చెన్నై: ఎగ్మోర్ మ్యూజియం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కారల్ మార్క్స్ విగ్రహాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శుక్రవారం ఆవిష్కరించారు. కారల్ మార్క్స్‌కు రాష్ట్ర రాజధాని చెన్నైలో విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు 2025 ఏప్రిల్ 3న శాసనసభలో నిబంధన 110 కింద ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆ మేరకు ఎగ్మోర్ మ్యూజియం ప్రాంగణంలోని కన్నిమారా పబ్లిక్ లైబ్రరీ ప్రవేశద్వారం వద్ద రూ.85.80 లక్షల వ్యయంతో ఏర్పాటు చేశారు. ఆ విగ్రహాన్ని స్టాలిన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కారల్ మార్క్స్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ముందుగా కారల్ మార్క్స్ జీవిత చరిత్రను వివరించేలా ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను తిలకించారు. కార్యక్రమంలో మంత్రులు వేలు, మా.సుబ్రమణియన్, పీకే శేఖర్ బాబు, మేయర్ ప్రియ, ఎంపీలు టీఆర్ బాలు, కె.సుబ్బరాయన్, సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు ఎం.వీరపాండియన్, పి.షణ్ముగం, వీసీకే అధ్యక్షుడు తిరుమవలవన్, ఎండీఎంకే అధ్యక్షుడు వైకో, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.సెల్వపెరుంగతై తదితరులు పాల్గొన్నారు.


