హైదరాబాద్: ప్రతిభ గల నటి ప్రియాంకా మోహన్ ప్రధాన పాత్రలో దర్శకుడు కార్తిక్ రూపొందించిన వినూత్న చిత్రం ‘మేడిన్ కొరియా’. ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. హాస్యం, భావోద్వేగాలు కలగలిసిన ఒక వైవిధ్యమైన కథాంశంతో ఈ సినిమా రూపొందినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. తమిళనాడులోని ఒక చిన్న గ్రామానికి చెందిన యువతికి దక్షిణ కొరియా వెళ్లాలనేది జీవిత లక్ష్యం. అసలు బాల్యంలోనే ఆమె ఆ దేశానికి వెళ్లాలని ఎందుకు నిర్ణయించుకుంది? ఒక సాధారణ పల్లెటూరి అమ్మాయి కొరియా వెళ్లే క్రమంలో ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? తీరా అక్కడికి వెళ్ళాక ఆమె జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమా సాగనుంది. ప్రియాంకా మోహన్ ఈ పాత్రలో ఎంతో సహజంగా కనిపిస్తూ తన నటనతో మెప్పించబోతున్నారు. అయితే ఈ సినిమా వెండితెరపై కాకుండా నేరుగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో విడుదల కానుంది. ఈ నెల మార్చి 12న నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతో పాటు పలు దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. కొరియన్ కల్చర్… డ్రామాలకు మన దగ్గర మంచి ఆదరణ ఉన్న తరుణంలో, ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ఓటీటీ ఆడియన్స్‌ను కచ్చితంగా అలరిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.


