Homeఓటు హక్కు ప్రశ్నార్థకం

ఓటు హక్కు ప్రశ్నార్థకం

- Advertisement -

. ఈసీ రాజ్యాంగ సంస్థగా పనిచేయడం లేదు
. బీజేపీి, మోదీని గద్దె దించేందుకు ప్రజాతంత్ర లౌకిక శక్తులు ఏకం కావాలి
. ఇండియాలో పరస్పర సహకారం, సర్దుబాటు అవసరం
. జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి గెలుపు భవిష్యత్‌ రాజకీయాలకు మలుపు
. సీపీఐ తెలంగాణ రాష్ట్ర మహాసభను ప్రారంభిస్తూ డి.రాజా

హైదరాబాద్‌ (పొట్లూరి నాగేశ్వరరావు నగర్‌) : రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ప్రశ్నార్థకంగా మారిందని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఆందోళన వ్యక్తం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండేలా చూడటంలో భారత ఎన్నికల సంఘం రాజ్యాంగ సంస్థగా లేదా తటస్థ సంస్థగా పనిచేయడం లేదని విమర్శించారు. అందుకే బీహార్‌లో ఓటర్ల హక్కు కోసం పెద్దఎత్తున ఉద్యమం ప్రారంభమైందన్నారు. రాజ్యాంగం, ప్రతి ఒక్కరి ఓటు హక్కు పరిరక్షించబడాలంటే బీజేపీని, ప్రధాని మోదీని గద్దె దించాల్సిన అవసరం ఉందని రాజా స్పష్టంచేశారు. అందుకు లౌకిక, ప్రజాతంత్ర పార్టీలన్నీ ఒకే వేదికపైకి రావాలని పిలుపునిచ్చారు. మేడ్చల్‌ మల్కాజ్‌ జిల్లాలోని ‘కామ్రేడ్‌ పొట్లూరి నాగేశ్వరరావు నగర్‌’ (గాజుల రామారం)లోని ‘కామ్రేడ్‌ ఎన్‌.బాలమల్లేశ్‌ హాల్‌’ (మహారాజా గార్డెన్స్‌)లో మూడు రోజుల పాటు జరిగే సీపీఐ రాష్ట్ర 4వ మహాసభ బుధవారం అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో ప్రారంభమైంది. ప్రారంభ సభకు సీపీఐ శ్రేణులు ఎర్రచొక్కాలు, ఎర్రచీరలు ధరించి పెద్దఎత్తున హాజరయ్యారు. ప్రాంగణమంతా అరుణవర్ణం సంతరించుకుంది. మహాసభ ప్రారంభోత్సవ సభలో ముఖ్యఅతిథిగా రాజా, అతిథులుగా సీపీఐ జాతీయ కార్యదర్శులు డాక్టర్‌ కె.నారాయణ, సయ్యద్‌ అజీజ్‌ పాషా పాల్గొన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ, సీపీఐ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ సౌహార్ధ సందేశాలిచ్చారు.
మహాసభ ఆహ్వాన సంఘం అధ్యక్షుడు ఎండీ యూసుఫ్‌ అధ్యక్షతన జరిగిన సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఏ కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, పశ్య పద్మ, జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకటరెడ్డి, కె.శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, ఎంఎల్‌సీ నెల్లికంటి సత్యం, మాజీ ఎంఎల్‌సీ పీజే చంద్రశేఖరరావు, సీనియర్‌ నాయకులు కందిమళ్ల ప్రతాపరెడ్డి, కవి, రచయిత ఏటుకూరి ప్రసాద్‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాగం హేమంతరావు, కళవేన శంకర్‌, ఎం.బాలనరసింహా, వీఎస్‌ బోస్‌, ఈటీ నరసింహా, సినీ నటుడు డాక్టర్‌ మాదాల రవి, ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షుడు డీజీ సాయిల్‌, ప్రధాన కార్యదర్శి ఇ.ఉమామహేశ్‌ తదితరులు వేదికపై ఆశీనులయ్యారు.
డి.రాజా ప్రసంగిస్తూ దేశం అత్యంత సంక్షిష్టమైన సవాళ్లు ఎదుర్కొంటోందని, ప్రాథమిక హక్కు, పౌరహక్కుగా ఉన్న ఓటు హక్కు ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. బీజేపీి, మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగంపై దాడి పెరిగిందన్నారు. పార్లమెంటును పనిచేయనివ్వడం లేదని, అది పనిచేయకపోతే ప్రజాస్వామ్యం విధ్వంసమవుతుందని హెచ్చరించారు. అర్హులైన ప్రజలందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఉండగా, బీహార్‌ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్‌) పేరుతో పాలకులకు ఇష్టం లేని ఓటర్లను పెద్దఎత్తున తొలగించే కార్యక్రమం చేస్తున్నారని రాజా విమర్శించారు. త్వరలో ఎన్నికలు జరిగే తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలలో ఎన్నికల కమిషన్‌ ఎలా పనిచేస్తుందనేది పెద్ద సమస్యగా మారిందన్నారు. అర్హులందరికీ ఓటు హక్కు కల్పించేందుకు రాజ్యాంగ బద్ధమైన ఎన్నికల కమిషన్‌కు అధికారాలు ఉన్నాయని, కానీ ఆ సంస్థ రాజ్యాంగబద్ధ సంస్థగా పనిచేయడం లేదని విమర్శించారు. ఎన్నికల కమిషన్‌ అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించాలని సీపీఐ డిమాండ్‌ చేస్తున్నదన్నారు. బీహార్‌లో ఎస్‌ఐఆర్‌ నిలుపుదల చేయాలని సుప్రీంకోర్టులో సీపీఐ తరపున స్వయంగా తాను పిటిషన్‌ దాఖలు చేసినట్టు రాజా వెల్లడిరచారు. భారత్‌… హిందూత్వ దేశం, మతతత్వ రాజ్యంగా మారితే దేశానికే పెద్ద విపత్తు ఏర్పడుతుందని రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఏనాడో హెచ్చరించారన్నారు. భారతదేశాన్ని కాపాడాలంటే బీజేపీకి, ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా లౌకిక, ప్రజాస్వామ్య శక్తులన్నీ ఐక్యంగా పోరాటం చేయాలని రాజా పిలుపునిచ్చారు. అందుకే ఇండియా ఐక్యసంఘటన ఏర్పడిరదని, ‘ఇండియా’ ఏర్పాటులో సీపీఐ కీలక పాత్ర పోషించిందని రాజా తెలిపారు. ‘ఇండియా’ భాగస్వాముల మధ్య పరస్పర సహకారం, సర్దుబాటు అవసరమని సూచించారు.
ఓటు హక్కును 18 ఏళ్లకు సవరించిన ఘనత సీపీఐదే
ఇటీవలనే దేశ స్వాతంత్య్ర దినోత్సవం జరిగిందని, స్వాతంత్య్రం రాకముందు భారతదేశం బ్రిటీష్‌, ఫ్రెంచ్‌, పోర్చుగీసు వలస పాలనలో ఉండేదని, అప్పట్లో ఎన్నికలు జరిగాయని, కానీ ఓటు హక్కు అందరికీ ఉండేది కాదని, సంపన్నులు, ఉన్నతస్థాయి వ్యక్తులకు మాత్రమే ఓటు హక్కు ఉండేదని రాజా గుర్తుచేశారు. స్వాతంత్య్రం వచ్చిన వెంటనే భారతదేశంలో 21 ఏళ్లు దాటిన పౌరులందరికీ మతాలు, ప్రాంతాలు, స్త్రీ, పురుష భేదం లేకుండా వయోజన ఓటు హక్కును రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కల్పించారని తెలిపారు. సీపీఐ నేత సీకే చంద్రప్పన్‌ పార్లమెంట్‌ సభ్యుడిగా ఉన్న సమయంలో వయోజన ఓటు వయస్సును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించాలని పార్లమెంటులో ప్రస్తావించగా… నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అంగీకరించడంతో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ కులం, మతం, ప్రాంతం అనే తేడాలు లేకుండా ఓటు హక్కు పొందారన్నారు. భారతదేశంలో స్వాతంత్య్రం వచ్చిన వెంటనే వయోజనులైన పురుషులతో సమానంగా మహిళలకు ఓటు హక్కు లభించిందన్నారు. కానీ అమెరికాలో, ఐరోపా దేశాల్లో చాలాకాలం పురుషులకు మాత్రమే ఓటు హక్కు ఉండేదని, అనేక పోరాటాల తరువాతనే మహిళలకు ఓటు హక్కు దక్కిందన్నారు. భారతదేశంలో అత్యంత ధనికులైన అదానీ, అంబానీ ఓటుకు, సామాన్య ప్రజల ఓటుకు ఒకే విలువ ఉంటుందని, అది అంబేద్కర్‌ గొప్పతనమని చెప్పారు. అదేవిధంగా ఓటుతో పాటు ప్రతి మనిషికి ఒకే విలువ ఉండే సమాజం కావాలని ఆయన ఆకాంక్షించారని గుర్తు చేశారు.
ఉపరాష్ట్రపతి ఎన్నిక రాజకీయ యుద్ధం
ఉపరాష్ట్రపతి ఎన్నికలు దేశ చర్రితలో ఎంతో కీలకమని, ఈ ఎన్నిక రాజకీయ యుద్ధమని రాజా అన్నారు. ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్కర్‌ ఎందుకు రాజీనామా చేశారని ఆయన ప్రశ్నించారు. ధన్కర్‌ రాజీనామాకు ఆయన అనారోగ్యం కారణం కాదని, అదేమిటో ఇప్పటికీ ఎవరికీ తెలియదన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఇండియా ఐక్యసంఘటన అభ్యర్థిగా జస్టిస్‌ బి.సుదర్శన్‌ రెడ్డిని ప్రకటించారని, సీపీఐ కూడా మద్దతు ప్రకటించిందని, లౌకిక పార్టీలన్నీ జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఉపరాష్ట్రపతిగా జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి గెలుపొందితే దేశ భవిష్యత్‌ రాజకీయాలలో తీవ్ర ప్రభావం చూపుతుందని, చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని రాజా తెలిపారు. కాగా, కార్మికులు, రైతులు, మహిళలు, కమ్యూనిస్టు పార్టీని మరింత బలోపేతం చేయాలని రాజా పిలుపునిచ్చారు. తెలంగాణలో సీపీఐ అత్యంత బలమైన పార్టీ అని, ప్రస్తుతం ఒక ఎంఎల్‌ఏ, ఒక ఎంఎల్‌సీ ప్రాతినిధ్యం వహిస్తున్నారన్నారు. ప్రజాసమస్యలను మరింత ఎలుగెత్తి చాటేందుకు పార్లమెంటు, అసెంబ్లీలో సీపీఐ బలం పెరగాలని ఉద్ఘాటించారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటంలో ముఖ్యపాత్ర పోషించిన ఘనచరిత్ర సీపీఐదని గుర్తు చేశారు.
బీజేపీని అడ్డుకునే శక్తి వామపక్షాలకే ఉంది: కందిమళ్ల
వీర తెలంగాణ గడ్డపై మతోన్మాద బీజేపీ జెండా ఎగరకుండా అడ్డుకునే శక్తి వామపక్ష పార్టీలకే ఉందని, ఇందుకు కమ్యూనిస్టు పార్టీలన్నీ ఏకం కావాలని సీపీఐ సీనియర్‌ నాయకులు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటయోధుడు కందిమళ్ల ప్రతాపరెడ్డి పిలుపునిచ్చారు. సీపీఐ వందేళ్ల ప్రస్థానంలో సాగించిన పోరాటాలు, త్యాగాలు, సాధించిన విజయాలను మననం చేసుకుంటున్నామన్నారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సీపీఐ పోరాటాలు నిర్వహించిందని, మాతృదేశం కోసం నాయకులు ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు. 1942 వరకు భారత కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఉన్నా… రైతులు, కూలీలు, విద్యార్థులు, యువకులను సంఘటితం చేసి స్వాతంత్య్ర పోరాటంలో కదిలించిందని వివరించారు. స్వాతంత్య్ర సమరంలో ముందుండి పోరాటం చేసిన కమ్యూనిస్టు పార్టీ నాయకులు జైలు శిక్ష అనుభవించారన్నారు. నిరంకుశ నిజాంకు వ్యతిరేకంగా మట్టి మనుషులతో బందూకులు పట్టించి… సాయుధ సమరం నడిపిన చరిత్ర సీపీఐ దన్నారు. కమ్యూనిస్టు పార్టీ చీలికతో కొంత బలహీనమైందని, దీనిని అధిగమించేందుకు దేశంలోని కమ్యూనిస్టు పార్టీలు, మేధావులను ఏకం చేసేందుకు కీలకపాత్ర పోషించాలని డి.రాజాను ఆయన కోరారు. రాజకీయాలు వ్యాపారంగా మారాయని, తెలంగాణ విప్లవగడ్డపై కమ్యూనిస్టులుగా కమ్యూనిస్టుల పాత్ర ఏమిటనేది మహాసభలో ఆత్మపరిశోధన చేసుకోవాలని సూచించారు. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన వీర తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను మరుగున పడేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమే స్ఫూర్తి అని, అయితే మాజీ సీఎం కేసీఆర్‌ తానే ఒక వీరుడిగా చెప్పుకుంటున్నారని, సాయుధ పోరాటాన్ని తామే నడిపించినట్టు చరిత్రను బీజేపీ వక్రీకరిస్తున్నదన్నారు. కమ్యూనిస్టులందరి ఆశయం ఒక్కటేనని, ఐక్యత తమ ఆయుధమని, ఈ ప్రజాతంత్ర ఐక్యత ద్వారా కమ్యూనిస్టు స్ఫూర్తిని, ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
అమరుల త్యాగం, రక్తంతో ఎరుపెక్కిన ఎర్రజెండా: ఏటుకూరి ప్రసాద్‌
అమరవీరుల త్యాగం, రక్తంతో ఎరుపెక్కిన జెండా ఎర్రజెండా అని, నిజాంకు వ్యతిరేకంగా రైతాంగ సాయుధ పోరాటంలో ఎందరో అమరులైన వారి వారసత్వం బాట ఎర్రబాట అని ఏటుకూరి ప్రసాద్‌ అన్నారు. కమ్యూనిస్టు పార్టీ ఏర్పడిన నాటి దశలో ఉన్న రాజకీయ పరిస్థితులే ప్రస్తుతం దేశంలో ఉండడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఫాసిజం మళ్లీ విజృంభిస్తున్నదన్నారు. గతంలో కమ్యూనిస్టులు రక్తార్పణతో ఏ అశయాలు, ఆదర్శాలతో ముందుకు వెళ్లారో… ఆ ఆశయాల స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లాలన్నారు. ఫాసిజం ఎన్నో రకాల ముసుగు ధరించి చిన్నల నుంచి పెద్దల వరకు అనేక రూపాల్లో బయటపడడం ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతమన్నారు. ఈ పరిస్థితులు ఎదుర్కొనే శక్తి కేవలం వామపక్షాలకు మాత్రమే ఉందన్నారు. ఈ దశలో అమరవీరుల ఆశయాల స్ఫూర్తితో వామపక్షాలన్నీ ఐక్యంగా ముందుకు కదిలి… ఫాసిస్టుశక్తులను ఓడిరచేందుకు ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరముందన్నారు.
సినీనటుడు మాదాల రవి మాట్లాడుతూ కమ్యూనిస్టు శక్తులన్నీ ఏకమై పోరాటం చేసినప్పుడే సామాన్యుడి గుండె ప్రతిధ్వనిస్తుందని, కుళ్లుతున్న వ్యవస్థను కూకటివేళ్లతో పీకేస్తారని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సాంస్కృతిక విప్లవం రావాల్సిన అవసరం ఉన్నదన్నారు. మతతత్వ శక్తులను ఎదుర్కొవాలంటే డబ్బులు ప్రధానంగా మారిన ఎన్నికల వ్యవస్థపై అందరూ కలిసి పోరాటం చేయాలన్నారు. కళ కాసుల కోసం కాదని, సామాన్యులలో చైతన్యం తీసుకురావడం కోసమని, ప్రజా కళాకారులందరూ ప్రజలను చైతన్య వంతులను చేసినప్పుడే ప్రజలలో చైతన్యం వస్తుందన్నారు. మానవ సంబంధాలను మట్టి కరిపించే విధంగా ప్రస్తుత సినిమాలు, సీరియళ్లు ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎర్రమల్లెలు లాంటి సినిమాలు తీసిన మాదాల రంగారావు కూడా కమ్యూనిస్టు పార్టీ తయారు చేసిన ఆయుధమన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు