Homeఏపీకి సెమీ కండక్టర్ల తయారీ ప్రాజెక్టు

ఏపీకి సెమీ కండక్టర్ల తయారీ ప్రాజెక్టు

- Advertisement -

. కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం
. చంద్రబాబు, లోకేశ్‌ కృతజ్ఞతలు

న్యూదిల్లీ: దేశంలో నాలుగు కొత్త సెమీ కండక్టర్‌ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్‌ మంగళవారం నిర్ణయించింది. ఏపీ సహా ఒడిశా, పంజాబ్‌లో సెమీ కండక్టర్‌ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది. మొత్తంగా రూ.4,594 కోట్ల వ్యయంతో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ సమావేశం అనంతరం మీడియాకు వెల్లడిరచారు. పట్టణ రవాణాను మరింత బలోపేతం చేసేలా లక్నో మెట్రో మొదటి దశ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. దీన్ని రూ.5,801 కోట్లతో చేపట్టనున్నట్లు పేర్కొంది. అరుణాచల్‌ప్రదేశ్‌లో 700 మెగా వాట్ల జలవిద్యుత్‌ ప్రాజెక్టుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో సెమీ కండక్టర్‌ ఎకో సిస్టమ్‌ గణనీయంగా ఊపందుకుంటున్న వేళ… తాజా నిర్ణయం మరింత ప్రయోజనకరంగా మారనుంది. ఇప్పటికే దేశంలో ఆరు సెమీ కండక్టర్‌ ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉండగా… తాజాగా కేంద్ర కేబినెట్‌ ఆమోదించిన నాలుగు కొత్త ప్రాజెక్టులతో ఈ సంఖ్య మొత్తం 10కి చేరింది. 2034 నాటికి నైపుణ్యం గల వారికి మరింతగా ఉపాధి అవకాశాలు సృష్టించడంలో ఇవి కీలకంగా పనిచేయనున్నాయి. ఎలక్ట్రానిక్‌ తయారీ ఎకోసిస్టమ్‌కు ఉత్ప్రేరకంగా పనిచేయడం ద్వారా ఇవి పరోక్షంగా అనేక ఉద్యోగాల కల్పనకు ఉపయోగపడనున్నాయి టెలికాం, ఆటోమోటివ్‌ డేటా సెంటర్లు, కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌, ఇండస్ట్రియల్‌ ఎలక్ట్రానిక్స్‌లో సెమీకండక్టర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కొత్తగా ఆమోదించిన ఈ నాలుగు కొత్త సెమీకండక్టర్‌ ప్రాజెక్టులు దేశంలో సాంకేతిక పరిజ్ఞానంలో స్వావలంబన సాధించడంలో, ఆత్మనిర్భర్‌ భారత్‌ను సాకారం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ పేర్కొన్నారు. కేంద్ర కేబినెట్‌ కొత్తగా ఆమోదించిన నాలుగు సెమీకండక్టర్‌ తయారీ ప్లాంట్ల నిర్మాణ పనులు అతి త్వరలోనే ప్రారంభమవుతాయని మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. గతంలో మంజూరైన ఆరు ప్లాంట్లకు అనుమతులన్నీ రికార్డు సమయంలోనే వచ్చాయన్నారు. చాలావరకు 100 రోజుల్లోనే అనుమతులు వచ్చేశాయని, ఆరు నెలల వ్యవధిలోనే వారు తమ డిజైన్‌, నిర్మాణాలు ప్రారంభించారని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రకటించిన వాటి విషయంలోనూ అదే పురోగతి ఉంటుందని భావిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా ముఖ్యమంత్రులు ఇప్పుడే తనతో మాట్లాడారని వైష్ణవ్‌ వెల్లడిరచారు. ప్రధాని నరేంద్ర మోదీకి వారు కృతజ్ఞతలు చెప్పారని తెలిపారు. రికార్డు సమయంలోనే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తనకు హామీ ఇచ్చారన్నారు.
చంద్రబాబు, లోకేశ్‌ కృతజ్ఞతలు
ఏపీకి సెమీ కండక్టర్ల ప్రాజెక్టు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ హర్షం వ్యక్తం చేశారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ నేతృత్వంలో సెమీ కండక్టర్‌ తయారీ ఏపీకి వస్తోందన్నారు. రాష్ట్రానికి సెమీకండక్టర్‌ తయారీ ప్రాజెక్టును మంజూరు చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు చెబుతూ ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టారు. అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్‌ ఇన్‌ ప్యాకేజీ టెక్నాలజీస్‌ దక్షిణ కొరియాకు చెందిన అపాక్టు కో. లిమిటెడ్‌తో 96 మిలియన్‌ యూనిట్ల వార్షిక సామర్థ్యంతో ఒప్పందం కుదుర్చుకుంటుందని తెలిపారు. సెమీకండక్టర్లను మొబైల్‌ ఫోన్లు, సెట్‌ టాప్‌ బాక్సులు, ఆటోమొబైల్స్‌, ఇతర ఎలక్ట్రానిక్‌ అప్లికేషన్స్‌లో ఉపయోగిస్తారని, తద్వారా ఆత్మనిర్భర భారత్‌కు ఈ ప్రాజెక్టు ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు