కర్నూలు జిల్లాలో ఘటన
విశాలాంధ్ర – ఆస్పరి : కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నీటి కుంటలో పడి ఆరుగురు చిన్నారులు మృతి చెందారు.ఆస్పరి మండలం చిగలి గ్రామంలోని ఈ ఘటన జరిగింది. ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న ఏడుగురు గ్రామ శివారులోని కొండ ప్రాంతంలోగల కుంటలో ఈతకు వెళ్లారు. ఇటీవల కురిసిన వర్షాలతో కుంటలో భారీగా నీరు చేరింది. ఈతకు దిగిన విద్యార్థుల్లో శశికుమార్, కిన్నెర సాయి, సాయి కిరణ్, భీమా, వీరేంద్ర, మహబూబ్ మునిగిపోయారు. ఇది గమనించిన దుర్గాప్రసాద్ అనే మరో విద్యార్థి గ్రామంలోకి వెళ్లి విషయం తెలిపాడు. గ్రామస్తులు వచ్చే సమయానికి ఆ ఆరుగురు విగతజీవులయ్యారు. మృతదేహాలను స్థానికులు బయటకు తీశారు. పిల్లలు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. సీఐ గంగాధం ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. దర్యాప్తు చేపట్టారు. పత్తికొండ ఆర్డీఓ భరత్ నాయక్, తహసీల్దార్ రామేశ్వర్ రెడ్డి, ఎంపీడీవో గీతావాణి గ్రామాన్ని సందర్శించి, వివరాలు తెలుసుకున్నారు. పిల్లల తల్లిదండ్రులను వారి ఇళ్లకు వెళ్లి ఓదార్చారు. హైస్కూల్ నిర్మాణ పనులు జరుగుతున్న కొండ సమీపంలో అక్రమంగా గరుసును తోలడంతో ఏర్పడిన పెద్ద గుంట పిల్లల ప్రాణాలు తీసిందని గ్రామస్తులు కంటతడి పెట్టుకున్నారు. కన్నీరుమున్నీరైన వారి తల్లిదండ్రులను ఓదార్చారు.
సీఎం దిగ్భ్రాంతి: ఆరుగురు చిన్నారులు మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్ ఉన్న చిన్నారుల మృతి వారి కుటుంబాలకు తీరని కడుపుకోత మిగిల్చిందన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై మంత్రి టీజీ భరత్ విచారం వ్యక్తం చేశారు. ఆరుగురు విద్యార్థుల చనిపోవడం కలచివేసిందని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి ఆరా తీశారు. టీడీపీ ఆలూరు ఇన్చార్జి వీరభద్ర గౌడ్ కూడా విద్యార్థుల మృతికి సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. మండల అధికారులతో ఫోన్లో మాట్లాడారు. చిన్నారుల కుటుంబాలకు రూ.50 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్యే విరూపాక్షి విజ్ఞప్తి చేశారు.


