అన్నదాత సుఖీభవలో ఊసే లేని వైనం
కూటమి బడ్జెట్లో తీరని అన్యాయం
విశాలాంధ్ర-సచివాలయం: అన్నదాత సుఖీభవ అన్నారు… అండగా ఉంటామని నమ్మబలికారు… తీరా బడ్జెట్ సమయానికి వచ్చేసరికి కౌలు రైతు నోట్లో మట్టి కొట్టారు! రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కౌలు రైతుల సంఘం నిప్ప్పులు చెరిగింది. సాగు రంగంలో సింహభాగం బాధ్యత మోస్తున్న కౌలు రైతులను కూటమి ప్రభుత్వం నిలువునా వంచించిందని రైతు సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. కూటమి ప్రభుత్వం తన మూడవ బడ్జెట్లోనూ కౌలు రైతులను నిలువునా ముంచిందని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం ప్రకటించిన గణాంకాలు కేవలం భూస్వామ్య రైతులకు పరిమితమయ్యా యని, క్షేత్రస్థాయిలో చెమటోడ్చే కౌలు రైతుకు ఈ బడ్జెట్ ఒక ‘చీకటి పత్రం’ అని, ఎన్నికల వేళ ఊరించిన హామీలను అధికారంలోకి వచ్చాక తుంగలో తొక్కడం దారుణమని వారు ధ్వజమెత్తారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా ప్రకటించిన ‘అన్నదాత సుఖీభవ’ పథకంలో కౌలు రైతులకు చోటు కల్పించకపోవడంపై నాయకులు విస్మయం వ్యక్తం చేశారు. రూ.46.86 లక్షల మంది రైతులకు రూ.6,650 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, భూమి లేని లక్షలాది మంది కౌలు రైతులకు ఒక్క పైసా కూడా కేటాయించకపోవ డం వారి పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం చేస్తోందని విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో పండుతున్న పంటల్లో 80 శాతం కౌలు రైతుల కష్టమేనని… వారిలో 10 లక్షల మందికి పైగా భూమి లేని నిరుపేదలు ఉన్నారని తెలిపారు. వీరికి పెట్టుబడి సాయం అందించకుండా వ్యవసాయాభి వృద్ధి ఎలా సాధ్యమని వారు ప్రశ్నించారు. ఎన్నికల ప్రణాళికలో ఊదరగొట్టిన ‘నూతన కౌలు రైతుల చట్టం’ ఊసే బడ్జెట్ ప్రసంగంలో లేకపోవడం విస్మయానికి గురిచేసింది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం షూరిటీ లేని పంట రుణాలు ఇస్తామని చెబుతున్నా, ఆచరణలో కౌలు రైతులకు బ్యాంకు మెట్లు ఎక్కే అవకాశం కూడా లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్ల కోసం హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక కౌలు రైతులను విస్మరిస్తే ఊరుకునేది లేదని, ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలను ఉధతం చేస్తామని రైతు సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు.


