Homeసినిమా‘ధురంధర్ 2’లో 6 నిమిషాల సీన్లు కట్

‘ధురంధర్ 2’లో 6 నిమిషాల సీన్లు కట్

- Advertisement -

హింసపై సెన్సార్ బోర్డు సీరియస్
ముంబై : రణవీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ధురంధర్ 2: ది రివెంజ’ సెన్సార్ పనులు పూర్తి చేసుకుని గురువారం విడుదలకు సిద్ధమైంది. అయితే, ఈ సినిమాకు సెన్సార్ బోర్డు భారీగా కోతలు విధించడం చర్చనీయాంశంగా మారింది. విదేశీ వెర్షన్‌తో పోలిస్తే… భారత్‌లో విడుదలవుతున్న వెర్షన్ దాదాపు 6 నిమిషాల కంటే ఎక్కువ నిడివి తక్కువగా ఉండటం గమనార్హం. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ఎ/యు సర్టిఫికేట్ ఇచ్చినప్పటికీ కొన్ని దృశ్యాలు మరీ భయంకరంగా ఉన్నాయని భావించి వాటిని తొలగించాలని ఆదేశించింది. సెన్సార్ నివేదిక ప్రకారం చిత్ర యూనిట్ మొత్తం 21 మార్పులు చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా కళ్లను తీసేయడం వంటి అత్యంత క్రూరమైన దృశ్యాన్ని తగ్గించారు. తల నరికి తన్నడం అనే సన్నివేశంపై బోర్డు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, అందులోని సుమారు 24 సెకన్ల భాగాన్ని పూర్తిగా తొలగించింది. సుత్తి, సిమెంట్ బ్లాక్స్‌తో తలలను సుత్తితో బాదడం, సిమెంట్ ఇటుకలతో కొట్టే దృశ్యాలకు సెన్సార్ అభ్యంతరం తెలిపింది. కేవలం హింస మాత్రమే కాకుండా సినిమాలో మరికొన్ని కీలక సవరణలు కూడా సూచించింది. సినిమాలో సబ్‌టైటిల్స్‌లో కనిపించే నోట్ల రద్దు తేదీలను వాస్తవ తేదీలకు అనుగుణంగా సరిదిద్దాలని బోర్డు సూచించింది. అలాగే ప్రధాన మంత్రికి సంబంధించిన రిఫరెన్స్‌లు, న్యూస్ ఫుటేజీని ఉపయోగించడానికి మేకర్స్ అధికారికంగా అనుమతి పత్రాలను సమర్పించాల్సి వచ్చింది. కొన్ని అసభ్యకర పదాలను మ్యూట్ చేయడంతో పాటు, ముగింపులో వచ్చే ఎండ్ క్రెడిట్స్ నిడివిని కూడా ఒక నిమిషం తగ్గించి భారతదేశంలో ‘ధురంధర్ 2’ 3 గంటల 49 నిమిషాల 36 సెకన్ల నిడివితో వస్తుండగా ఓవర్సీస్ వెర్షన్ దాదాపు 3 గంటల 55 నిమిషాల నిడివితో కటింగ్‌లు ఏమీ లేకుండా ప్రదర్శితం కానుంది. ఇండియాలో ఇంత భారీ నిడివి ఉన్నప్పటికీ అద్భుతమైన కథనం కారణంగా ప్రేక్షకులకు బోర్ కొట్టదని ట్రేడ్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
ఆ విషయం థియేటర్లలోనే తెలుసుకోండి…
‘ధురంధర’ సీక్వెల్‌లో ‘బడే సాహెబ’ ఎవరు అనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ పాత్రను సల్మాన్ ఖాన్ లేదా ఇమ్రాన్ హష్మీ పోషించి ఉండవచ్చని సోషల్ మీడియాలో ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే, ఈ సస్పెన్స్‌కు రేపు థియేటర్లలోనే తెరపడుతుందని చిత్రబృందం చెబుతోంది.
ఈ ఉత్కంఠను ప్రతి ఒక్కరూ థియేటర్‌లోనే అనుభూతి చెందాలని చిత్ర దర్శకుడు ఆదిత్య కోరారు. ఈ సందర్భంగా ఇన్‌స్టాలో ఒక సుదీర్ఘ పోస్ట్ పెట్టిన ఆదిత్య… పార్ట్`1గా వచ్చిన ‘ధురంధర’ను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. “మీరు మా సినిమాను ప్రేమించారు, అందులో జీవించారు. అందుకే ‘ధురంధర్: ది రివెంజ’తో మిమ్మల్ని ఆశ్చర్యపరచాలని నిర్ణయించుకున్నాం. ఊహించని భావోద్వేగాలను మీకు పంచాలని గట్టిగా ప్రయత్నించాం” అని ఆయన పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు