Homeతెలంగాణఉద్యోగాల కల్పనే లక్ష్యం

ఉద్యోగాల కల్పనే లక్ష్యం

- Advertisement -

. 12న కొత్తగూడెంలో మెగా జాబ్‌ మేళా
. సద్వినియోగానికి కూనంనేని పిలుపు
. ప్రచార పోస్టరు విడుదల

విశాలాంధ్ర బ్యూరో-కొత్తగూడెం:కొత్తగూడెం జిల్లా పారిశ్రామిక ప్రాంతమైనప్పటికీ నిరుద్యోగం అధికమని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈనెల 12న మెగా జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సింగరేణి కాలరీస్‌ సంస్థ సౌజన్యంతో కొత్తగూడెం క్లబ్‌లో జరిగే జాబ్‌ మేళాను సద్వినియోగించుకోవాలని కోరారు. ప్రారంభోత్సవంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొంటారన్నారు. కొత్తగూడెం క్లబ్‌లో జాబ్‌ మేళా సన్నాహక సమావేశం గురువారం జరిగింది. ముఖ్య అతిథిగా కూనంనేని హాజరయ్యారు. జాబ్‌ మేళాకు 50కు పైగా కంపెనీలు వస్తున్నట్లు తెలిపారు.10 వేల మందికిపైగా నిరుద్యోగులు హాజరయ్యేలా జిల్లాలోని అన్ని శాఖల అధికారులు కృషి చేయాలన్నారు. మూడు వేలకుపైగా ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఈ మేళా జరుగుతున్నట్లు తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు మొదలు ఐటీఐ, డిప్లొమా, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, గ్రాడ్యూయేషన్‌, పోస్టుగ్రాడ్యుయేట్‌, బీఈ, బీటెక్‌, ఎంటెక్‌ తదితర ప్రొఫెషనల్‌ కోర్సులు చదివిన వారంతా ఉద్యోగాలు పొందాలని కూనంనేని ఆకాంక్షించారు. రూ.13 వేల నుంచి రూ.10 లక్షల వరకు వేతన ప్యాకేజీలు పొందే అవకాశం ఉందన్నారు. ఈ జాబ్‌ మేళాకు హాజరయ్యేందుకు రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని, క్యూఆర్‌ కోడ్‌ ద్వారా ఆన్‌లైన్‌లోనూ నమోదు చేసుకోవచ్చన్నారు. అలా వీలుకాకపోతే 12వ తేదీ ఉదయమే స్పాట్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని కూనంనేని సూచించారు. అభ్యర్థి కనీసం ఐదు కంపెనీల్లో ఇంటర్వ్యూ ఇచ్చేలా టోకెన్‌ పాస్‌కు ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. ఆయా కంపెనీలు నియామక, ఒప్పంద పత్రాలను అక్కడికక్కడే అందిస్తారని కూనంనేని సాంబశివరావు తెలిపారు. జాబ్‌ మేళా కోసం జిల్లాలోని 40 ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది విస్తృత ప్రచారం చేయాలని కోరారు. అనంతరం ప్రచార పోస్టరును ఎమ్మెల్యే విడుదల చేశారు. తహసీల్దారు పుల్లయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్‌ మురళీధర్‌, సింగరేణి జీఎం కోటిరెడ్డి, ఏజీఎం (సివిల్‌) రామకృష్ణ, డీజీఎం (పర్సనల్‌) మోహన్‌ రావు, ఎస్టేట్‌ ఆఫీసర్‌ తావుర్య, జాబ్‌ మేళా సమన్వయకర్త చందర్‌, అదనపు కలెక్టర్‌ విద్యాచందన, ఆర్డీఓ మధు, కమిషనర్‌ సుజాత, డీఎస్‌పీ అబ్దుల్‌ రెహమాన్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్‌ పాషా, గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకుడు వట్టికొండ మల్లికార్జునరావు, సీపీఐ నాయకులు కంచర్ల జమలయ్య, వాసిరెడ్డి మురళీ, సలిగంటి శ్రీనివాస్‌, చంద్రగిరి శ్రీనివాసరావు, జి.వీరస్వామితో పాటు తహసీలార్లు, ఎంపీడీఓలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు