకుండా, క్వాంటం కంప్యూటర్ పరికరాల తయారీ కూడా అమరావతిలోనే జరుగుతుంది. ఏఐ లివింగ్ ల్యాబ్స్ యూనివర్సిటీ క్వాంటం వ్యాలీకి అనుబంధంగా ఒక ప్రత్యేక యూనివర్సిటీని కూడా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇది స్కూల్ స్థాయి నుండి పీజీ వరకు ఆధునిక సాంకేతికతను నేర్పిస్తుంది. హైటెక్ సిటీ తరహా మోడల్ లో దీనిని కేవలం 15-18 నెలల్లోనే పూర్తి చేయాలని ఎల్ అండ్ టీ సంస్థకు గడువు విధించారు. హైదరాబాద్‌లోని సైబరాబాద్ తరహాలో, ఇక్కడ 90 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ టవర్లు రానున్నాయి. ఈ ప్రాజెక్టు పారదర్శకంగా, వేగంగా సాగడానికి ప్రభుత్వం రెండు కమిటీలను నియమించింది. అపెక్స్ కమిటీలో ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ అధ్యక్షతన 14 మంది నిపుణులు దీనికి మార్గదర్శకత్వం చేస్తారు. ఎక్స్‌పర్ట్ కమిటీ లో ఐఐటీ తిరుపతి డైరెక్టర్ నేతృత్వంలో సాంకేతిక సవాళ్లను పరిష్కరిస్తుంది. అమరావతిని ప్రపంచ టెక్నాలజీ మ్యాప్‌లో ‘క్వాంటం వ్యాలీ ఆఫ్ ఇండియా’గా నిలబెట్టబోతోంది.హైదరాబాద్‌కు హైటెక్ సిటీ ఎలాగో, నవ్యాంధ్రకు ‘క్వాంటం వ్యాలీ’ అలా నిలవనుంది. నేడు జరగబోయే శంకుస్థాపన కేవలం ఒక భవనానికి పునాది కాదు, ఆంధ్రప్రదేశ్ యువత ప్రపంచ టెక్నాలజీని శాసించే దిశగా పడబోయే తొలి అడుగు కానునుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు