Homeక్షేత్రస్థాయికి వెళ్లాల్సిందే

క్షేత్రస్థాయికి వెళ్లాల్సిందే

- Advertisement -
  • నాలుగు గోడల మధ్య ఉంటే కుదరదు
  • మెరుగ్గా పనిచేస్తే 15% వృద్ధిరేటు సాధ్యమే
  • నెలవారీ ఆర్థిక నివేదికలతో పురోగతి
  • అర్జీల పరిష్కారంలో శ్రద్ధ చూపాలి
  • మంత్రులు, హెచ్‌ఓడీలు, కార్యదర్శులకు చంద్రబాబు దిశానిర్దేశం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ప్రజా సమస్యలు తెలుసుకోడానికి మంత్రులు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, నాలుగు గోడల మధ్య ఉంటే కుదరదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇక నుంచి ప్రతి నెలా ఆర్థిక నివేదికలను విడుదల చేస్తామని, దానికి అనుగుణంగా రాష్ట్ర పురోగతి కోసం ప్రభుత్వ శాఖలు పనిచేయాలని సీఎం ఆదేశించారు. సచివాలయంలో మంగళవారం మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులతో ఎంఈఆర్‌పై నిర్వహించిన సమావేశంలో సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. నెలవారీ ఆర్థిక నివేదికల ద్వారా ఎప్పటికప్పుడు రెవెన్యూ రాబడులను అంచనా వేసేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. అధికారులు, ఉద్యోగుల నెలవారీ పనితీరును, నైపుణ్యాలను కూడా ఎప్పటికప్పుడు అంచనా వేసుకుని ముందుకు వెళ్దామన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ఇలా అన్ని జిల్లాల్లో అపారమైన వనరులు, పెట్టుబడి అవకాశాలతో పాటు టెక్నాలజీ, వనరులు, నాలెడ్జి మన దగ్గర ఉన్నాయన్నారు. దానిని అందిపుచ్చుకునే నాయకత్వం కావాలని చంద్రబాబు పేర్కొన్నారు. పాలసీలు తీసుకురావటం సులభమే అయినా వాటిని అమలు చేయటమే అత్యంత కీలకమన్నారు. ఇక నుంచి నెల వారీ ఆర్థిక నివేదికల ద్వారా ముందుకు వెళ్లాలని నిర్ణయించామని… దీనికనుగుణంగా ప్రతి నెలా ఒకసారి కార్యదర్శులు, హెచ్వోడీల సమావేశం ద్వారా ఎప్పటికప్పుడు పురోగతిని సమీక్షించుకుందామని సీఎం పిలుపునిచ్చారు.
అర్జీలు వేగంగా పరిష్కరించి ప్రజలకు స్వాంతన
ప్రజా పిర్యాదుల విభాగం ద్వారా వచ్చే అర్జీలను వేగంగా పరిష్కరించి ప్రజలకు స్వాంతన కలిగించాలని సీఎం స్పష్టం చేశారు. గత పాలకుల వల్ల రెవెన్యూ శాఖలో అధికంగా ఫిర్యాదులు వచ్చాయని… భూ వివాదాలకు సంబంధించిన అర్జీలను పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాల్సి వచ్చిందన్నారు. ప్రభుత్వ శాఖలు ఆర్జీల పరిష్కారం కోసం నిబంధనల్లో మార్పులు తీసుకురావడం, లేదంటే చట్టాలను సవరించే అంశంపై విశ్లేషణ చేయాలన్నారు. మెరుగ్గా పనిచేస్తే 15 శాతం వృద్ధి రేటును సాధించే అవకాశం ఉందని తెలిపారు. ఈ ఏడాది వివిధ ప్రభుత్వ శాఖల్లో 24 శాతం మేర రెవెన్యూ వసూళ్లు పెరిగాయని… జీఎస్‌డీపీ వృద్ధిరేటు 2017తో పోలిస్తే గత ఏడాదిలో 20 శాతం మేర పెరిగిందని… కీలకస్థానాల్లో పనిచేస్తున్న కొందరు వ్యక్తులు అభివృద్ధి నిరోధకులుగా పనిచేయటం సరికాదని సీఎం హెచ్చరించారు.
ఎల్‌నినోపై అవగాహన కల్పించాలి
పట్టిసీమ నీటితో గోదావరి నుంచి కృష్ణా డెల్టా ఆయకట్టుకు నీరు అందించగలుగుతున్నాం. అయితే ఈ ఏడాది ఎల్‌నినో కారణంగా తలెత్తిన తీవ్ర వర్షాభావ పరిస్థితులపై రైతులకు, ప్రజలకు అవగాహన కల్పించాలి. ఒక మంచి అధికారి సమస్యలను పరిష్కరిస్తే…అద్భుతంగా పనిచేసే అధికారి అసలు సమస్యలనేవే తలెత్తకుండా చూస్తారు. అందరూ ఆ కోణంలో పనిచేయాలని సూచించారు. ముందుచూపుతో అంతా పనిచేస్తేనే మెరుగైన పాలన, ఫలితాలను ప్రజలకు అందించగలమని సీఎం అన్నారు. ఈ సమావేశానికి మంత్రులు, సీఎస్ సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఆయా శాఖల కార్యదర్శులు, హెచ్‌ఓడీలు హాజరయ్యారు.
బిజినెస్ రూల్స్‌లో సంస్కరణలు
ప్రభుత్వ పాలనలో టెక్నాలజీ అనుసంధానం ద్వారా అవసరం లేని బిజినెస్ రూల్స్‌ను సంస్కరించుకోవాలని సీఎం సూచించారు. బిజినెస్ రూల్స్‌ రీ డ్రాఫ్ట్ చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసి సంస్కరణలు తీసుకురావాలని సీఎం నిర్దేశించారు. సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్సు కేంద్రంలో వివిధ ప్రభుత్వ శాఖలు అందిస్తున్న పౌరసేవలు, రాష్ట్రంలో యూరియా లభ్యతపై ముఖ్యమంత్రి సమీక్షించారు. దేవాదాయ, రహదారులు భవనాలు, ఏపీఎస్‌ఆర్‌టీసీ, రవాణా,అగ్నిమాపక, వ్యవసాయ శాఖలు అందిస్తున్న వివిధ సేవలు, ప్రజల నుంచి వ్యక్తం అవుతున్న సంతృప్త స్థాయిపై సీఎం సూచనలు చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఉన్నతాధికారులు సరైన నాయకత్వం అందిస్తేనే చిట్టచివరి వ్యక్తి వరకూ పాలనా ఫలితాలు అందుతాయన్నారు. క్షేత్రస్థాయిలో ఉద్యోగులు, అధికారులు తప్పు చేస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని.. దీన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆర్‌టీజీఎస్ రూపొందించిన గవర్నెన్స్‌ దట్ నెవర్ స్లీప్స్‌ మాసపత్రికను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సమీక్షకు మంత్రి పార్థసారధి వర్చువల్‌గా, ఆర్‌టీజీఎస్ నుంచి సీఎస్ సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు