లాసఏంజెల్స్: ప్రతిష్టాత్మక 98వ అకాడమీ (ఆస్కార్) అవార్డుల వేడుకలో తెలుగు సినీ పరిశ్రమ గర్వపడే క్షణం ఆవిష్కృతమైంది. గతేడాది దివంగతులైన సినీ ప్రముఖులకు నివాళులర్పించే ‘ఇన్ మెమోరియం’ విభాగంలో విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావుకు అరుదైన గౌరవం దక్కింది. ఈ నివాళి కార్యక్రమంలో ఆయన పేరును స్మరించుకోవడం తెలుగు సినిమాకు దక్కిన అంతర్జాతీయ గుర్తింపుగా నిలిచింది.
లాస్ ఏంజెల్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో కోటతో పాటు బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర, సీనియర్ నటి సరోజాదేవి, ప్రముఖ నటుడు మనోజ్ కుమార్‌లను కూడా అకాడమీ స్మరించుకుంది. అకాడమీ అధికారిక వెబ్‌సైట్‌లోని గ్యాలరీలో ఈ నలుగురు భారతీయ తారల చిత్రాలను ప్రదర్శించి, వారి సేవలను ప్రపంచానికి గుర్తు చేసింది. భారతీయ నటుల జాబితాలో తొలుత కోట శ్రీనివాసరావు పేరును ప్రస్తావించడం విశేషం.
2025 జూలై 13న కన్ను మూసిన కోట శ్రీనివాసరావు, తన అద్భుతమైన నటనతో తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు. విలక్షణ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన ఆయన, తొమ్మిది నంది అవార్డులతో పాటు పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. వీరితో పాటు బంగ్లాదేశ్ నటి జయశ్రీ కబీర్, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ ఎస్. కృష్ణస్వామికి కూడా అకాడమీ నివాళులర్పించింది.ప్రపంచ సినీ వేదికపై భారతీయ నటీనటులకు, ముఖ్యంగా తెలుగు నటుడికి ఈ స్థాయిలో గౌరవం దక్కడం పట్ల సినీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
24 సినిమాల్లో ఒక్కదానికి అవార్డు దక్కలేదు
గత కొంతకాలంగా భారతీయ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది కూడా ఆస్కార్‌ను కొల్లగొట్టేందుకు 24 భారతీయ సినిమాలు ప్రయత్నించాయి. కానీ ఏవీ ఆ పురస్కారాన్ని అందుకోలేదు. ‘ఐ వాంట్ టు టాక’, ‘తన్వీ ది గ్రేట’, ‘ది బెంగాల్ ఫైల్స’, ‘హోంబౌండ’, ‘కేసరి చాప్టర్ 2’, ‘ఫూలే’, ‘పైర’ వంటి హిందీ చిత్రాలు భారత్ తరఫున ‘ది బెస్ట్ ఇంటర్నేషన్ ఫీచర’ విభాగంలో అధికారిక ఎంట్రీకి నామినేషన్ పొందాయి. ‘కన్నప్ప’, ‘పుష్ప 2’, ‘గాంధీ తాత చెట్టు’, ‘కుబేర’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి తెలుగు మూవీస్, ‘సూపర్‌బాయ్స్ ఆఫ్ మాలేగావ’, ‘స్థల’, ‘సాంబర్ బోండా’, ‘దశావతార’, ‘వన్వాస’, ‘నీరు’, ‘ఆటా థంబైచా నాయ’ వంటి మరాఠీ సినిమాలు అస్కార్ బరిలో నిలిచాయి. ఇంకా ఇతర భాషల సినిమాలు కూడా అధికారిక ఎంట్రీ పొందినప్పటికీ ఏ విభాగంలోనూ అవార్డుకు ఎంపికవలేదు.
ఆస్కార్ వేదికపై కోట శ్రీనివాసరావుకు నీరాజనం
- Advertisement -


