Homeఆంధ్రప్రదేశ్ఎస్‌ఐఆర్ గడువుపొడిగింపు

ఎస్‌ఐఆర్ గడువుపొడిగింపు

- Advertisement -
  • జులై 24 వరకు ఇంటింటి సర్వే
  • 31న ముసాయిదా ఓటర్ల జాబితా
  • ఆగస్టు 30 వరకు అభ్యంతరాల స్వీకరణ
  • అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితా

విశాలాంధ్ర – సచివాలయం: ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమానికి భారత ఎన్నికల సంఘం గడువును పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ సందీప్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ చేసిన ప్రత్యేక విజ్ఞప్తిని సానుకూలంగా పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం… మంగళవారం సవరించిన సరికొత్త షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది.
దీని ప్రకారం బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని జులై 24 వరకు కొనసాగించనున్నారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను కూడా జులై 24లోపు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఒకవైపు సర్వే సాగుతుండగానే, మరోవైపు ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పనులు రాష్ట్రవ్యాప్తంగా రికార్డు వేగంతో ముగింపు దశకు చేరుకున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 4,16,27,694 మంది ఓటర్లలో ఏకంగా 4,15,95,163 మంది డేటా ఎంట్రీ పూర్తి కావడం ద్వారా 99.92 శాతం అద్భుత పురోగతి నమోదైంది. ముఖ్యంగా కేవలం 24 గంటల వ్యవధిలోనే అత్యధికంగా 12,29,224 ఫారాలను ఐటీ విభాగం కంప్యూటరీకరించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ కార్యక్రమంలో ఇప్పటికే ఏలూరు, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, పోలవరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, మార్కాపురం, అనకాపల్లి, విజయనగరం, నంద్యాల, ప్రకాశం సహా మొత్తం 15 జిల్లాలు వంద శాతం డిజిటలైజేషన్ లక్ష్యాన్ని విజయవంతంగా అధిగమించగా, ఈ ఘనత సాధించిన ఆయా జిల్లాల కలెక్టర్లను సీఈఓ వివేక్ యాదవ్ ప్రత్యేకంగా అభినందించారు. అయితే ఇదే సమయంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 98.68 శాతంతో రాష్ట్రంలోనే చివరి స్థానంలో నిలిచింది, కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నూతన షెడ్యూల్ ప్రకారం జూన్ 15న ప్రారంభమైన బీఎల్‌ఓల క్షేత్రస్థాయి పరిశీలన జులై 24తో ముగియనుండగా, అనంతరం జులై 31న ముసాయిదా (డ్రాఫ్ట్) ఓటర్ల జాబితాను అధికారికంగా ప్రచురిస్తారు. ఆ వెంటనే జులై 31 నుండి ఆగస్టు 30 వరకు ఓటర్ల నుండి క్లెయిమ్లు, అభ్యంతరాలు, మార్పుల దరఖాస్తులను స్వీకరించి… వాటన్నింటినీ సెప్టెంబర్ 28 లోగా పూర్తిగా పరిష్కరిస్తారు. చివరగా అక్టోబర్ 3న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్లు ఈసీ స్పష్టం చేసింది. ఈ మార్పులను రాష్ట్రంలోని అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు తక్షణమే లిఖితపూర్వకంగా తెలియజేయాలని అధికారులను ఆదేశించిన ఈసీఐ… సాధారణ ఓటర్లకు నూతన గడువులపై పూర్తి అవగాహన కల్పించేలా మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత స్థాయి ప్రచారం నిర్వహించాలని మార్గదర్శకాలు జారీ చేసింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు