హైదరాబాద్: నాగచైతన్య కథానాయకుడిగా, ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వృషకర్మ’. ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఈ వీడియో, సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఇది కేవలం నిధి వేట చుట్టూ తిరిగే అడ్వెంచర్ సినిమా మాత్రమే కాదని, దుష్టశక్తులతో కూడిన ఒక మైథలాజికల్ థ్రిల్లర్ అని ఈ గ్లింప్స్ స్పష్టం చేసింది. విడుదలైన వీడియోలో ఒక దుష్టశక్తి ఆవహించిన వ్యక్తి ఒక మనిషి కన్ను పొడిచినట్టు చిత్రపటం గీస్తాడు. అది పూర్తవగానే అతని నోటి నుంచి గబ్బిలం లాంటి భయంకర జీవి బయటకు వచ్చి, ఆ చిత్రపటంలో ఉన్నట్టే ఒక వ్యక్తిని చంపేస్తుంది. “ఒక సాటిలేని శక్తి మేల్కొన్నప్పుడు… సృష్టి దాని గమ్యం తప్పినప్పుడు… విధి తన దారిని తానే ఎంచుకుంటుంది” అనే వాయిస్ ఓవర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ వీడియోలో నాగచైతన్య, మీనాక్షి చౌదరి, జయరాం పాత్రలను కూడా పరిచయం చేశారు.
కార్తీక్ అద్భుతమైన విజనరీ: నాగచైతన్య
గ్లింప్స్ విడుదల కార్యక్రమంలో చైతూ మాట్లాడుతూ ఈ సినిమా జర్నీలో తనకు ఎదురైన అనుభవాలు వెల్లడించారు. ఈ క్రమంలో దర్శకుడు కార్తీక్ దండుపై ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘ఈ సినిమా కథ మొదటిసారి విన్నప్పుడు నాకు చాలా సందేహాలు కలిగాయి. అసలు ఇలాంటి ప్రపంచాన్ని మన వెండితెరపై ఆవిష్కరించడం సాధ్యమేనా? ఆ విజువల్స్ ఎలా ఉంటాయి? అని కార్తీక్ దండును ఎన్నో ప్రశ్నలు అడిగాను. కానీ, ఈరోజు గ్లింప్స్ చూశాక నాకు అర్థమైంది.. కార్తీక్ ఒక అద్భుతమైన విజనరీ అని. ఆయన గురించి నేను జీవితాంతం మాట్లాడుతూనే ఉంటాను’ అని చైతన్య ఎమోషనల్ అయ్యారు. ‘విరూపాక్ష’ తర్వాత కార్తీక్ దండు మరో స్థాయికి చేరుకుంటారని, చైతూ మాటల్లో స్పష్టంగా తెలిసింది. చైతన్య తన కెరీర్లో ఎప్పుడూ ఇలాంటి పాత్ర చేయలేదని, ఈ సినిమా ఒక సరికొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేసింది. గ్లింప్స్‌లో చైతూ ఇంటెన్స్ లుక్ చూసి ఇప్పటికే ఫిదా అయిన అభిమానులు… ఆయన స్పీచ్‌తో సినిమాపై మరింత నమ్మకాన్ని పెంచుకుంటున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ హైలైట్‌గా నిలవనుంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (ఎస్వీసీసీ), సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై బీవీఎసఎన్ ప్రసాద్, సుకుమార్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
ఒళ్లు గగుర్పొడిచేలా నాగచైతన్య ‘వృషకర్మ’
- Advertisement -


